కేటీఆర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. బీఆర్ఎస్​వర్గాల్లో ఆందోళన

కేటీఆర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. బీఆర్ఎస్​వర్గాల్లో ఆందోళన
  • ఇప్పుడేం చేద్దాం!
  • ఫార్ములా- ఈ రేస్​ కేసులో కేటీఆర్​చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
  • బీఆర్ఎస్ ​వర్గాల్లో ఆందోళన.. లొట్టపీసు కేసు, తుపేల్​ కేసు అంటూనే లోలోపల టెన్షన్​
  • హైకోర్టు తీర్పు వచ్చాక కేటీఆర్ ఇంటికి క్యూ కట్టిన గులాబీ నేతలు

హైదరాబాద్, వెలుగు: ఫార్ములా–ఈ రేస్​ కేసులో కేటీఆర్​ క్వాష్​ పిటిషన్​ను హైకోర్టు కొట్టివేయడం, విచారణకు అనుమతిచ్చేయడంతో బీఆర్ఎస్​ నేతల్లో టెన్షన్​ మొదలైంది. కేటీఆర్​ సహా ఆ పార్టీ నేతలంతా ఇది లొట్టపీసు కేసు, తుపేల్​ కేసు అని అంటూనే.. లోలోపల ఆందోళన చెందుతున్నారు. 

ఈ నెల 9న ఏసీబీ, ఆ తర్వాత వారానికి 16న ఈడీ విచారణ ఉన్న నేపథ్యంలో కేటీఆర్​ చుట్టూ ఫార్ములా– ఈ రేస్​ కేసు ఉచ్చు బిగుసుకుంటుందన్న చర్చ జరుగుతున్నది. దీంతో గులాబీ పార్టీలోని​ పెద్ద నేతలతోపాటు కేడర్​ కూడా టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తున్నది. 

ఈ క్రమంలోనే హరీశ్​రావు, కవిత సహా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలంతా నందినగర్​లోని కేటీఆర్​ ఇంటికి మంగళవారం మధ్యాహ్నం నుంచే క్యూ కట్టారు. హైకోర్టు తీర్పు తర్వాత ఏం చేయాలన్న దానిపై సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం.

 హైకోర్టు తీర్పు అనంతరం జడ్జిమెంట్​ కాపీపై లీగల్​ టీమ్​తో కేటీఆర్, పార్టీ నేతలు చర్చలు జరిపినట్టు తెలిసింది.  ఇన్నాళ్లూ కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఏసీబీ ఎలా విచారిస్తుందని ప్రశ్నించిన బీఆర్ఎస్​ నేతలు.. ఇప్పుడు స్వయంగా హైకోర్టే విచారణ చేసుకోవచ్చని తేల్చి చెప్పడంతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారన్న చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తున్నది. 

లాయర్​ సాకుతో 6న విచారణను తప్పించుకున్న కేటీఆర్​..  ఈ నెల 9న ఎట్టిపరిస్థితుల్లోనూ ఎంక్వైరీకి హాజరవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇటు సుప్రీంకోర్టులోనూ కేటీఆర్​ పిటిషన్​ వేయడానికి ముందే రాష్ట్ర సర్కారు కేవియెట్ దాఖలు చేసింది. 

కేటీఆర్​ కేసును విచారిస్తే తమ వాదనలనూ పరిగణనలోకి తీసుకోవాలని అందులో పేర్కొన్నది. ఈ క్రమంలోనే కేటీఆర్​పిటిషన్​ను సుప్రీంకోర్టు విచారించాల్సి వస్తే.. ఇటు రాష్ట్ర సర్కారుకు కూడా సుప్రీంకోర్టు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

ఎప్పుడు ఏమవుతుందోనని టెన్షన్ 

ఏసీబీ కేసులో పరిణామాలు వేగంగా మారిపోవడంతో బీఆర్ఎస్​ నేతలు ఏ క్షణాన ఏమవుతుందోనన్న టెన్షన్​లో ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే ముఖ్య నేతలంతా కేటీఆర్​ ఇంటికి వెళ్లి, పరామర్శలు మొదలుపెట్టారు. 

మాజీ మంత్రి హరీశ్​ రావు, బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యాహ్నం కేటీఆర్​ ఇంటికి చేరుకొని, ఆయనతో సమావేశమయ్యారు. వివరాలు ఆరా తీశారు. వారితోపాటు మాజీ మంత్రులు జగదీశ్​ రెడ్డి, ప్రశాంత్​రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, సత్యవతి రాథోడ్​, మాలోతు కవిత, ఎర్రబెల్లి దయాకర్ రావు సహా సీనియర్​నేతలందరూ కేటీఆర్​ను కలిసి, పరామర్శించారు. 

అయితే, కేటీఆర్​ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని బీఆర్ఎస్​ నేతలంతా చెబుతున్నా.. లోలోపల మాత్రం ఆందోళనకు గురవుతున్నట్టు తెలుస్తున్నది. అవసరమైతే జైలులో పది రోజులుండి ఎక్సర్​సైజులు చేసి మంచిగై వస్తానని గతంలో చెప్పిన కేటీఆరే.. ఇప్పుడు లాయర్​ లేకుండా విచారణకు వెళ్లకపోవడం అందుకేనన్న చర్చ జరుగుతున్నది. 

తానే ఇచ్చానంటూ ఓపెన్ కామెంట్స్​

ఫార్ములా –ఈ కారు రేస్​ విషయంలో నిధులను రిలీజ్​ చేయాలని హెచ్ఎండీఏ వైస్​ చైర్మన్​గా తానే ఆదేశించానంటూ కేటీఆర్​ పలుసార్లు ప్రెస్​మీట్స్​లోనే ఓపెన్​గా చెప్పారు. ఆయనే స్వయంగా ఇచ్చిన స్టేట్​మెంట్లు కావడంతో ఏసీబీ కూడా వాటిని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ క్రమంలోనే ఇటు ఏసీబీ, అటు ఈడీ విచారణ.. సుప్రీంలో సర్కారు పిటిషన్.. వీటన్నింటి నేపథ్యంలో ఫార్ములా –ఈ రేస్​ కేసు కేటీఆర్​ చుట్టూ బిగుసుకుం టున్నదన్న చర్చ నడుస్తున్నది. ఈ సారి కేటీఆర్​ను పక్కా అరెస్ట్​ చేస్తారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.