Shami vs Pandya: షమి vs పాండ్యా.. పక్కపక్కనే ఉన్నా పలకరింపుల్లేవ్

భారత క్రికెటర్లు మహ్మద్ షమీ, హార్దిక్ పాండ్యా మధ్య విబేధాలు తారాస్థాయికి చేరినట్లు కథనాలు గుప్పుమంటున్నాయి. ఆదివారం బెంగళూరులోని తమ కొత్త నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ(NCA)ని బీసీసీఐ అట్టహాసంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి హాజరైన భారత క్రికెటర్లు షమీ, పాండ్యా ఇరువురూ పక్కపక్కనే ఉన్నా పలకరించుకోకపోవటం ఈ విమర్శలకు దారితీసింది. గతంలో వీరిమధ్య ఏం జరిగిదనేది బయటకు తెలియనప్పటికీ, ఈ ఇరువురికి ఒకరంటే మరొకరికి పడదని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఎన్‌సీఏ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హార్దిక్, షమీ ఒకరికొకరు ఎడ మొహం పెడ మొహంగా కనిపించారు. సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నా పలకరించుకోలేదు. హార్దిక్ బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ పక్కన నిల్చొని నిలబడి కబుర్లు చెబుతుండగా, షమీ అవేమి పట్టనట్లుగా నిలబడి ఉన్నాడు. దాంతో వీరిద్దరి మధ్య విభేదాలు సద్దుమణగలేదని వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ గొడవకు కారణమేంటనే విషయం మాత్రం బయటకు తెలియరాలేదు.

Also Read : గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో

నోటిదురుసు కొంపముంచిందా..!

బ్యాటింగ్, బౌలింగ్ ఇరు విభాగాల్లోనూ జట్టుకు ఉపయోగపడే పాండ్యా.. తన నాయకత్వ ధోరణితో ఆటగాళ్లతో విబేధాలు కొని తెచ్చుకుంటుంటాడు. సహచర ఆటగాళ్లపై నోరు పారేసుకోవడం, సీనియర్ల పట్ల కనీస మర్యాద పాటించకపోవడం వంటి ఘటనలు గతంలోనూ ఎన్నో బయటకు వచ్చాయి. బహుశా..! అలాంటిదే వీరి మధ్య జరిగినట్లు తెలుస్తోంది. హార్దిక్ తన నాయకత్వ ధోరణితో షమీని నొప్పించడాని సమాచారం. ఈ ఇద్దరూ గుజరాత్ టైటాన్స్‌లో భాగంగా ఉన్నప్పుడు విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. దీనిపై ఎవరో ఒకరు మౌనం వీడితే కానీ, నిజాలు బయటకు రావు.