నోముల ఫ్యామిలీకి చెక్ పెట్టేందుకు ఓ వర్గం తీవ్ర ప్రయత్నాలు
అదే కులానికి చెందిన కొత్త వ్యక్తుల పేర్లు తెరపైకి
నియోజకవర్గంలో బయటపడుతున్న అసంతృప్తులు
నల్గొండ, వెలుగు:నాగార్జునసాగర్ బైపోల్లో రూలింగ్ పార్టీ అభ్యర్థి ఎవరనేది అంతు చిక్కడం లేదు. రోజుకో అభ్యర్థి పేరు తెరపైకి వస్తుండటంతో నియోజకవర్గం లో పార్టీ కేడర్ అయోమయంలో పడింది. రెండు రోజులుగా కొత్తగా మరికొందరి పేర్లు తెరపైకి రావడంతో సాగర్‌లో గులాబీ రాజకీయం రసకందాయంలో పడింది. మండలాలవారీగా ఎమ్మెల్యేలను ఇన్చార్జిలుగా నియమించి రెండు రోజులు కూడా గడవకముందే పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్ని సర్వేలు చేయించినా, మీటింగ్‌ల మీద మీటింగ్‌లు పెడుతున్నా టీఆర్ఎస్అభ్యర్థిని తేల్చడం కష్టమైపోతోంది. బీసీలని, రెడ్లు అని, యాదవులని పూటకో మాట వినిపిస్తుందే తప్ప అభ్యర్థిత్వం మాత్రం కొలిక్కి రావడం లేదు. స్థానిక కుల సమీకరణాలు, కాంగ్రెస్, బీజేపీ బలాబలాల గురించి ఏ మాత్రం అంచనాకు రాలేకపోతున్నారు. కాంగ్రెస్ కంటే పదిశాతం ముందున్నామని చెప్తున్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఎందుకు ప్రకటించట్లేదన్న చర్చ కూడా స్థానికంగా జరుగుతోంది.
మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న వర్గమే..
ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆకస్మిక మరణంతో అనివార్య మైన సాగర్ బైపోల్లో నోముల కుటుంబానికే టికెట్ వస్తదని ఫస్ట్ నుంచి ప్రచారం జరిగింది. ఇప్పటివరకు జరిగిన బైపోల్స్‌లో టీఆర్ఎస్ కొనసాగించిన సంప్రదాయాన్నే సాగర్‌లో కూడా ఆచరిస్తారని అంతా భావించారు. ఆ మేరకు పార్టీ హైకమాండ్ రకరకాల సర్వేలు చేయించింది. అయితే స్థానికేతరులు కాబట్టి నోముల ఫ్యామిలీకి ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వొద్దని పార్టీలోని ఓవర్గం బలంగా వ్యతిరేకిస్తోంది. దీంతో అదే యాదవ కులానికి చెందిన స్థానికులకు టికెట్ ఇస్తే ఎలా ఉంటదనే దానిపై హైకమాండ్ మల్లగుల్లాలు పడుతోంది. మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రామ్మూర్తియాదవ్ అల్లుడు కట్టెబోయిన గురవయ్య యాదవ్, పెద్దబోయిన శ్రీనివాస్‌యాదవ్, మన్నెం రంజిత్‌యాదవ్ పేర్లను కొత్తగా తెరపైకి తీసుకొచ్చారని పార్టీ వర్గాలో చర్చ నడుస్తోంది. మొదటి నుంచి నోముల ఫ్యామిలీని వ్యతిరేకిస్తున్న వర్గమే ఈ ప్రపోజల్స్‌ను తెరపైకి తీసుకొచ్చిందని చెప్తున్నారు. దీంతో స్థానికేతర వివాదం సమసి పోవడమేగాక, బీసీలు, యాదవుల ఓట్లు
చీలిపోవని అంచనా వేస్తున్నారు. రామ్మూర్తి యాదవ్‌కు నియోజకవర్గంలో పెద్ద బలగమే ఉంది. గతంలో జానారెడ్డిని ఓడించారు. దీంతో ఆయన కుటుంబ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకునే గురవయ్య యాదవ్ పేరును బలంగా వినిపిస్తున్నారు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పలుకుబడి ఉండటంతో గురవయ్య పేరును హైకమాండ్ సీరియస్‌గానే పరిశీలిస్తోందని చెప్తున్నారు. రామ్మూర్తి యాదవ్ మరో అల్లుడు బడుగుల లింగయ్య యాదవ్ ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉండటం కూడా కలిసొచ్చే అంశమేనని అంటున్నారు.
బయటపడ్తున్న విభేదాలు
నోముల ఫ్యామిలీకి టికెట్ రాదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కామర్ల జానయ్య, ఎంపీపీ బొల్లం జయమ్మ, మండల పార్టీల నాయకులు నోముల ఫ్యామిలీకి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. హాలియాలో నిర్వహించిన ప్రెస్మీట్లో వారు మాట్లాడారు. స్థానికేతరుడన్న కారణంతో టికెట్ ఇవ్వకుండా ఉండటం సరికాదన్నారు. ఇదే క్రమంలో ఎమ్మెల్సీ తేరా చిన్నప్పరెడ్డి వర్గం సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. గురవయ్య యాదవ్ పేరు ప్రచారంలోకి రావడంతోనే ఆయన అత్యంత సన్నిహితులు జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిపోయారని చిన్నప్పరెడ్డి వర్గం ప్రచారం చేస్తోంది. గురవయ్యకు మంత్రి అనుచరుడు ఎంసీ కోటిరెడ్డి సపోర్ట్ ఉందని అంటున్నారు. హైకమాండ్ జరిపిన సర్వేలో కోటిరెడ్డికి టికెట్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. కోటిరెడ్డికి టికెట్ ఇవ్వని పక్షంలో స్థానికులకే.. అందులో యాదవ కులానికే ఇవ్వాలనే ప్రతిపాదనను ఆ వర్గం నేతలే తెరపైకి తీసుకొచ్చారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.