
- నాయకుని తండాలో నాటుబాంబుల దాడి
- టీఆర్‌ఎస్, కాంగ్రెస్ వర్గా ల మధ్య ఘర్షణ
- ఇద్దరికి గాయాలు, పోలిస్ పికెట్ ఏర్పాటు
టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన చిన్న ఘర్షణ నాటు బాంబులు వేసుకొనే దాకా పోయింది. నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలంలోని నాయకుని తండాలో ఆదివారం రాత్రి రెండు వర్గాలు చేపల వేటకు ఉపయోగించే నాటుబాంబులతో దాడి చేసుకున్నాయి. దీంతో సుమారు 25 ఇళ్లు ధ్వంసం కాగా మెరావత్ దస్లీ, మెరావత్ సోమ్లాకు గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం హైద్రాబాద్ తరలించారు. సర్పంచ్ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి మెరావత్ కొండానాయక్ గెలిచాడు. ఒక కార్యక్రమంలో కొండానాయక్ తనపై పోటీ చేసి ఓడిపోయిన టీఆర్ఎస్ అభ్యర్థి మేరావత్ సక్రునాయక్ ను చులకనగా మాట్లాడాడు. ఈ విషయాన్ని సక్రూ తన కొడుకు దత్తుకు చెప్పడంతో అతడు కోపంతో ఆదివారం రాత్రి సర్పంచ్ ఇంటికి పోయి గొడవ పడ్డాడు. ఇది అర్ధరాత్రి వరకు కొనసాగింది. గొడవ ముదరడంతో ఇరువర్గాల వారు చేపల వేటకు ఉపయోగించే నాటుబాంబులను విసురుకున్నారు . మారుమూల గ్రామం కావడంతో పోలీసులకు సమాచారం ఆలస్యంగా అందింది. పోలీసులు వచ్చి విచారణ చేపట్టే సమయానికే గొడవకు కారణమైన యువకులు పరారయ్యారు. తండాలో వృద్ధులు మాత్రమే మిగిలారు.
తండాలో పోలీస్ పికెట్
రాజకీయ కక్షలతో నాటుబాంబుల దాడి జరిగిన తండాలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో తండాలో ఆదివారం రాత్రి నుండి ఇద్దరు సిఐలు, ముగ్గురు ఎస్ఐల ఆధ్వర్యంలో పోలీస్ పికెట్ ను ఏర్పాటు చేశారు.ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మిర్యాలగూడ డిఎస్పీ శ్రీనివాస్ పర్యవేక్షిస్తున్నారు .బాంబులు ఎక్కడ నుంచి తెచ్చారని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు .