
- మంచిర్యాల జడ్పీ బాయ్స్ హైస్కూల్‌లో టెన్త్ క్వశ్చన్ పేపర్ తారుమారు
- రెండు గంటలు ఆలస్యంగా మొదలైన ఎగ్జామ్
- బాధ్యులైన ఇద్దరు ఆఫీసర్ల సస్పెన్షన్
మంచిర్యాల, వెలుగు : టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభమైన రోజే మంచిర్యాల జిల్లాలో గందరగోళం ఏర్పడింది. స్థానిక జడ్పీ బాయ్స్ హైస్కూల్‌కు తెలుగు క్వశ్చన్ పేపర్‌కు బదులు హిందీ పేపర్ రావడంతో గందరగోళం మొదలైంది. తప్పిదాన్ని గుర్తించిన ఆఫీసర్లు పేపర్లను మార్చి రెండు గంటలు ఆలస్యంగా పరీక్ష నిర్వహించారు.
శుక్రవారం ఉదయం 9.30 గంటలకు తెలుగు ఎగ్జామ్ ప్రారంభం కావాల్సి ఉండడంతో 8.30 గంటలకు స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి క్వశ్చన్ పేపర్లను తీసుకొచ్చారు. స్కూల్‌కు వచ్చాక బాక్స్ ఓపెన్ చేసి చూడగానే అందులో హిందీ పేపర్స్ కనిపించాయి. వెంటనే విషయాన్ని కలెక్టర్‌తో పాటు విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి పర్మిషన్‌తో మళ్లీ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తెలుగు పేపర్ కోసం వెతకగా.. మరో బాక్స్‌లో దొరికింది.
ఆ పేపర్లను తీసుకొచ్చిన సిబ్బంది రెండు గంటలు ఆలస్యంగా 11.30లకు ఎగ్జామ్‌ను ప్రారంభించి 2.30 గంటల వరకు నిర్వహించారు. కలెక్టర్ కుమార్ దీపక్ పరీక్షా కేంద్రాన్ని సందర్శించి క్వశ్చన్ పేపర్ తారుమారు కావడంపై ఆరా తీశారు. క్వశ్చన్ పేపర్స్ ట్రంక్ బాక్స్ తీసుకొచ్చే క్రమంలో పొరపాటు జరిగినట్టు గుర్తించి, బాధ్యులైన చీఫ్ సూపరింటెండెంట్ మీర్ సప్ధర్ అలీఖాన్, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్ ఎన్‌ఆర్.పద్మజను సస్పెండ్ చేశారు.