వనస్థలిపురంలో తీవ్ర ఉద్రిక్తత.. బస్సుల అద్దాలు ధ్వంసం.. బైకులకు నిప్పు

వనస్థలిపురంలో తీవ్ర ఉద్రిక్తత.. బస్సుల అద్దాలు ధ్వంసం.. బైకులకు నిప్పు

హైదరాబాద్: వనస్థలిపురం కమ్మగూడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కమ్మగూడ సర్వే నంబర్ 240లోని 10 ఎకరాల భూమి విషయంలో ప్లాట్స్ ఓనర్స్‎కి, పట్టదారులకు మధ్య గత కొద్ది రోజులుగా వివాదం నడుస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భూ యజమానికి అనుకూలంగా కొద్దిరోజుల క్రితం హై‎కోర్ట్ తీర్పు ఇచ్చింది. దీంతో భూ యజమాని బుధవారం (ఏప్రిల్ 9) ఆ భూమిలో పనులు చేసుకుంటుండగా ప్లాట్ ఓనర్స్ అడ్డుకున్నారు. 

ఈ క్రమంలో ప్లాట్స్ ఓనర్స్‎, పట్టదారుల మధ్య వివాదం చేలరేగింది. ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వెనక్కి తగ్గని ఇరువర్గాలు పోలీసుల ముందే ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో బస్సుల అద్దాలు ధ్వంసం అయ్యాయి. 

ప్లాట్ ఓనర్లు ఆగ్రహంతో పలు బైక్‎లకు నిప్పు పెట్టారు. బైకులు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. పరిస్థితి చేయి దాటుతుండటంతో అప్రమత్తమైన పోలీసులు.. ఇరువర్గాలను చెదరగొట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఘటన స్థలంలో పోలీసులను మోహరించారు.