సిట్టింగ్​లకే టికెట్లు! .. కాంగ్రెస్​లో భట్టి, పొదెం పేర్లు మాత్రమే ఖరారు

  • సీపీఐ, కాంగ్రెస్​ మధ్య పొత్తులు.. సీట్లపై కొనసాగుతున్న సస్పెన్స్​
  • బీఆర్ఎస్​ క్యాండెట్లకు బీఫారాలిచ్చిన కేసీఆర్​
  • ఇంకా ఖరారు కాని బీజేపీ అభ్యర్థులు

ఖమ్మం/ భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కాంగ్రెస్​లో టికెట్ల టెన్షన్​ కొనసాగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాలకు గాను రెండు సిట్టింగ్ స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించింది. మధిర నుంచి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, భద్రాచలం నుంచి పొదెం వీరయ్యకు ఫస్ట్ లిస్ట్ లో ప్లేస్​ దక్కింది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నుంచి పోటీ చేయాలని ఏకంగా రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ చెప్పినా తొలి జాబితాలో మాత్రం ఆయన పేరు లేదు.

ఈ పరిస్థితితో మిగతా నియోజకవర్గాల్లోని ఆశావహుల్లో ఆందోళన మొదలైంది. సెకండ్​ లిస్ట్​పైనే వారు గంపెడాశలు పెట్టుకున్నారు. మరో వైపు కమ్యూనిస్టులు, కాంగ్రెస్​ పొత్తుల సీట్ల పంపిణీపై ఎడతెగని ఉత్కంఠ నెలకొంది. భద్రాచలం సీటును సీపీఎం కోరుకున్నప్పటికీ కాంగ్రెస్​ తమ క్యాండెట్​ను ప్రకటించడంతో ఆ స్థానంపై కామ్రేడ్స్​ ఆశలు వదులుకున్నారు. 

ఎక్కడ.. ఏ పరిస్థితి? 

ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాలకు గానూ కేవలం మధిర, భద్రాచలం టికెట్లను మాత్రమే కాంగ్రెస్​ హైకమాండ్​ ఆదివారం ఫైనల్​ చేసింది. కొత్తగూడెంపై కాంగ్రెస్​, సీపీఐ మధ్య పొత్తు ఇంకా ఫైనల్​ కాలేదు. కాగా ఈ సీటు తమకే కావాలని సీపీఐ పట్టుబడుతోంది. కానీ కొత్తగూడెం నుంచి మాజీ ఎంపీ, టీపీసీసీ ప్రచారం కమిటీ కో చైర్మన్​ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి పోటీ చేస్తారంటూ ఆయన అనుచరులు కొంత కాలంగా ప్రచారం చేస్తున్నారు.

అలాగే పాలేరు నుంచి పొంగులేటి పోటీ చేస్తారన్న ప్రచారం కూడా ఉంది. రాష్ట్రంలోనే కాంగ్రెస్​లో అత్యధికంగా ఇల్లెందు టికెట్​కోసం 36 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఇల్లెందుతో పాటు పినపాక, అశ్వారావుపేట స్థానాలపై పార్టీ హైకమాండ్​ఆచితూచి అడుగులు వేస్తోంది. ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావును హైకమాండ్​ ఫైనల్​ చేసినా ఇంకా ప్రకటించలేదు. వైరాను పొత్తులో భాగంగా సీపీఎంకు కేటాయించే అవకాశాలున్నాయి. సత్తుపల్లి అభ్యర్థిని ఇంకా ఫైనల్​ చేయలేదు.

బీఆర్​ఎస్​ బీఫారాలిచ్చింది.. బీజేపీ క్యాండెట్లను ప్రకటించాల్సి ఉంది.. 

జిల్లాలో బీఆర్​ఎస్​ గతంలో ప్రకటించిన క్యాండెట్లు పువ్వాడ అజయ్, కందాల ఉపేందర్​ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, మదన్​ లాల్, లింగాల కమల్ రాజు, వనమా వెంకటేశ్వరరావు, రేగా కాంతారావు, భానోత్​ హరిప్రియ, మెచ్చా నాగేశ్వరరావు, తెల్లం వెంక్రటావుకు బీ ఫారాలు ఇచ్చింది. అయితే ఇల్లెందు నుంచి బీఆర్​ఎస్​ తరుపున పోటీ చేసే సిట్టింగ్​ ఎమ్మెల్యే భానోత్​ హరిప్రియకు బీఫారం ఇవ్వొద్దంటూ నియోజకవర్గం వ్యాప్తంగా అసమ్మతి పెద్ద ఎత్తున రాజుకుంది.

ఇదే విషయమై అసమ్మతి నేతలు మంత్రులు కేటీఆర్, హరీశ్​రావుకు మొర పెట్టుకున్నారు. కానీ ఆమెకే బీఫారం రావడంతో అసమ్మతి వర్గంలో నిరాశ నెలకొంది. మరో వైపు కొత్తగూడెం సిట్టింగ్​ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత కేసు కోర్టులో నడుస్తోంది. ఈనెల 31న తీర్పు రానుంది. ఈ క్రమంలో బీ ఫారంపై కొంత ఉత్కంఠ నెలకొనగా వనమాకు బీ ఫారం ఇవ్వడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు కొత్తగూడెంలో సంబరాలు చేసుకున్నారు. ఇదిలా ఉండగా బీజేపీ తరుపున పోటీ చేసే క్యాండెట్ల వివరాలను ఇంకా ప్రకటించలేదు. దీంతో టికెట్ల ఫైనల్​ఇంకా ఎప్పుడని ఆశావాహులు ఆశతో ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితులతో ఆయా నియోజకవర్గాల్లో, ఆశావహుల్లో అంతా టెన్షన్​ టెన్షన్​గా ఉంది.