- స్పెషల్ క్లాసులతో టైంకు తినని స్టూడెంట్స్
- జిల్లాలో 4,276 మంది టెన్త్స్టూడెంట్స్
- ఇప్పటికే పోషకాహారం లోపంతో బాధపడుతున్న స్టూడెంట్స్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: గవర్నమెంట్ స్కూళ్లలో చదివే టెన్త్ స్టూడెంట్స్ఖాళీ కడుపుతోనే స్పెషల్ క్లాసులకు హాజరవుతున్నారు. టెన్త్ క్లాస్ కావడంతో విద్యాశాఖ ఆదేశాలతో కొద్ది రోజులుగా స్పెషల్క్లాస్లు నిర్వహిస్తున్నారు. దీంతో స్టూడెంట్స్ ఉదయం ఏమీ తినకుండానే స్కూళ్లకు వెళుతున్నారు. మధ్యాహ్నం బడిలో అన్నం తినేవరకు ఆకలితోనే ఉండాల్సిన పరిస్థితి. మరోవైపు సాయంత్రం కూడా స్పెషల్ క్లాసులు ఉంటుడడంతో ఇంటికి చేరేదాకా ఆకలే. ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్టూడెంట్స్ పోషకాహారం లోపంతో బాధపడుతున్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. దీంతో స్టూడెంట్స్ చదువులపై దృష్టి పెట్టలేకపోతున్నారు.
ఉదయం 8.30 నుంచి సా.6గంటల వరకు స్కూళ్లోనే..
పదో తరగతిలో నూరు శాతం ఉత్తీర్ణత సాధించే లక్ష్యంతో టెన్త్ క్లాస్ స్టూడెంట్స్‌కు స్పెషల్ క్లాసెస్ నిర్వహిస్తున్నారు. ఉదయం 8.45 గంటల నుంచి 9.45గంటల వరకు, సాయంత్రం 4. 05 గంటల నుంచి 5.15 గంటల వరకు స్పెషల్ క్లాసెస్ నిర్వహిస్తున్నారు. కొన్ని స్కూళ్లలో టీచర్లు ప్రత్యేక చొరవతో ఉదయం 8.30 గంటలకే స్పెషల్ క్లాసెస్‌ను స్టార్ట్ చేసి సాయంత్రం 6గంటల వరకు నిర్వహిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం ఏజెన్సీ ప్రాంతం కావడం, ఎక్కువ మంది నిరుపేద స్టూడెంట్స్ ఉండడంతో ఉదయం పూట ఏమీ తినకుండానే బడికి వెళుతున్నారు. చాలా మందికి ఉదయం తినేందుకు అన్నం కూడా ఉండని పరిస్థితి. దీంతో సరైన పోషకాహారం అందని పరిస్థితి. జిల్లాలోని బాలికలు చాలా మంది రక్తహీనతతో బాధపడుతున్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.
వీరందరూ ఇంకా నీరసించి చదువులపై దృష్టి పెట్టలేకపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతం కావడంతో మారుమూల గ్రామాల నుంచి స్టూడెంట్స్ సమీప మండల కేంద్రాల్లోని హైస్కూళ్లలో చదువుతుంటారు. మణుగూరు మండలం రాయనపేట, చిన్నరావిగూడెం, కమలాపురం, ఇల్లెందు మండలం చల్ల సముద్రం, కొమరారం, సుభాష్‌నగర్, టేకులపల్లి మండలంలోని టేకులపల్లి, బోడు, సులానగర్ వంటి పలు హైస్కూళ్లలో దాదాపు 5 –9కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి విద్యనభ్యసిస్తున్నారు. కాగా గతంలో స్పెషల్క్లాసెస్ టైంలో స్టూడెంట్స్‌కు అధికారులు బ్రేక్‌ఫాస్ట్ ఏర్పాటు చేసేవారు. కొన్ని స్కూళ్లలో దాతల సాయంతో టీచర్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం స్పెషల్ క్లాసెస్ స్టార్ట్ అయినప్పటికీ టిఫిన్ లేకపోవడంతో విద్యార్థులు ఆకలితో అలమటిస్తూనే తమ చదువులు కొనసాగిస్తున్నారు.
రూ.15లక్షలు కేటాయిస్తే ఆకలి తీరుతుంది
జిల్లాలోని 111 హైస్కూళ్లలో దాదాపు 4,276మంది టెన్త్ క్లాస్చదువుతున్నారు. వీరికి దాదాపు రెండున్నర నెలలకు పైగా స్పెషల్ క్లాసులు నిర్వహించనున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఈ క్లాసులు స్టార్ట్అయ్యాయి. గతంలో స్పెషల్ క్లాసెస్ సందర్భంగా పలు రకాల స్నాక్స్ ఇచ్చేవారు. ఈసారి ఆ పరిస్థితి లేదు. స్టూడెంట్స్‌కు రెండున్నర నెలలకు దాదాపు రూ.15లక్షలు కేటాయిస్తే స్టూడెంట్స్‌కు బ్రేకఫాస్ట్, స్నాక్స్ ఇవ్వొచ్చు. ఈ విషయంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఐటీడీఏ పీఓ చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఏమీ తినకుండానే వస్తున్నాం :
స్కూల్లో స్పెషల్ క్లాసెస్ నిర్వహిస్తున్నారు. పొద్దున్నే 8.20 గంటలకే బడికి రావాలి. చాలాసార్లు ఉదయం ఏమీ తినకుండానే వస్తున్నాం. ఇంటికి వెళ్లేసరికి సాయంత్రం 6 అవుతోంది. ఉదయం, సాయంత్రం ప్రభుత్వం అల్పాహారం ఏర్పాటు చేస్తే బాగుంటుంది. - వెంకటలక్ష్మి, టెన్త్ క్లాస్ స్టూడెంట్, మణుగూరు
ఒక్కపూటే తింటున్నాం:
స్పెషల్ క్లాస్‌ల కోసం పొద్దున్న 8గంటలకే బడికి వస్తున్నాం. మధ్యాహ్నం స్కూల్లో అన్నం తింటున్నాం. సాయంత్రం 6గం.వరకు ఇక్కడే ఉంటున్నాం. పొద్దటి నుంచి సాయంత్రం వరకు ఒక్కటే పూట తింటున్నాం. పొద్దున, సాయంత్రం ఏదైనా బ్రేక్ఫాస్ట్ఏర్పాటు చేస్తే మా లాంటి పేద విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. - చంటి, టెన్త్ క్లాస్, మణుగూరు