
మానవపాడు, వెలుగు: ఆర్టీసీ డిపో స్థలంలో షాపుల కూల్చివేతను గురువారం మానవపాడు గ్రామస్తులు, షాపుల యజమానులు అడ్డుకున్నారు. డీడీలు కట్టించుకొని, నోటీసులు ఇవ్వకుండా షాపులను ఎలా కూల్చి వేస్తారంటూ ఆర్టీసీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. మానవపాడులో 24 ఏండ్ల కింద గ్రామస్తులు ఆర్టీసీకి 22 గుంటల స్థలాన్ని ఉచితంగా ఇచ్చారు. ఆ స్థలంలో బస్ షెల్టర్ నిర్మించగా, దాని చుట్టూ 30 మంది డబ్బాలు, షాపులు ఏర్పాటు చేసుకున్నారు. గురువారం డబ్బాలు తొలగించేందుకు జేసీబీలతో ఆర్టీసీ అధికారులు రాగా, గ్రామస్తులు, షాపు ఓనర్లు అడ్డుకున్నారు.
షాపులను నిర్మిస్తామని ఒక్కొక్కరి నుంచి రూ.10 వేల చొప్పున డీడీలు కట్టించుకున్నారని, కిరాయి ఇవ్వాలని లేదంటే ఖాళీ చేయాలని నోటీసు ఇవ్వకుండా షాపులు తొలగించడం అన్యాయమని పేర్కొన్నారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎస్సై చంద్రకాంత్ అక్కడికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. రెండు రోజుల్లో పరిష్కరించుకోవాలని సూచించారు. షాపులను తొలగించడంతో తమకు నష్టం జరిగిందని గ్రామానికి చెందిన నాగరాజు, కిషన్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.