హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టెన్త్ మెయిన్ ఎగ్జామ్స్ ముగిశాయి. మంగళవారం జరిగిన సోషల్ పరీక్షకు 4,86,194 మంది హాజరుకావాల్సి ఉండగా.. 4,84,384 మంది అటెండ్ అయ్యారు. 1,809 మంది వివిధ కారణాలతో అటెండ్ కాలేదు. ఈ పరీక్షల్లో 16 మంది స్టూడెంట్లపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ముగ్గురు ఇన్విజిలేటర్లను సర్వీస్ నుంచి రిమూవ్ చేయగా, మరో ఇద్దరు ఇన్విజిలేటర్లను, ఇద్దరు చీఫ్ సూపరింటెండెంట్లు, ఇద్దరు డిపార్ట్ మెంట్ల్ ఆఫీసర్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ నెల 12, 13 తేదీల్లోనూ ఓఎస్ఎస్సీ, ఒకేషనల్ కోర్సులకు సంబంధించిన పరీక్షలున్నా తక్కువ మంది అటెండ్ కానున్నారు. మెయిన్ సబ్జెక్టుల పరీక్షలు పూర్తికావడంతో హాస్టల్స్ స్టూడెంట్లు ఇంటిబాటపట్టారు. దీంతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కొంత రద్దీగా కనిపించాయి. టెన్త్ మెయిన్ సబ్జెక్టుల ఎగ్జామ్స్ పూర్తికావడంతో గురువారం నుంచి స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. మొత్తం 18 సెంటర్లలో 21వ తేదీ వరకు వాల్యుయేషన్ కొనసాగనున్నట్లు వెల్లడించారు. ఈసారి కొత్తగా మంచిర్యాల, జగిత్యాల, సిద్దిపేట, యాదాద్రి, మేడ్చెల్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో స్పాట్ సెంటర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
స్పాట్‌కు స్టేట్ అబ్జర్వర్లు
స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన స్టేట్ అబ్జర్వర్లను నియమించారు. ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డికి, హైదరాబాద్, సంగారెడ్డి సెంటర్లు.. గురుకుల సొసైటీ సెక్రటరీ రమణకుమార్‌కు నల్లొండ, యాదాద్రి.. అడల్ట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉషారాణికి రంగారెడ్డి, మేడ్చల్.. సైట్ డైరెక్టర్ విజయలక్ష్మీబాయికి వరంగల్.. టెస్ట్ బుక్ ప్రెస్ డైరెక్టర్ శ్రీనివాస్‌చారికి ఖమ్మం.. ఓపెన్ స్కూల్ సొసైటీ జాయింట్ డైరెక్టర్ సోమిరెడ్డికి కరీంనగర్, సిద్దిపేట, వరంగల్.. ఆర్జేడీ సత్యనారాయణరెడ్డికి ఆదిలాబాద్, నిర్మల్.. డైరెక్టరేట్ జేడీ మదన్ మోదన్కు నిజామాబాద్.. ఐఏఎస్ఈ ప్రిన్సిపల్ ఉషారాణికి మంచిర్యాల, జగిత్యాల.. ఎస్ఎస్ఏజేడీ వెంకటనర్సమ్మకు నాగర్ కర్నూల్, హైదరాబాద్.. ఆర్జేడీ విజయలక్ష్మీకి మహబూబ్ నగర్ సెంటర్లకు అబ్జర్వర్లుగా బాధ్యతలు అప్పగించారు.