- గురుకుల సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రుల ఆరోపణ
ములుగు, వెలుగు:జ్వరంతో బాధపడుతున్న ఓ టెన్త్‌స్టూడెంట్‌ట్రీట్‌మెంట్ తీసుకుంటూ శుక్రవారం చనిపోయాడు. అయితే స్టూడెంట్ చదువుకు గురుకుల స్కూల్ వార్డెన్, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ కుమారుడు చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపించారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం రాజన్నపేట గ్రామానికి చెందిన కోరం శ్రీలత, బాబు కొడుకు చరణ్ (15) ములుగు మండలం ఇంచర్ల శివారులోని గిరిజన బాలుర గురుకుల స్కూల్‌లో టెన్త్ చదువుతున్నాడు.
చరణ్‌కు జ్వరం వచ్చిందని హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని స్కూల్ సిబ్బంది గురువారం తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. దీంతో ములుగుకు వచ్చిన తమ బంధువుకు విషయం చెప్పడంతో ఆమె స్కూల్‌కు వెళ్లి చరణ్‌ను ములుగు ఏరియా హాస్పిటల్‌కు తీసుకెళ్లింది. బాలుడి పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో విషయం తెలుసుకున్న అతడి తండ్రి బాబు సైతం హాస్పిటల్‌కు వచ్చాడు. చరణ్‌కు టాయిలెట్ బంద్ కావడంతో వెంటనే వరంగల్‌కు ఎంజీఎంకు తీసుకెళ్లాలని సూచించారు.
అక్కడ వెళ్లిన తర్వాత ట్రీట్‌మెంట్ తీసుకుంటూ శుక్రవారం ఉదయం చనిపోయాడు. దీంతో చరణ్‌కు వారం రోజుల నుంచి జ్వరం వస్తూ, మూడు రోజులుగా టాయిలెట్ బంద్ అయినా తమకు సమాచారం ఇవ్వలేదని, సకాలంలో ట్రీట్‌మెంట్ చేయించి ఉంటే తమ కొడుకు బతికేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకు మృతికి కారణమైన వారిపై చర్యలు డిమాండ్ చేశారు.
ఈ విషయంపై గురుకులం ప్రిన్సిపల్ ఝాన్సీ వివరణ ఇస్తూ... చరణ్‌కు 19న వాంతులు కావడంతో స్థానిక స్టాఫ్ నర్స్ మందులు ఇచ్చిందని, ఈ నెల 26న మళ్లీ జ్వరం రావడంతో హాస్పిటల్‌కు తీసుకెళ్తామని చెబితే ఇంటికి వెళ్తానని చరణ్ పట్టుబట్టాడని చెప్పారు. దీంతో వారి బంధువు వచ్చి తీసుకెళ్లిందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.