- ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్‌లోకి పెరుగుతున్న చేరికలు
- పార్లమెంట్ పోరు తర్వాత లోకల్ బాడీ ఎన్నికలపై ఎఫెక్ట్
- అయోమయంలో గులాబీ నేతలు
నల్గొండ, వెలుగు : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్కు వలసల టెన్షన్పట్టుకుంది. పన్నెండు నియోజకవర్గాల్లో దాదాపు బీఆర్ఎస్ ఖాళీ అయ్యింది. ముఖ్యంగా మున్సిపాలిటీ పాలకవర్గాలన్నీ కాంగ్రెస్ ఖాతాలో చేరిపోయాయి. మండల, జిల్లా స్థాయిలో లోకల్‌బాడీ ప్రజాప్రతినిధులు సైతం కాంగ్రెస్‌లో చేరడంతో బీఆర్ఎస్ కేడర్అయోమయంలో పడింది. ఈ ఎఫెక్ట్ పార్లమెంట్ఎన్నికలపైనే కాకుండా వచ్చే లోకల్‌బాడీ ఎన్నికల మీద కూడా ప్రభావం చూపుతుందేమోనని గులాబీ నేతలు ఆందోళన చెందుతుందుతున్నారు.
ఒకవైపు గ్రామ, మండల, పట్టణ స్థాయిలో కాంగ్రెస్మరింత బలపడుతుండగా, మరోవైపు బీఆర్ఎస్లో చేరినవారంతా తిరిగి సొంత గూటికి వస్తుండడంతో కొత్త చిక్కులు తెచ్చిపెడ్తోంది. పలుచోట్ల చేరికలను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో వివిధ సామాజిక వర్గాల ఓటర్లను ప్రభావితం చేయగలిగే ప్రజాప్రతినిధులు గంపగుత్తగా కాంగ్రెస్‌లో చేరుతున్నారు.
ఎన్నికల ప్రచారానికి నేతల కరువు..
పార్లమెంట్ఎన్నికలు బీఆర్ఎస్కు అగ్ని పరీక్షగా మారాయి. ఏకంగా మాజీ సీఎం కేసీఆర్రంగంలోకి దిగారు. కానీ, క్షేత్రస్థాయిలో వలసలు బీఆర్ఎస్కు పెద్ద సవాల్‌గా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలని బీఆర్ఎస్ హైకమాండ్ ఆదేశించింది. నియోజకవర్గ మీటింగ్‌లు ముగియడంతో ఇప్పుడు ఇంటింటి ప్రచారం మీద ఫోకస్ పెట్టారు. నల్గొండ ఎంపీ సెగ్మెంట్పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో సూర్యాపేట మినహా అన్ని మున్సిపాలిటీలు కాంగ్రెస్ఖాతాలో చేరాయి. ఎంపీపీలు, జడ్పీటీసీలు, మాజీ సర్పంచులతోపాటు బడా, చోటా లీడర్లు అందరూ గంపగుత్తుగా కాంగ్రెస్‌గూటికి చేరారు.
భువనగిరి ఎంపీ సెగ్మెంట్లో నకిరేకల్మున్సిపాలిటీ మినహా బీఆర్ఎస్ ఖాళీ అయ్యింది. మునుగోడు, భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీలు అవిశ్వాస తీర్మానాలతో బీఆర్ఎస్ పాలకవర్గాలను గద్దెదించారు. ఆయా మండలాలు, గ్రామాల్లో బలమైన సామాజిక వర్గాల ముఖ్యనేతలు కాంగ్రెస్‌లో చేరడంతో బీఆర్ఎస్ తరపున ప్రచారం చేయడానికి నాయకులు కరువయ్యారు. దీంతో ఎన్ని కల ప్రచారాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో అర్థంకావడం లేదు. మునుగోడు, కోదాడ, నకిరేకల్, భువనగిరి, దేవరకొండ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు ఎంపీ ఎన్నికలను లైట్‌గా తీసుకుంటున్నారు.
కాంగ్రెస్‌లో భారీగా చేరికలు..
తాజాగా చౌటుప్పుల్మున్సిపాలిటీలో ఆరుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు, సంస్థాన్నారాయాణ్పూర్ బీఆర్ఎస్మండలాధ్యక్షుడు కత్తుల లక్ష్మయ్య, పుట్టపాక మాజీ సర్పంచ్ భాస్కర్ తదితరులు ఆదివారం పార్లమెంట్ ఎన్నికలఇన్చార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. దీంతో మునుగోడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఖాళీ అయినట్టే.
బీసీ ఓటర్లు బలంగా ఉన్న మునుగోడులో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఆ వర్గం ఓటర్లపైనే ఆశలు పెట్టుకున్నారు. కానీ, కొద్దిరోజుల నుంచి మునుగోడు ఎమ్మెల్యే చొరవతో కాంగ్రెస్‌లో చేరేందుకు క్యూకడుతున్నారు. దీంతో బీఆర్ఎస్కు గట్టి ఎదురుదెబ్బ తగలింది. కాంగ్రెస్భువనగిరి ఎంపీ అభ్యర్థి గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రోడ్‌షోలు, ర్యాలీలు నిర్వహిస్తూ చేరికలపై ఫోకస్‌పెట్టారు. చివరకు పార్టీలో ఎంత మంది ఉంటారో బీఆర్ఎస్నాయకులకు అంతుచిక్కడం లేదు.