రామోజీ ఫిల్మ్ సిటీ ముట్టడి..పేదల ఇండ్ల స్థలాలు కబ్జా చేశారంటూ సీపీఎం నేతల ఆందోళన  

రామోజీ ఫిల్మ్ సిటీ ముట్టడి..పేదల ఇండ్ల స్థలాలు కబ్జా చేశారంటూ సీపీఎం నేతల ఆందోళన  
  • గేట్లు దూకి, లోపలికి దూసుకెళ్లి నినాదాలు 
  •  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, తదితరుల అరెస్ట్

ఇబ్రహీంపట్నం, వెలుగు: నిరుపేదలకు ఇండ్ల స్థలాల కోసం ప్రభుత్వం కేటాయించిన భూమిని రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యం కబ్జా చేసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆరోపించారు. ఫిల్మ్ సిటీ యాజమాన్యంపై చర్యలు తీసుకుని, ఆ ఇండ్ల స్థలాలను తిరిగి పేదలకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం నాగన్ పల్లిలోని రామోజీ ఫిల్మ్ సిటీ వద్ద ఆర్ఎఫ్​సీ ఇండ్ల స్థలాల పోరాట సమితి ఆధ్వర్యంలో ఫిల్మ్ సిటీ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు.

అక్కడికి భారీగా చేరుకున్న ఇండ్లస్థలాల బాధితులు, సీపీఎం నాయకులను గేట్​వద్దే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గేట్లు దుంకి, తోసుకుంటూ ఫిల్మ్​సిటీ లోపలికి దూసుకెళ్లి బైఠాయించారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్​కు తరలించి కేసు నమోదు చేశారు. అంతకుముందు ధర్నాలో జాన్ వెస్లీ మాట్లాడుతూ.. పేదలకు ఇండ్ల స్థలాల కోసం కేటాయించిన భూమిని ఫిల్మ్ సిటీ యాజమాన్యం దర్జాగా కబ్జా చేసిందని, ప్రభుత్వ రోడ్డుకు అడ్డంగా గోడ కట్టి, గేట్ ఏర్పాటు చేసిందన్నారు.

‘‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 2007లో నాగన్ పల్లిలోని సర్వే నెంబర్ 203, 189లోని 20.04 ఎకరాల్లో 577 మంది పేదలకు ఇండ్ల స్థలాల పట్టాలను ఇచ్చారు. ఆ ఇండ్ల స్థలాల చుట్టు ప్రస్తుతం ఫిల్మ్ సిటీ యాజమాన్యం ప్రహారీగోడను నిర్మించింది. అక్కడికి వెళ్లే ప్రభుత్వ రోడ్డుకు గేటు ఏర్పాటు చేశారు. పేదల ఇండ్ల స్థలాల కబ్జాపై గతంలో సీపీఎం నాయకులు ధర్నా చేచేయడంతో.. పేదలకు ఆ ఇండ్లస్థలాలను అప్పగిస్తామని చెప్పారు.

ఇక్కడ కాకుంటే మరో చోట భూమి కొనుగోలుచేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం లే ఔట్ చేసి అందజేస్తామని లిఖితపూర్వకంగా కలెక్టర్ కు రామోజీ ఫిల్మ్ సిటీ వారు హామీ ఇచ్చారు. కానీ18 ఏండ్లు అవుతున్నా నేటికీ  పేదలకు న్యాయం జరగలేదు. వారికి న్యాయం చేసేంతవరకూ ఇక్కడి నుంచి కదిలేదిలేదు” అని ఆయన తేల్చిచెప్పారు. ధర్నాలో సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, నాయకులు భాస్కర్, సామెల్, కిషన్, జగన్, జంగయ్య, ఇండ్ల స్థలాల బాధితులు పాల్గొన్నారు.