ఛత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దులో టెన్షన్ టెన్షన్.. కర్రెగుట్టల్లో ఏ క్షణంలోనైనా ఎన్కౌంటర్

ఛత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దులో టెన్షన్ టెన్షన్.. కర్రెగుట్టల్లో ఏ క్షణంలోనైనా ఎన్కౌంటర్

ఛత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దులో టెన్షన్ వాతావరణం నెలకొంది. కర్రెగుట్టపై కీలక నేతలతో పాటు వేయి మందికిపైగా మావోయిస్టు తలదాచుకున్నారనే సమాచారంతో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. దీంతో కర్రెగుట్ట చుట్టూ భద్రతా బలగాల హెలికాప్టర్లు చక్కర్లు కొడుతున్నాయి. హెలికాప్టర్లతో గుట్టపైన రాకెట్ లాంచర్స్ తో మెరుపుదాడి చేయాలని పోలీస్ బలగాలు భావిస్తున్నట్లు సమాచారం. దీంతో తెలంగాణ ఛత్తీస్ గఢ్ సరిహద్దు ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. 

బుధవారం (ఏప్రిల్ 23) కర్రెగుట్టలలో భారీ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. 12 వేల మంది పోలీస్ బలగాలు చుట్టుముట్టాయి. చుట్టూ 140 కి.మీ. పరిధిలో సాయుధ బలగాల మోహరించారు. కర్రెగుట్టలను జల్లెడ పడుతూ  బలగాలు ముందుకు కదులుతున్నాయి. దీంతో ఏ క్షణంలోనైనా ఎన్ కౌంటర్ జరిగే అవకాశం ఉందని పోలీసు వర్గాలు భావిస్తు్న్నాయి. 

కర్రె గుట్టలలో గెరిల్లా దళపతి హిడ్మాతో పాటు వెయ్యి మంది మావోయిస్టులు ఉన్నారని నిఘా వర్గాల సమాచారం. మావోయిస్టులు ప్రతిదాడి చేసే అవకాశం ఉండడంతో ఎయిర్ సపోర్ట్ తో ముందుకు కదులుతున్నారు. హెలికాప్టర్లు, డ్రోన్ లతో  పాటు రోప్ ల సాయంతో కర్రెగుట్టలపైకి చేరుకుంటున్నాయి పోలీస్ బలగాలు. ఛత్తీస్ గఢ్ నుంచి తెలంగాణ బార్డర్ వైపుకు బలగాల కదులుతున్నాయి. మావోయిస్టు దళాలు పారిపోకుండా కొత్తగూడెం, ములుగు వైపు కేంద్ర, రాష్ట్ర బలగాలు మోహరించాయి. 

కేంద్రం ఈ నరమేధాన్ని ఆపాలి: పౌర హక్కుల నేతలు

భద్రతా బలగాల దాడిని పౌర హక్కుల నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కేంద్రం ఈ నరమేధం ఆపాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కాల్పులు ఆపాలని విజ్ఞప్తి చేశారు. 
మావోయిస్టులు శాంతి చర్చలకు పిలుపునిచ్చినా కూడా.. ఏకపక్షకాల్పులు జరపడం సరి కాదని అంటున్నారు. కాల్పులు విరమించి శాంతిచర్చలు జలపాలని డిమాండ్ చేశారు.