- దాడులతో రెచ్చిపోతున్న తాలిబాన్లు.. 10 ప్రావిన్సుల ఆక్రమణ
- ఇప్పటికే 65 శాతం భూభాగంపై పట్టు
- ఇట్లే కొనసాగితే 90 రోజుల్లో కాబూల్ వశం: యూఎస్
- ఆక్రమించిన నగరాల్లో వెయ్యి మంది ఖైదీల రిలీజ్
- అఫ్గాన్‌కు మనమిచ్చిన హెలికాప్టర్ తాలిబాన్ల వశం
- ఎట్టి పరిస్థితుల్లో తమ సైన్యం అఫ్గాన్‌లో ఉండదన్న బైడెన్
అఫ్గాన్‌లో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. తాలిబాన్లు మెరుపు వేగంతో దేశంలోని ముఖ్యమైన ప్రాంతాలను ఆక్రమిస్తుండడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ప్రాణాలు కాపాడుకునేందుకు వేలాది మంది రాజధాని కాబూల్ వైపు వెళ్తున్నారు. అఫ్గాన్‌లోని 34 ప్రావిన్సుల్లో 25 చోట్ల అఫ్గాన్ సైన్యం, తాలిబాన్ల మధ్య దాడులు కొనసాగుతున్నాయి.
కాబూల్:అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్లు రెచ్చిపోతున్నారు. మెరుపు వేగంతో అక్కడి ప్రాంతాలను ఆక్రమిస్తున్నారు. తాజాగా 10వ ప్రావిన్సును తమ అధీనంలోకి తీసుకున్నారు. ఇప్పటివరకు ఆ దేశంలోని 65 శాతం భూభాగంపై పట్టు సాధించారు. దాడులు ఇలాగే పెరుగుతూ పోతే 30 రోజుల్లో రాజధాని కాబూల్‌ను తాలిబాన్లు చుట్టుముడతారని, 90 రోజుల్లో ఆక్రమించేస్తారని అమెరికా ఇంటెలిజెన్స్ ఆందోళన వ్యక్తం చేసింది. తాలిబాన్ల దాడుల్లో గత నెల రోజుల్లో వెయ్యి మంది ప్రజలు మరణించారని ఐక్యరాజ్యసమితి చెప్పింది. గత 12 రోజుల్లో 4 వేల మందికి పైగా గాయపడిన వాళ్లకు ట్రీట్‌మెంట్ అందించామని రెడ్ క్రాస్ తెలిపింది. దేశవ్యాప్తంగా అల్లకల్లోల పరిస్థితులు ఉండటంతో ప్రాణాలు కాపాడుకునేందుకు వేలాది మంది జనం రాజధాని వైపు వెళ్తున్నారు. అఫ్గాన్‌లోని 34 ప్రావిన్సుల్లో 25 చోట్ల అఫ్గాన్ సైన్యం, తాలిబాన్ల మధ్య దాడులు కొనసాగుతున్నాయి. నాటో, అమెరికా బలగాలు అఫ్గాన్ నుంచి మే 1న ఉపసంహరించుకున్నాక తాలిబాన్లు చెలరేగిపోతున్నారు. రోజురోజుకూ దాడుల తీవ్రతను పెంచుతున్నారు. ఇప్పటికే 10 ప్రావిన్సులను ఆక్రమించారు. ఆగస్టు 31 కల్లా పూర్తిగా సైన్యాన్ని ఉపసంహరించుకుంటామని అమెరికా ఇప్పటికే చెప్పింది.
వెయ్యి మంది ఖైదీలను విడిచిపెట్టిన్రు
అనేక ముఖ్య నగరాలను ఇప్పటికే ఆక్రమించుకున్న టెర్రరిస్టులు అక్కడి జైళ్ల నుంచి వెయ్యి మందికి పైగా క్రిమినల్స్‌ను వదిలిపెట్టాయి. వాళ్లలో ఎక్కువ మందిపై కిడ్నాపింగ్, డ్రగ్స్ స్మగ్లింగ్, ఆయుధాల దొంగతనం కేసులున్నవాళ్లని అధికారులు చెప్పారు. మరణశిక్ష పడిన వాళ్లూ ఉన్నారన్నారు. ఒక్క కుందుజ్ ప్రావిన్స్‌లోనే 630 మంది ఖైదీలను తాలిబాన్లు వదిలిపెట్టారని తెలిపారు. నిమ్రోజ్ ప్రావిన్స్‌లో మరో 350 మందిని వదలిలేశారన్నారు.
రాజకీయ పరిష్కారం కష్టమే: ఇమ్రాన్
అఫ్గాన్ సంక్షోభం పేరుతో పాకిస్తాన్‌ను 20 ఏళ్లు తమ అవసరాలకు అమెరికా వాడుకుందని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఇండియాతో సంబంధాలకు ప్రాధాన్యమిస్తూ పాక్‌తో మరోలా ప్రవర్తిస్తోందని విమర్శించారు. తొందరపాటుగా అఫ్గాన్ నుంచి బలగాలను ఉపసంహరించుకొని ఆ దేశం అతలాకుతలమవడానికి అమెరికా కారణమైందని మండిపడ్డారు. అఫ్గాన్‌లో శాంతిని పాక్ కోరుకుంటోందన్నారు. తాలిబాన్ల మిలటరీ దాడులను తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. తాలిబాన్ నేతలు శాంతి ఒప్పందానికి ఒప్పుకోవాలని తాము గతంలో సూచించామని వెల్లడించారు. అఫ్గాన్ సమస్యకు రాజకీయ పరిష్కారం కష్టమని అభిప్రాయపడ్డారు. అష్రఫ్ ఘని అధికారంలో ఉన్నంత వరకు చర్చలకు తాము వెళ్లబోమని తాలిబాన్లు చెప్పారన్నారు.
మా సైన్యం వెనక్కి వస్తోంది
అమెరికా సైన్యం అఫ్గానిస్తాన్‌లోనే ఉండబోతోందన్న వార్తలను ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ కొట్టిపారేశారు. తమ బలగాలు వెనక్కి వస్తున్నాయని స్పష్టం చేశారు. అఫ్గాన్‌లో గత 20 ఏళ్లలో దాదాపు రూ.74 లక్షల కోట్లు (1 ట్రిలియన్ డాలర్లు) ఖర్చు చేశామని, 3 లక్షల మంది అఫ్గాన్ సైనికులకు శిక్షణ ఇచ్చామని చెప్పారు. ఇక అఫ్గాన్ లీడర్లు, అఫ్గాన్ సైన్యం వాళ్ల కోసం, వాళ్ల దేశం కోసం కలసికట్టుగా
పోరాడాలన్నారు.
అఫ్గాన్‌కు మనమిచ్చిన హెలికాప్టర్ తాలిబాన్ల వశం
అఫ్గానిస్తాన్‌కు ఇండియా బహుమతిగా ఇచ్చిన ఎంఐ 24 అటాక్ హెలికాప్టర్‌ను తాలిబాన్లు వశం చేసుకున్నారు. కుందుజ్ ఎయిర్ పోర్టును స్వాధీనం చేసుకుని అక్కడే ఉన్న హెలికాప్టర్‌ను తమ కంట్రోల్‌లోకి తీసుకున్నారు. దాని దగ్గర తాలిబాన్లు దిగిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే టెర్రరిస్టులు హెలికాప్టర్‌ను వాడటానికి వీల్లేకుండా రోటర్ బ్లేడ్లను అఫ్గాన్ సైనికులు తొలగించినట్టు తెలిసింది. అఫ్గాన్‌కు మన దేశం 2019లో మూడు చీతా హెలికాప్టర్లు, ఎంఐ 24ను గిఫ్టుగా ఇచ్చింది.
పరిస్థితులు ఆందోళనకరం: ఇండియా
అఫ్గాన్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని ఇండియా చెప్పింది. అక్కడి అధికారులు, నేతలతో టచ్‌లోనే ఉన్నామని.. పరిస్థితులను గమనిస్తున్నామని విదేశాంగ శాఖ స్పోక్స్ పర్సన్ అరిందమ్ బాగ్చి చెప్పారు. ఖతర్ ఆహ్వానం మేరకు అఫ్గాన్ సమస్యపై దోహాలో జరిగిన రీజినల్ సమావేశానికి హాజరయ్యామన్నారు. తాలిబాన్లకు పాకిస్తాన్ సాయం చేస్తోందా అని అడగ్గా ఆ విషయం ప్రపంచ దేశాలన్నింటికీ తెలుసన్నారు.
పాక్‌పై అఫ్గాన్ ప్రజల విమర్శలు
తమ దేశంలో తాలిబాన్లకు పక్క దేశం పాకిస్తాన్ సాయం చేస్తోందని అఫ్గన్ ప్రజలు మండిపడుతున్నారు. పాక్ భూభాగాన్ని టెర్రరిస్టులు తమకు నచ్చినట్టు వాడుకుంటూ దాడులు చేస్తున్నారన్నారు. అఫ్గాన్ సైన్యంతో టెర్రరిస్టులు పోరాడి గాయపడితే పక్క దేశం పాక్ వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారని చెప్పారు. చమన్ ప్రాంతంలో ఓ డాక్టర్ పదుల సంఖ్యలో తాలిబాన్లకు ట్రీట్‌మెంట్ చేశారు. కొందరిని మెరుగైన ట్రీట్‌మెంట్ కోసం క్వెట్టాకు కూడా తరలించారు. తాలిబాన్ లీడర్లు పోర్ట్ సిటీ కరాచీలో ఎక్కువగా ఉంటున్నారు.