- నాలుగేండ్లంటున్న గుర్తింపు సంఘం ఏఐటీయూసీ
- మళ్లీ గత ఎన్నికల వివాదమే తెరపైకి
- అధికారిక గుర్తింపు పత్రాలతోనే తేలనున్న చిక్కుముడి
కోల్‌బెల్ట్, వెలుగు : సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన ఏఐటీయూసీ కాలపరిమితి (టర్మ్) రెండేండ్లా? నాలుగేండ్లా? అనే సందేహాలు కార్మికుల్లో నెలకొన్నాయి. 2017 అక్టోబర్‌లో జరిగిన ఆరో దఫా ఎన్నికల్లో గుర్తింపు సంఘం కాలపరిమితి అంశం వివాదాస్పదమైంది. అప్పట్లో గెలిచిన సంఘాన్ని రెండేళ్ల కాలానికే పరిమితం చేస్తూ కేంద్ర కార్మిక శాఖ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వగా సింగరేణి కోర్టును ఆశ్రయించింది. ఎన్నికల ముందు నాలుగేళ్ల కాలపరిమితి అని చెప్పి, రెండేళ్ల కోసం గుర్తింపు ధ్రువీకరణ పత్రం ఇవ్వడమేందని వాదించింది. నాలుగేండ్లు కొనసాగేందుకు న్యాయ పోరాటం చేసింది.
ప్రసుత్తం ఆరేండ్ల తర్వాత నిర్వహించిన ఎన్నికల్లో కూడా కాలపరిమితి ప్రస్తావన లేకపోవడంతో మళ్లీ అదే సమస్య ఎదురయ్యే చాన్స్ఉంది. నాలుగేళ్ల టర్మ్ తోనే ఎన్నికలు జరిగాయని ఏఐటీయూసీ పేర్కొంటుండగా.. మరికొన్ని సంఘాలు మాత్రం రెండేళ్ల టర్మ్ తోనే ఎన్నికలు జరిగాయని వాదిస్తున్నాయి. ఏడో దఫా గుర్తింపు ఎన్నికల నిర్వహణకు ముందు ఈ ఏడాది జూన్13న తొలిసారి కార్మిక సంఘాలను, సింగరేణి యాజమాన్యాన్ని పిలిచి ఎన్నికల ప్రక్రియపై కేంద్ర కార్మిక శాఖ చర్చించింది. ఈ సందర్భంగా రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఎదురయ్యే ఇబ్బందులను కార్మిక శాఖకు సింగరేణి యాజమాన్యం వివరించింది.
కార్మిక శాఖతో జరిగిన చర్చల్లో భాగంగా ఎన్నికల కాలపరిమితి నాలుగేళ్లు ఉండాలని టీబీజీకేఎస్, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, బీఎంఎస్ రాతపూర్వకంగా కోరాయి. మెజారిటీ సంఘాలు మాత్రం సెంట్రల్ కోడ్‌కు వ్యతిరేకమని రెండేళ్ల కాలపరిమితికి పట్టుబట్టాయి. కానీ, కార్మిక శాఖ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంతలోనే ఈనెల 27న గుర్తింపు సంఘం ఎన్నికలు పూర్తవడం, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) అత్యధిక ఓట్లు పొంది గుర్తింపు సంఘంగా నిలవడం, సింగరేణి కోల్‌మైన్స్ లేబర్ యూనియన్(ఐఎన్టీయూసీ) రెండో స్థానంతో ప్రాతినిధ్య సంఘంగా నిలవడం జరిగిపోయాయి. ఈ దశలో మరోసారి గుర్తింపు కాలపరిమితిపై చర్చ మొదలైంది.
పదవీ కాలంపై మొదటి నుంచి వివాదమే
సింగరేణిలో 1998 సంవత్సరం నుంచి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి, రెండు గుర్తింపు ఎన్నికల్లో రెండేళ్ల కాలపరిమితితోనే ఎన్నికలు నిర్వహించారు. ఆ తర్వాత నాలుగేండ్ల టర్మ్ తో నిర్వహించారు. 1998, 2001, 2003, 2007, 2012, 2017 వరుసగా ఎన్నికలు జరిగాయి. 2017 అక్టోబర్ 5న నిర్వహించిన ఎన్నికల్లో కూడా నాలుగేళ్ల పదవీ కాలానికే అందరూ మొగ్గు చూపారు. ఇదే విషయాన్ని కార్మిక శాఖ ఆఫీసర్ల ముందు మెజారిటీ కార్మిక సంఘాలు వెల్లడించాయి.
ఎన్నికల్లో గెలిచిన టీబీజీకేఎస్ లీడర్లకు అధికారికంగా 2018 ఏప్రిల్11న గుర్తింపు పత్రాలు అందజేశారు. గెలిచిన ఆరు నెలల తర్వాత గుర్తింపు పత్రాలను అందజేయడంతో అక్కడి నుంచే తమకు అధికారికంగా సమయం ఉంటుందని లీడర్లు చెప్పుకొచ్చారు. అయితే ఎన్నికల అనంతరం గుర్తింపు సంఘానికి అధికారిక పత్రం ఇచ్చే సమయంలో మాత్రం రెండేళ్ల వరకే పదవీ కాలమంటూ సర్టిఫికెట్లో పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలిచిన టీబీజీకేఎస్ పదవీకాలం అధికారికంగా 2021, అక్టోబర్‌తో ముగియాల్సి ఉండగా.. దీన్ని సవాల్ చేస్తూ టీబీజీకేఎస్ కోర్టును ఆశ్రయించింది. దీంతో కాలపరిమితిపై గందరగోళం ఏర్పడింది.
ఆరేళ్లు అప్పనంగా కొనసాగిన టీబీజీకేఎస్
కేంద్ర కార్మిక శాఖ ఇచ్చిన సర్టిఫికెట్ఆధారంగా టీబీజీకేఎస్ పదవీ కాలం ముగిసిందని, వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కార్మిక సంఘాలన్నీ డిమాండ్ చేశాయి. కాలపరిమితి వివాదంపై కోర్టు నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో టీబీజీకేఎస్ లీడర్లు ఆరేళ్లు గుర్తింపు సంఘం పేరుతో సింగరేణిలో కొనసాగారు. ఏడో దఫా గుర్తింపు సంఘం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసే వరకు టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా కొనసాగింది.
సింగరేణిలో గుర్తింపు సంఘం పదవీ కాలంపై వివాదం నడుస్తుండగా కేంద్ర ప్రభుత్వం సవరించిన చట్టాల ప్రకారం భవిష్యత్తులో కార్మిక సంఘాల ఎన్నికలు మూడేండ్ల కాలపరిమితితో ఉంటాయని నిర్ణయం తీసుకుంది. పారిశ్రామిక సంబంధాలను మెరుగుపర్చేందుకు ఒకే సంస్థ, ఒకే కార్మిక సంఘం నినాదంతో సవరించిన కార్మిక చట్టాల్లో గుర్తింపు సంఘం కాలపరిమితిని మూడేళ్లకు నిర్ణయించారు.
దీంతో సింగరేణి ఎన్నికల్లో ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉంటాయని భావించినప్పటికీ ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో ఈ ప్రతిపాదన తెరపైకి రాలేదు. మరోవైపు కాలపరిమితి అంశంపై స్పష్టత రాకుండానే ఈనెల 27న ఏడో దఫా గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి.
గుర్తింపు ధ్రువీకరణతోనే క్లారిటీ
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచిన గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలకు కేంద్ర కార్మిక శాఖ ఇవ్వనున్న అధికారిక గుర్తింపు ధ్రువీకరణ పత్రాల అందజేతతోనే కాలపరిమితి అంశం తేలనుంది. 2017 అక్టోబర్‌లో నిర్వహించిన ఆరో దఫా ఎన్నికల తర్వాత ఆరు మాసాల జాప్యంతో సర్టిఫికెట్లు ఇచ్చారు.
గుర్తింపు పత్రాలు పొందిన అనంతరం గెలిచిన సంఘాలు అధికారిక సమావేశాల్లో పాల్గొంటాయి. ప్రస్తుతం పదవీకాలం ఎంతన్న విషయం వచ్చే మార్గదర్శకాల (కోడ్ ఆఫ్ డిసిప్లేన్) ప్రకారమే ఉంటుందని కేంద్ర కార్మిక శాఖ ఉప కమిషనర్, సింగరేణి ఎన్నికల అధికారి శ్రీనివాసులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో గెలిచిన గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు అధికారిక గుర్తింపు సర్టిఫికేట్ల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది.