- త్వరలో రీయింబర్స్మెంట్ వస్తుందంటున్న ఆఫీసర్లు
నాగర్‌కర్నూల్, వెలుగు: ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు ఫీజు చెల్లింపుల టెన్షన్ పట్టుకుంది. డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ల సమయంలో ఎలాంటి ఫీజులు ఉండవని చెప్పి, కాలేజీలో చేరిన తరువాత కోర్సుకు ఏడాదికి రూ.2.350 నుంచి రూ.5 వేల వరకు ఫీజు కట్టాలంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గవర్నమెంట్ డిగ్రీ కాలేజీల్లో బీఏ, బీఎస్సీ, బీకాం కోర్సుల్లో చేరిన తమను ‘ఆక్టోపాడ్’ ఆన్లైన్ సైట్లో అడ్మిషన్, బయోమెట్రిక్ ఫీజు చెల్లించి కాలేజీలో రిసిప్ట్ ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని విద్యార్థులు అంటున్నారు.
పేద, మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన తమకు ఫీజులు భారంగా మారాయని అంటున్నారు. ఇదిలాఉంటే రీయింబర్స్మెంట్ డబ్బులు త్వరలో రిలీజ్ అవుతాయని ఆఫీసర్లు చెబుతున్నారు. ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో చేరిన విద్యార్థులకు ఆర్టీఎఫ్ కింద రీయింబర్స్మెంట్ డబ్బును కాలేజీ అకౌంట్లో జమ చేస్తూ, మెస్ చార్జీలను విద్యార్థులకు చెల్లిస్తున్నారు. తాము కాలేజీ ఫీజు కట్టాలని ఇంట్లో చెబితే తమ పేరెంట్స్ నమ్మడం లేదని, పనులు మానుకుని కాలేజీకి వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారని వాపోతున్నారు. 15 రోజుల కింద కల్వకుర్తి మోడల్ డిగ్రీ కాలేజీని విజిట్ చేసిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డికి విద్యార్థులు ఫీజు గోడును వివరించారు. ఫీజు భారం తప్పించాలని వేడుకున్నారు.
మూడేండ్లుగా రీయింబర్స్మెంట్ ఇయ్యట్లే..
నాగర్ కర్నూల్ జిల్లాలో 7 గవర్నమెంట్, 8 ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ప్రైవేట్ కాలేజీల్లో చదివే వారికి ఫీజు రీయింబర్స్మెంట్ స్కీం అమలులో ఉంది. గత ప్రభుత్వం రెండేళ్లు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులు చేయలేదు. ఈ విద్యా సంవత్సరంతో కలిపి మూడేండ్ల నుంచి రీయింబర్స్మెంట్ రావడం లేదు. బీఏ(సీబీసీఎస్) రూ.2,350, బీఏ(కంప్యూటర్స్) రూ.5350, బీకాం(కంప్యూటర్స్) రూ.5,450, బీఎస్సీ(సీబీసీఎస్), బీజడ్సీ, ఎంపీసీ రూ.3,550, బీఎస్సీ (సీబీసీఎస్) డైరీ సైన్స్ రూ.5,550, బీఎస్సీ(కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్) రూ.5,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఆన్లైన్లో ఫీజు చెల్లించాల్సిన ఆక్టోపాడ్ లింక్‌ను ఇప్పటికే స్టూడెంట్స్ మొబైల్ వాట్సాప్‌లకు పంపించారు. ఇదిలాఉంటే అడ్మిషన్, ఎగ్జామ్ ఫీజు చెల్లించడానికి సిద్దమే అంటున్న స్టూడెంట్స్ వేలల్లో ఫీజులు ఫిక్స్ చేసి కట్టాలనడం ఎంత వరకు సమంజసమని అంటున్నారు. లక్షల్లో ఫీజులు కట్టి ప్రైవేట్ ఇంజనీరింగ్, టెక్నికల్ కోర్సుల్లో చేరే ఆర్థిక స్థోమత లేని పేద, మధ్య తరగతి విద్యార్థులే డిగ్రీ కాలేజీల్లో చేరుతున్నారు. అప్పర్ ప్లాట్ ఏరియాలోని గవర్నమెంట్ కాలేజీల్లో చదువుతున్న స్టూడెంట్స్ ఫీజులు కట్టలేమని అంటున్నారు.
మూతపడుతున్న ప్రైవేట్ కాలేజీలు..
పట్టణాలు, మండల కేంద్రాల్లో ఏర్పాటైన ప్రైవేట్ జూనియర్, డిగ్రీ కాలేజీలు ప్రభుత్వం నుంచి వచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ మీద ఆధారపడి నడిచాయి. గత ప్రభుత్వం ఏండ్ల తరబడి రీయింబర్స్మెంట్ ఫండ్స్ పెండింగ్‌లో పెట్టడంతో ప్రైవేట్ కాలేజీలు మూతపడ్డాయి. ఒక్క నాగర్‌కర్నూల్ జిల్లాలోనే పదుల సంఖ్యలో ఇంటర్, డిగ్రీ కాలేజీలు క్లోజ్ చేసుకున్నారు.
ప్రైవేట్ కాలేజీలు మూతపడడంతో గవర్నమెంట్ జూనియర్, డిగ్రీ కాలేజీల్లో స్టూడెంట్స్ సంఖ్య పెరిగింది. కల్వకుర్తిలోని మోడల్ డిగ్రీ కాలేజీలో ఫస్ట్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ వరకు 900 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. జిల్లా కేంద్రంలోని కాలేజీలోనూ దాదాపు ఇదే సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు. అమ్రాబాద్ డిగ్రీ కాలేజీలో 160 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు.
ఇట్లైతే చదవడం కష్టం
మమ్మల్ని కాలేజీలకు పంపించడమే కష్టం. మా అమ్మనాయనను ఒప్పించి కాలేజీలో చేరిన. ఇప్పుడు సార్లు ఫీజు కట్టాలంటున్నారు. ఇదే విషయం ఇంట్లో చెబితే కాలేజీ బంద్ చేయమంటారని భయంగా ఉంది. ప్రభుత్వం ఈ ఫీజుల భారం తొలగించాలి.
స్పూర్తి, బీఏ ఫస్ట్ ఇయర్, కుప్పగండ్ల
త్వరలో రీయింబర్స్ మెంట్వస్తుంది..
డిగ్రీ విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ విడతల వారీగా విడుదల చేస్తున్నారు.త్వరలో అందరికి వస్తుంది.విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
శ్రావణి, ప్రిన్సిపాల్, మోడల్ డిగ్రీ కాలేజీ, కల్వకుర్తి