- సర్కార్ మారగానే సొంత పార్టీ లీడర్ల తిరుగుబాటు!
- జడ్పీ పీఠంపై అసంతృప్తుల కన్ను
- ఆరునెలలే ఉన్నా.. పదవి కోసం ప్రయత్నాలు
- బల్దియాల్లోనూ అదే తీరు
- కాంగ్రెస్‌లో చేరిన కోరుట్ల కౌన్సిలర్లు.. మెట్‌పల్లిలోనూ రెడీ అవుతున్న కౌన్సిలర్లు
జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా బీఆర్ఎస్‌లో వర్గపోరు మొదలైంది. అధికారంలో ఉన్నప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గవిభేదాలు.. అధికారం కోల్పోయి పూర్తిగా నెల కూడా కాకముందే బయటపడుతున్నాయి. గతంలో పదవులు ఆశించి భంగపడ్డ లీడర్లతో పాటు మూడోసారి అధికారంలోకి వస్తే పదవులు వస్తాయని ఆశించిన కౌన్సిలర్లు, జడ్పీటీసీలు అవిశ్వాస అస్త్రాలను ప్రయోగించడానికి రెడీ అవుతున్నారు.
జగిత్యాల జడ్పీ చైర్పర్సన్దావా వసంతపై అవిశ్వాసం పెట్టేందుకు కొంతమంది జడ్పీటీసీలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. గతంలో జడ్పీ పీఠం ఆశించి భంగపడిన ఓ కీలక నేత చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. పాలకవర్గం పదవీకాలం మరో ఆరునెలలే ఉన్నా.. అసంతృప్తులు పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. మరోవైపు కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాలిటీల్లోనూ బీఆర్ఎస్ పార్టీకి అవిశ్వాస టెన్షన్ నెలకొంది. ఈక్రమంలో జగిత్యాల జిల్లాలో బీఆర్ఎస్రెండు వర్గాలుగా చీలినట్లు తెలుస్తోంది. కాగా పార్టీ అధికారం కోల్పోవడంతో హైకమాండ్ఆదేశాలను పట్టించుకునే స్థితిలో అసమ్మతులు లేరు. మరికొన్ని నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న తరుణంలో అవిశ్వాస ప్రయత్నాలు బీఆర్ఎస్‌కు తలనొప్పిగా మారాయి.
జడ్పీ చైర్‌పర్సన్‌పై తిరుగుబాటు..?
జగిత్యాల జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంతపై అవిశ్వాసం పెట్టాలని కొందరు జడ్పీటీసీలు ప్రయత్నిస్తోన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో 18 జడ్పీటీసీ స్థానాలు ఉండగా, ఇందులో 16 మంది బీఆర్ఎస్, ఇద్దరు కాంగ్రెస్ జడ్పీటీసీలు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు చైర్పర్సన్దావ వసంతపై అవిశ్వాసం పెట్టేందుకు అసమ్మతులు పావులు కదిపినప్పటికీ.. హైకమాండ్ ఆదేశాలతో సద్దుమణిగింది. అవిశ్వాసం నెగ్గాలంటే 12 మంది జడ్పీటీసీలు మద్దతు అవసరం. కాగా జడ్పీ పదవి ఆశిస్తున్న ఓ కీలక నేత.. చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
ఇందుకు ఆయన ఓ ఆరుగురు జడ్పీటీసీలకు రూ. 2 లక్షల చొప్పున ముట్టజెప్పినట్లు ప్రచారం నడుస్తోంది. మెజార్టీకి కావల్సిన సంఖ్యా బలం కోసం ఆయన మంతనాలు చేస్తూ ఎలాగైనా జడ్పీ పీఠం దక్కించుకోవాలని ప్రయత్నిస్తోన్నట్లు సమాచారం. ఈ విషయమై జడ్పీ చైర్‌పర్సన్ వసంత.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసువెళ్లారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎదురు లేకుండా ఉన్న పార్టీ ప్రస్తుతం గ్రూపు రాజకీయాలతో గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది.
గతంలో పార్టీకి గాడ్ ఫాదర్ గా వ్యవహరించిన ఇద్దరు సీనియర్ లీడర్లు విభేదాలను చక్కదిద్దుతూ వచ్చారు. పార్టీ అధికారంలో కోల్పోయి కాంగ్రెస్ సర్కార్రావడంతో కనీసం స్థానిక సంస్థల పదవీకాలం ముగిసే వరకైనా పదవులు దక్కించుకోవాలని బీఆర్ఎస్ అసంతృప్తి లీడర్లు పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.
జగిత్యాలో సీక్రెట్ మీటింగ్స్
జగిత్యాల బల్దియా చైర్ పర్సన్ పీఠం బీసీ మహిళకు కేటాయించడంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన బోగ శ్రావణి చైర్ పర్సన్ పదవి దక్కించుకున్నారు. మూడేళ్ల తర్వాత బీసీలను వేధిస్తున్నారనే అరోపణలు చేస్తూ బీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తారు.
అయితే హై కమాండ్ మరో బీసీ నేతలకు అవకాశం ఇవ్వకుండా వైస్ చైర్మన్గోలి శ్రీనివాస్‌కు ఇన్‌చార్జిగా అవకాశం ఇవ్వడంతో అసెంబ్లీ ఎన్నికల్లోపు బీసీలకు చైర్మన్పదవి కట్టబెట్టాలని బీసీ కౌన్సిలర్ల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చింది. ఆ టైంలో ఈ మేరకు హామీ రావడంతో తాత్కాలికంగా వివాదం సద్దుమణిగింది. ఎన్నికల తర్వాత హైకమాండ్ స్పందించకపోవడంతో ఆశావాహులు సీక్రెట్మీటింగ్స్, క్యాంపు రాజకీయాలకు తెరతీస్తున్నారు.
బీఆర్ఎస్‌కు రాజీనామా
మెట్‌పల్లి : మెట్‌పల్లి మున్సిపాలిటీకి చెందిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు , ఓ కోప్షన్ సభ్యుడు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. శనివారం నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు సమక్షంలో కౌన్సిలర్లు మర్రి సహదేవ్, పిప్పెర లలిత, చర్లపల్లి లక్ష్మి, బీజేపీ కౌన్సిలర్ జక్కని సుజాత, ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు, కోఆప్షన్ మెంబర్ గంగాధర్ కాంగ్రెస్‌లో చేరారు. వీరితోపాటు పలువురు లీడర్లు అధికార పార్టీలో చేరారు. ఇప్పటికే కోరుట్ల కౌన్సిలర్లు చేరిన సంగతి తెలిసిందే.