![హైదరాబాద్ బాచుపల్లిలో విషాదం.. కాలేజ్ నుంచి కాల్.. పేరెంట్స్కు గుండె ఆగినంత పనయింది..](https://static.v6velugu.com/uploads/2025/02/tension-prevails-in-bachupally-over-death-of-inter-student_bAC0YEyO1r.jpg)
హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. బాచుపల్లి కౌసల్య కాలనీలో ఉన్న ఎస్ఆర్ గాయత్రి మహిళా కళాశాలలో పూజిత అనే అమ్మాయి ఇంటర్ సెకండియర్ చదువుతుంది. రోజూలానే బుధవారం ఉదయం కూడా పూజిత కాలేజ్కు వెళ్లింది.
అయితే ఆమె తల్లిదండ్రులకు ఊహించని విధంగా కాలేజ్ యాజమాన్యం నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ చేసి గాంధీ ఆస్పత్రికి రావాలని కళాశాల యాజమాన్యం చెప్పింది. దీంతో.. ఏం జరిగిందో పూజిత తల్లిదండ్రులకు పాలుపోలేదు. పూజిత బాత్ రూమ్లో జారిపడి చనిపోయిందని కాల్లో కళాశాల యాజమాన్యం పూజిత తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో పూజిత తల్లిదండ్రులకు గుండె ఆగినంత పనయింది.
Also Read :- ఈ ఐదుగురు చేసిన ర్యాగింగ్ వింటే.. మీరు కూడా కొట్టి కొట్టి చంపుతారు.. !
ఉదయాన్నే కాలేజ్కు వెళ్లిన కూతురు సాయంత్రానికి ఇంటికి తిరిగొస్తుందనుకుంటే గాంధీ ఆసుపత్రికి ఆమె మృతదేహాన్ని చూసేందుకు పరిస్థితి రావడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గుండెలవిసేలా రోదించారు. అయితే.. పూజిత చనిపోయిన విషయాన్ని గాయత్రి కళాశాల యాజమాన్యం తెలియజేసిన తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మొదట బాత్ రూమ్లో జారిపడిపోయి చనిపోయిందని చెప్పి, తర్వాత ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారని పూజిత బంధువులు ఆరోపించారు. పూజిత చనిపోయిన విషయాన్ని కళాశాల యాజమాన్యం గోప్యంగా ఉంచే ప్రయత్నం చేయడంతో ఈ అనుమానాలు, ఆరోపణలు మరింత బలపడుతున్నాయి.