
- కవ్వింపు చర్యలకు దిగుతున్న పాక్ బలగాలు
- టెర్రరిస్టుల భరతం పడ్తున్న ఇండియన్ ఆర్మీ
- బందిపొరాలో ఎన్కౌంటర్.. లష్కరే కమాండర్ హతం
- పహల్గాం ఘటన వెనుక హఫీజ్ సయీద్ హస్తం
- ఉగ్రమూకల ఏరివేతకు ముమ్మరంగా వేట
- కాశ్మీర్లో అణువణువూ జల్లెడ
- అరేబియా సముద్రంలోఐఎన్ఎస్ విక్రాంత్ మోహరింపు
- ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒక్కతాటిపైకి యావత్ దేశం
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ బార్డర్లో టెన్షన్ నెలకొంది. ఇండియాపైకి ఉగ్రమూకలను ఉసిగొల్పిన పాకిస్తాన్ ఇప్పుడు బార్డర్లో కాల్పులతో కవ్వింపు చర్యలకు దిగుతున్నది. గురువారం రాత్రి నుంచి ఎల్ఓసీ వెంబడి భారత పోస్టుల వైపు నిరంతరం కాల్పులు కొనసాగిస్తుండగా.. మన బలగాలు దీటుగా తిప్పికొడుతున్నాయి. పహల్గాంలో అమాయక టూరిస్టులను బలి తీసుకున్న టెర్రరిస్టుల ఏరివేత కోసం ఇండియన్ ఆర్మీ వేటను ముమ్మరం చేసింది. జమ్మూకాశ్మీర్‌లోని అన్ని ప్రాంతాలను అణువణువూ జల్లెడ పడుతున్నది. శుక్రవారం ఉదయం బందిపొరాలో జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లిని బలగాలు మట్టుబెట్టాయి.
అరేబియా సముద్రంలో ఇప్పటికే ఐఎన్ఎస్ సూరత్ నుంచి మిసైల్ టెస్ట్ చేసిన ఇండియన్ నేవీ.. తాజాగా ఐఎన్ఎస్ విక్రాంత్‌ను రంగంలోకి దింపింది. రాజస్థాన్‌లో మన ఆర్మీ యుద్ధ ట్యాంకులతో విన్యాసాలు నిర్వహించింది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నామని పాకిస్తాన్‌కు హెచ్చరికలు పంపింది. టెర్రరిస్టులు నరమేధానికి పాల్పడిన బైసరన్ స్పాట్‌ను ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పరిశీలించారు. జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో భేటీ అయి తాజా భద్రతా పరిస్థితిపై ఆయన రివ్యూ నిర్వహించారు.
పహల్గాం టెర్రర్ అటాక్ పై దేశమంతా ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘోరానికి పాల్పడిన ఉగ్రమూకలను వేటాడి అంతం చేయాలంటూ యావత్తు దేశమంతా ఒక్కతాటిపైకి వచ్చి నినదిస్తున్నది. వరుసగా శుక్రవారం మూడో రోజున కూడా జమ్మూకాశ్మీర్ తోపాటు అనేక రాష్ట్రాల్లో ప్రజలు పెద్ద ఎత్తున క్యాండిల్ లైట్ ర్యాలీలు నిర్వహించారు.
లష్కరే టాప్ కమాండర్ హతం
జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రమూకల కోసం వేట ముమ్మరం చేసిన భద్రతా బలగాలు.. లష్కరే టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లిని మట్టుబెట్టాయి. శుక్రవారం ఉదయం బందిపొరాలోని ఓ ప్రాంతంలో టెర్రరిస్టులు నక్కి ఉన్నారని నిఘా వర్గాల నుంచి సమాచారం అందుకున్న ఆర్మీ, పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. బలగాలు తమను సమీపించడంతో టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. వెంటనే అలర్ట్ అయిన జవాన్లు ఎదురుకాల్పులు ప్రారంభించి అల్తాఫ్ లల్లిని హతమార్చారు.
ఈ ఎన్ కౌంటర్లో మరో టెర్రరిస్ట్ బుల్లెట్ గాయాలతో పారిపోయినట్టు భావిస్తున్నారు. టెర్రరిస్టుల కాల్పుల్లో ఇద్దరు పోలీసులకు కూడా బుల్లెట్ గాయాలు అయ్యాయని అధికారులు తెలిపారు. కాగా, గురువారం ఉధంపూర్ జిల్లాల్లో సెర్చ్ ఆపరేషన్ సందర్భంగా ఎన్ కౌంటర్ జరగగా, ఓ జవాన్ వీరమరణం పొందాడు. మరో ఘటనలో ముగ్గురు లష్కరే టెర్రరిస్టులను జవాన్లు పట్టుకున్నారు. కథువా జిల్లాలో నలుగురు అనుమానితులను చూశానని, వారు టెర్రరిస్టులు కావచ్చంటూ ఓ మహిళ ఇచ్చిన సమాచారం మేరకు శుక్రవారం హీరానగర్ సెక్టార్ ఏరియాలో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.
ఎల్ఓసీ వద్దకు పాక్ బలగాల తరలింపు
పహల్గాం టెర్రర్ అటాక్ కు ప్రతీకారంగా భారత్ పెద్ద ఎత్తున దాడి చేస్తుందన్న ఆందోళనలో ఉన్న పాక్ ఆర్మీ.. బార్డర్ లో భారీగా బలగాలను మోహరిస్తోంది. బలూచిస్తాన్, అఫ్గానిస్తాన్ బార్డర్ లో ఉన్న టాప్ కమాండర్లను, బలగాలను ఇండియా బార్డర్ లోని లైన్ ఆఫ్ కంట్రోల్(ఎల్ఓసీ) వద్దకు తరలిస్తోంది. అలాగే జవాన్లకు సెలవులను పాక్ ఆర్మీ రద్దు చేసింది.
ఇప్పటికే సెలవుల్లో ఉన్నవారిని విధుల్లోకి రప్పించాలని, కొత్తగా ఎవరికీ సెలవులు ఇవ్వరాదని ఆర్మీ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఎల్ఓసీ వద్ద భారత్ నుంచి చొరబాట్లు, కాల్పుల వంటి ఘటనలు జరిగే అవకాశం లేకపోవడంతో పాక్ వైపున ఎప్పుడూ బలగాల మోహరింపు పెద్ద ఎత్తున ఉండదు. కానీ ప్రస్తుతం యుద్ధ భయంలోకి జారుకున్నందునే పాక్ ఆర్మీ బలగాలను భారీగా తరలిస్తోందని భావిస్తున్నారు.
అటు 191 మంది.. ఇటు 287 మంది రిటర్న్
పహల్గాం టెర్రర్ అటాక్ నేపథ్యంలో భారత్, పాక్ పరస్పరం వీసాలను రద్దు చేయడంతోపాటు దాయాది దేశం పౌరు లు తిరిగి వెళ్లిపోవాలని ఆదేశించాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం అటారీ వాఘా బార్డర్ గుండా 191 పాకిస్తాన్ జాతీయులు తిరిగి వెళ్లిపోగా, 287 మంది ఇండియన్లు తిరిగి వచ్చారని అధికారులు వెల్లడించారు. గురువారం పాక్ నుంచి 105 మంది ఇండియన్లు రాగా, భారత్ నుంచి 28 మంది పాక్ పౌరులు తిరిగి వెళ్లారని తెలిపారు. డెడ్ లైన్ సమీపిస్తుండటంతో పౌరుల రిటర్న్ జర్నీలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు భావిస్తున్నారు.
పోటాపోటీగా విన్యాసాలు..
మంగళవారం నాటి పహల్గాం టెర్రర్ అటాక్ పాక్ పనే అంటూ తీవ్రంగా స్పందించిన భారత ప్రభుత్వం బుధవారం పాక్ తో సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు, పాక్ పౌరులకు వీసాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. సింధూ జలాల ఒప్పందం రద్దు నిర్ణయం యుద్ధానికి దిగడమేనంటూ పాక్ కూడా ప్రతీకార చర్యలకు దిగింది. సిమ్లా ఒప్పందం రద్దు, ఇండియన్లకు వీసాలు క్యాన్సిల్ చేసింది. తమ గగనతలం మీదుగా భారత విమానాలు ఎగరవద్దంటూ నో ఫ్లై జోన్‌గా ప్రకటించడంతో పాటు అరేబియా సముద్రంలో రెండు రోజులపాటు మిసైల్ టెస్టులు నిర్వహించనున్నట్టు కూడా ప్రకటించింది.
దీంతోపాటు బార్డర్ లో ఎల్ఓసీ వద్దకు పెద్ద ఎత్తున బలగాలను, యుద్ధ విమానాలను మోహరిస్తోంది. పాక్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండియన్ నేవీ కూడా గురువారం అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ సూరత్ నుంచి కీలక మిసైల్ టెస్ట్ చేపట్టింది. మరోవైపు ‘ఆక్రమణ్’ పేరుతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రాఫెల్, మిరాజ్, సుఖోయ్ ఫైటర్ జెట్లతో భారీ కసరత్తు చేపట్టింది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య బార్డర్లో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి.