మినిస్టర్స్ క్వార్టర్స్ దగ్గర ఉద్రిక్తత.. VRA వారసుల మెరుపు ధర్నా

మినిస్టర్స్ క్వార్టర్స్ దగ్గర ఉద్రిక్తత.. VRA వారసుల మెరుపు ధర్నా

హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వీఆర్ఏల వారసులు మినిస్టర్ క్వార్టర్స్ ముందు మెరుపు ధర్నాకు దిగారు. 81 ,85 జీవో ప్రకారం 61 సంవత్సరాలు పై బడిన వీఆర్ఏల ఉద్యోగాలు వారి వారసులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మినిస్టర్ క్వార్టర్స్ ముందు బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచిన వీఆర్ఏలు సమస్యలు పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వచ్చి మాకు హామీ ఇవ్వాలని.. అప్పుడే ఆందోళన విరమిస్తామని తేల్చి చెప్పారు. 

20,555 మంది వీఆర్ఏలలో 16, 758 మందికే నియామక పత్రాలు ఇచ్చారని.. మిగిలిన వారికి కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏల కుటుంబ సభ్యుల మెరుపు ధర్నాతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే మినిస్టర్స్ క్వార్టర్స్ ముందు బైఠాయించిన వీఆర్ఏల వారసులను అదుపులోకి తీసుకున్నారు. 

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులను మోహరించారు. వీఆర్ఏల మెరుపు ధర్నాతో నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే.. బంజారాహిల్స్ రోడ్ నెం 12లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు.. వాహనాల రద్దీని క్లియర్ చేశారు.