
ఇబ్రహీంపట్నం: ప్రభుత్వ స్థలం కబ్జా చేసి, రోడ్డుకు అడ్డంగా గోడను నిర్మించి గేట్ ఏర్పాటు చేసిన రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్టీ, నాయకులు గేట్లు తోసుకుంటూ దూసుకెళ్లారు. పేదల ఇండ్ల స్థలాల వద్దకు ఇండ్ల స్థలాల లబ్ధిదారులు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, నాయకులు దూసుకెళ్లడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
గతంలో 2007లో రాజశేఖర్ రెడ్డి హయాంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం నాగన్ పల్లిలోని సర్వే నెంబర్ 203, 189 లోని 20.04 ఎకరాల్లో 577 మంది పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చారు. ఆ ఇండ్ల స్థలాలు ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ కబ్జా చేసి ప్రభుత్వ రోడ్డుకు గేట్ ఏర్పాటు చేసిందని లబ్ధిదారులు ఆరోపించారు.
ALSO READ | అప్పుల ఊబిలో ఇండియన్ మిడిల్‌క్లాస్ ప్రజలు.. సంచలన రిపోర్ట్, కళ్లు తెరవండిక..!
గతంలో సీపీఎం నాయకులు ధర్నా చేపట్టగా పేదలకు మరో చోట ప్రభుత్వ నిబంధనల ప్రకారం లే ఔట్ చేసి ఇస్తామని లిఖితపూర్వకంగా కలెక్టర్కు రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి లేఖ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు పేదలకు ఎలాంటి న్యాయం జరగలేదంటూ సీపీఎం ఆధ్వర్యంలో ఈ రోజు(మార్చి 26, 2025) రామోజీ ఫిల్మ్ సిటీని లబ్ధిదారులు ముట్టడించారు. పోలీసులు అడ్డుకోగా గేట్లు తోసుకుంటు లోపలికి ఇండ్ల స్థలాల లబ్ధిదారులు వెళ్లారు.
తమ ఇండ్ల స్థలాలు తమకు ఇవ్వాలని న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. లేకుంటే ఇక్కడే ఇండ్లు కట్టుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చి 18 యేండ్లు గడుస్తున్నా ఇండ్లు కట్టుకొనివ్వకుండా చేస్తున్న రామోజీ ఫిల్మ్ సిటీ యజమాన్యం చేస్తుందని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.