పదో తరగతి హిందీ పేపర్ లీకేజీ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బండి సంజయ్ ను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ సీఎం కేసీఆర్ దిష్టబొమ్మను దగ్ధం చేస్తున్నారు. ఆయన్ను అకారణంగా అరెస్టు చేశారని, ప్రశ్నించే గొంతులను ప్రభుత్వం నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. బండి సంజయ్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లాలోని బైంసా, జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్టపల్లి, మంచిర్యాల జిల్లా, వరంగల్ జిల్లాలోని వర్దన్నపేట, నర్సంపేటలో బీజేపీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను ఏప్రిల్ 4వ తేదీ రాత్రి 11 గంటల 30 నిమిషాల సమయంలో పదుల సంఖ్యలో పోలీసులు వచ్చి అరెస్టు చేశారు. అరెస్టు వారెంట్ పై ప్రశ్నించినా.. తమతోనూ పోలీసులు దురుసుగా ప్రవర్తించారని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక అరెస్టు అనంతరం ఎంపీ బండి సంజయ్ ను యాదాద్రి జిల్లా బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ తరలింపులో హైడ్రామా నడిచింది. పోలీసులు హడావిడి చేశారు. పీఎస్ నుంచి కోర్టులో హాజరుపర్చటానికి తీసుకెళుతున్న సమయంలో.. కారు అద్దాలకు పేపర్లు అడ్డు పెట్టారు. కారులోని వ్యక్తులు బయటకు కనిపించకుండా పోలీసులు కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకున్నారు.
భువనగిరి కోర్టులో హాజరుపరుస్తు్న్నామని లీకులు ఇచ్చి.. ఆ తర్వాత రోడ్డెక్కిన తర్వాత పోలీస్ వాహనాల కాన్వాయ్ వరంగల్ వైపు వెళ్లింది. బండి సంజయ్ వెంటే వెళ్లిన బీజేపీ శ్రేణులు సైతం ఈ పరిణామంతో షాక్ అయ్యారు. ఏప్రిల్ 4వ తేదీ రాత్రి కరీంనగర్ లో అరెస్ట్ చేసిన పోలీసులు.. యాదాద్రి జిల్లా బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. టెన్త్ హిందీ పేపర్ లీక్ కేసులో ఆయన పాత్ర ఉందని ఆరోపిస్తూ.. ఆయనపై వరంగల్ లో కేసు ఫైల్ అయ్యింది.