కొనుగోలు సెంటర్లలోనే వడ్ల బస్తాలకు చెదలు

కొనుగోలు సెంటర్లలోనే వడ్ల బస్తాలకు చెదలు
  • కాంటా పెట్టినా మిల్లులకు తరలిస్తలేరని రైతుల ఆందోళన 

ధర్మపురి/ఆర్మూర్/ఎల్లారెడ్డి/కోహెడ, వెలుగు:  వడ్లు ఆలస్యంగా కొంటున్నారని రైతులు మరోసారి రోడ్డెక్కారు. కొన్నిచోట్ల కొనుగోలు చేసినా మిల్లులకు తరలించడం లేదని, దీంతో సెంటర్లలోనే బస్తాలకు చెదలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తీరా వాటిని మిల్లులకు పంపిస్తే మిల్లర్లు దించుకోవడం లేదని, కటింగ్ లకు ఒప్పుకుంటేనే దించుకుంటామని అంటున్నారని వాపోయారు. అధికారులు, మిల్లర్ల తీరును నిరసిస్తూ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల రైతులు ధర్నాలు చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నక్కలపేట్ గ్రామంలో బాధితులు ఆందోళనకు దిగారు.

వడ్లు కాంటా పెట్టి నెల గడుస్తున్నా మిల్లులకు తరలించకపోవడంతో బస్తాలన్నీ చెదలు పడుతున్నాయని, తీరా వాటిని పంపిస్తే దింపుకోకుండా మిల్లర్లు సతాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లోనే బస్తాకు మూడు కిలోల చొప్పున కటింగ్ పెట్టారని, మళ్లీ మిల్లుకు పోతే అక్కడ కూడా రెండు, మూడు కిలోలు కోత పెడ్తున్నారని వాపోయారు. సెంటర్లలో వడ్లు కొన్నాక మిల్లులకు తీసుకెళ్లే దాకా తమదే బాధ్యత అంటున్నారని, దీంతో రోజుల తరబడి సంచుల వద్ద కాపలా ఉండాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు. జగిత్యాల డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కొనుగోలు కేంద్రానికి వచ్చి రైతులతో మాట్లాడారు. సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, స్థానిక తహసీల్దార్ వచ్చి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. 
10 కిలోలు కోత పెడ్తున్నారని...  
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి చౌరస్తాలో రైతులు రాస్తారోకో చేశారు. కాంటా వేసిన వడ్లను మిల్లులకు తరలించడానికి 20 రోజులకు పైగా పడ్తోందని మండిపడ్డారు. తప్ప, తాలు పేరుతో 10 కిలోలు కోత పెడ్తున్నారని, దీంతో తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు. రైతుల ఆందోళనకు కాంగ్రెస్, బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. దాదాపు అరగంట పాటు రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్ జామ్‌‌‌‌ అయింది.  కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం హజీపూర్ తండా వద్ద హైవేపై  రైతులు ధర్నా చేశారు. కొనుగోలు కేంద్రానికి వడ్లు తెచ్చి నెల కావస్తున్నా ఇప్పటి వరకు కేవలం మూడు లారీల వడ్లే కాంటా పెట్టారని మండిపడ్డారు. కాంటా పెట్టి రోజులు గడుస్తున్నా లారీలు రాకపోవడంతో బస్తాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోందని వాపోయారు.

ఇటీవల కురిసిన అకాల వర్షాలకు బస్తాలు తడిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు సాకులు చెబుతూ తప్పించుకుంటున్నారని ఫైర్ అయ్యారు.  ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ శుక్రవారం సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని సముద్రాలలో రైతులు ఆందోళన చేశారు. సిద్దిపేట–హనుమకొండ రోడ్డుపై రాస్తారోకో చేశారు. వీరికి కాంగ్రెస్​ లీడర్లు మద్దతు తెలిపారు. రైతులు మాట్లాడుతూ గ్రామంలోని సింగిల్​ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్​కు వడ్లు తెచ్చి నెల దాటినా కొనడం లేదన్నారు. లారీలు వస్తే బార్​దాన్​.. బార్​దాన్​ వస్తే లారీలు రావడం లేదన్నారు. లారీల కొరతతో ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే పేరుకు పోయిందన్నారు. ఇప్పటి వరకు సగం వడ్లు కూడా పోలేదన్నారు. రోజూ మబ్బులు రావడంతో ధాన్యం తడిసిపోతుందేమోనని భయపడుతున్నామన్నారు. 
బస్తాలు దింపుకుంటలేరని లారీ ఓనర్ల ధర్నా..  
పిట్లం, వెలుగు: మిల్లుల్లో వడ్ల బస్తాలు దింపుకోవడం లేదని, ఆలస్యం చేస్తున్నారని కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్​గల్​లో లారీ ఓనర్లు ధర్నా చేశారు. మెయిన్ రోడ్డుపై బైఠాయించి  వెంటనే లారీల్లోని బస్తాలు దింపుకోవాలని డిమాండ్ చేశారు. రోజుల తరబడి బస్తాలను దింపుకోకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు. ఆఫీసర్లు స్పందించి లారీలను ఖాళీ చేయించాలని కోరారు. 

 

 

ఇవి కూడా చదవండి

మానవత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్యే 

మోడీ చెప్పిన మార్పూ అంత తేలిక్కాదు!

మీరు పార్లమెంట్‌ ను రద్దు చేస్తే.. మేం అసెంబ్లీని రద్దు చేయిస్తం