నాగర్ కర్నూల్ జిల్లా మైలారంలో ఉద్రిక్తత.. మైనింగ్ ఆపాలంటూ గ్రామస్తుల నిరసన..

నాగర్ కర్నూల్ జిల్లా మైలారంలో ఉద్రిక్తత.. మైనింగ్ ఆపాలంటూ గ్రామస్తుల నిరసన..

నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం మైలారం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మైనింగ్ ఆపాలని గత కొంత కాలంగా  గ్రామస్తులుఆందోళన  చేస్తున్నారు. మైలారం గ్రామ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్తులు, రైతులు మైనింగ్ ఆపాలంటూ మూడు నెలలుగా ఆందోళన చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న రైతులను, మహిళలను పోలీసులు అరెస్టు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

గ్రామంలో నిరసన తెలుపుతున్న మరి కొందరిని అరెస్టు చేసేందుకు వస్తున్న పోలీసులను గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామంలోకి రావద్దంటూ ముళ్ల కంచెలను ఏర్పాటు చేశారు. అరెస్టు చేసిన రైతులను, నాయకులను వెంటనే విడుదల చేయాలని ఆందోళన తీవ్రతరం చేశారు. 

అరెస్టు చేసిన తమ గ్రామ పరిరక్షణ కమిటీ అధ్యక్షునితో పాటు రైతులను, మహిళలను విడుదల చేయాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటామని రైతులు నినాదాలు చేశారు. కొందరు రైతులు ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మైనింగ్ వెంటనే ఆపేసి తమ గ్రామం వదిలి వెళ్లిపోవాలంటూ గ్రామస్తులు నిరసన చేస్తుండటంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. 

పౌరహక్కుల నేతల అరెస్టు:

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని బల్మూరు మండలం మైలారంలో గ్రామస్తులు చేస్తున్న ఆందోళనకు మద్ధతు తెలిపేందుకు వస్తున్న పౌర హక్కుల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్ నుంచి వస్తున్న ప్రొఫెసర్ హరగోపాల్, గడ్డం లక్ష్మణ్ ను పోలీసులు వెల్దండలో అడ్డుకుని పోలీసు స్టేషన్ కు తరలించారు.