ఇండిపెండెంట్లతో టెన్షన్.!.. ఈసారి బరిలో ఏకంగా 27 మంది

  •     ఇదివరకు పోటీలో ఉన్న ఆరుగురు స్వతంత్రులకు 36 వేలకు పైగా ఓట్లు
  •     నోటాకు పెరిగినా గెలుపు అవకాశాలపై ప్రభావం
  •     వరంగల్ ఎంపీ సీట్ పై మూడు పార్టీల ఫోకస్ 
  •     ప్రతి ఓటునూ కీలకంగా భావిస్తున్న నేతలు

హనుమకొండ, వెలుగు: వరంగల్​ఎంపీ స్థానంలో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీలకు ఇండిపెండెంట్ల టెన్షన్​పట్టుకుంది. మూడు పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉండగా, అభ్యర్థులు ప్రతి ఓటునూ కీలకంగా భావిస్తున్నారు. ఇదే సమయంలో అభ్యర్థులకు ఇండిపెండెంట్ల గుబులు పట్టుకుంది. గత ఎంపీ ఎన్నికల్లో ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేసి దాదాపు 36 వేలకు పైగా ఓట్లు కొల్లగొట్టగా, ఇప్పుడు ఏకంగా 27 మంది పోటీలో నిలిచారు. దీంతో స్వతంత్రులు ప్రభావం చూపితే అభ్యర్థుల గెలుపు అవకాశాలపై ఎఫెక్ట్ పడనున్నది. 

పోటీలో 27 మంది ఇండిపెండెంట్లు..

గత లోక్​సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పసునూరి దయాకర్, కాంగ్రెస్ అభ్యర్థిగా దొమ్మటి సాంబయ్య, బీజేపీ నుంచి చింతా సాంబమూర్తి పోటీ చేశారు. ఆ సమయంలో రాష్ట్రంలో  బీఆర్ఎస్​ హవా ఉండటం, కాంగ్రెస్, బీజేపీలు పెద్దగా ప్రభావం లేకపోవడంతో కారు పార్టీకి గెలుపు ఈజీ అయ్యింది. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు సహా ఇండిపెండెంట్లు పెద్దగా పోటీ ఇవ్వలేకపోయారు. ఆరుగురు ఇండిపెండెంట్లు పోటీ చేస్తే, వారందరికీ ఏకంగా 36,402 ఓట్లు పోలయ్యాయి. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు స్థానాల్లో కాంగ్రెస్సే అధికారంలో ఉండగా, ఆ పార్టీకి మొగ్గు కనిపిస్తుండగా, బీజేపీ తన ప్రయత్నాల్లో తానుంది. ఇక రాష్ట్రంలో, జిల్లాలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్​ చతికిలపడిపోయింది. ఈ పార్టీకి ఏకపక్షంగా ఓట్లు పడే అవకాశం లేకపోవడంతో ఇండిపెండెంట్లు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు వరంగల్ ఎంపీ స్థానానికి మొత్తంగా 42 మంది పోటీ పడుతున్నారు. అందులో ప్రధాన పార్టీలతో పాటు చిన్న పార్టీల తరఫున 15 మంది బరిలో ఉండగా, స్వతంత్ర అభ్యర్థులు ఏకంగా 27 మంది పోటీలో నిలవడం గమనార్హం.

నోటా భయం..

2014లో వరంగల్ ఎంపీ స్థానంలో మొత్తంగా నోటాకు 14,034 ఓట్లు పోలవగా, 2019 ఎన్నికల్లో ఏకంగా 18,801 ఓట్లు నోటాకే పడ్డాయి. 2019 ఎలక్షన్స్​లో ఇండిపెండెంట్లు 36 వేలు, నోటాకు 18 వేలు కలిపి మొత్తంగా 54 వేల ఓట్లు ప్రధాన పార్టీల అభ్యర్థులకు అందకుండా పోయాయి. ఈ సారి కూడా ఇలాగే జరిగితే అభ్యర్థుల అంచనాలు తలకిందులయ్యే ఛాన్స్ ఉంది. దీంతోనే ఓట్లు రాబట్టుకోవడంలో ఆచితూచీ అడుగులు వేస్తున్నారు.

ఎవరిపై ఎఫెక్ట్ పడేనో..

 వరంగల్​లోక్​సభ స్థానం ఎస్సీ రిజర్వ్ కాగా, అధికార కాంగ్రెస్ నుంచి కడియం కావ్య, బీజేపీ నుంచి ఆరూరి రమేశ్, బీఆర్ఎస్ నుంచి మారేపెల్లి సుధీర్ కుమార్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ముగ్గురు అభ్యర్థులకూ ఎంపీ ఎలక్షన్స్ చావోరేవో అన్నట్టుగానే ఉన్నాయి. ఎన్నడూ లేనంతగా ఈసారి 27 మంది ఇండిపెండెట్లు పోటీ చేస్తుండటం అభ్యర్థులను కలవరపెడుతోంది. స్వతంత్ర అభ్యర్థుల్లో కొందరు ఇదివరకు పోటీ చేసిన వారు, ఇద్దరు ముగ్గురు విద్యార్థి నాయకులు ఉన్నారు. గతంతో పోలిస్తే ఈసారి ఇండిపెండెంట్లకు కూడా ఓట్లు పెరిగే అవకాశం ఉంది. వరంగల్ పార్లమెంట్ పరిధిలో 18 లక్షల పైచిలుకు ఓట్లుండగా, ఇండిపెండెంట్లకు ఎక్కువ ఓట్లు చీలినా ప్రధాన పార్టీల ఫలితాలు మారిపోయే ఛాన్స్ ఉంది.