
గజ్వేల్, వెలుగు : సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్గూర్ గ్రామంలో గాలివానకు చెట్టు కొమ్మ విరిగి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న బాలుడిపై పడడంతో అక్కడికక్కడే చనిపోయాడు. గ్రామస్తుల కథనం ప్రకారం..గ్రామానికి చెందిన మన్నె సత్తయ్య, రేణుకకు ఇద్దరు కొడుకులు. చిన్నకొడుకు వెంకటేశ్(14) పదో తరగతి చదువుతూ పరీక్షలు రాస్తున్నాడు. మంగళవారం సాయంత్రం పొలం వద్దకు వెళ్లి బర్రెను ఇంటికి తీసుకొస్తుండగా గాలివాన మొదలైంది. ఇంతలో పక్కనే ఉన్న చెట్టు కొమ్మ విరిగి మీద పడడంతో అక్కడికక్కడే కన్నుమూశాడు. అతడిపై కొమ్మ పడి ఉండడంతో కొద్దిసేపటి వరకు ఎవరూ గమనించలేదు. వర్షం తగ్గిన తర్వాత కొమ్మకింద చూస్తే బాలుడు చనిపోయి కనిపించాడు. స్థానికులు బయటకు తీసి చూసి వెంకటేశ్గా గుర్తించి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు.