
- ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ దగ్గర్లో భారీ హిమపాతం
- రోడ్డుపై మంచును క్లియర్ చేస్తుండగా ప్రమాదం
- 55 మంది వర్కర్లలో త్రుటిలో తప్పించుకున్న 22 మంది
- చిక్కుకున్నోళ్లలో11 మందిని కాపాడిన ఆర్మీ
- మిగతా వారి కోసం కొనసాగుతున్న రెస్క్యూ
డెహ్రాడూన్:ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ వద్ద ఘోరం జరిగింది. టిబెట్ బార్డర్ కు సమీపంలో జాతీయ రహదారిపై మంచును తొలగిస్తుండగా.. హిమపాతం సంభవించడంతో 22 మంది కార్మికులు చిక్కుకుపోయారు. ప్రమాద సమయంలో మొత్తం 55 మంది కార్మికులు పని చేస్తుండగా.. వారిలో 22 మంది త్రుటిలో మంచు చరియల నుంచి తప్పించుకున్నారు.
మిగతా 33 మంది మంచు కింద కూరుకుపోయారు. వీరిలో 11 మందిని ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఐటీబీపీ సహాయక బృందాలు రక్షించాయి. మిగతా 22 మంది కార్మికులను కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టిబెట్ బార్డర్ కు సమీపంలో, బద్రీనాథ్ ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 3,200 మీటర్ల ఎత్తులో ఉన్న మనా గ్రామం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
బార్డర్ కు వెళ్లే రోడ్డుపై బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్ఓ) క్యాంపు వద్ద మంచును తొలగిస్తుండగా, ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంచు చరియలు విరిగిపడ్డాయని చమోలి జిల్లా కలెక్టర్ వెల్లడించారు. మంచు నిరంతరంగా కురుస్తుండటం, వర్షం కూడా పడుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని తెలిపారు. హెలికాప్టర్, డ్రోన్లను వినియోగించేందుకు కూడా వీలు కలగడం లేదన్నారు.
రెస్క్యూ టీంలు కాపాడినవారిని మనా గ్రామంలోని ఆర్మీ క్యాంపు వద్దకు తరలించగా.. డాక్టర్లు వెంటనే ట్రీట్మెంట్ ప్రారంభించారని, వారిలో కొందరి పరిస్థితి మాత్రం సీరియస్ గా ఉందన్నారు.
ముందే హెచ్చరించినా..
ఉత్తరాఖండ్‌లోని ఎత్తైన ప్రదేశాల్లో శుక్రవారం ఉదయం వర్షాలతోపాటు భారీగా మంచు కురుస్తుందని, మంచు చరియలు విరిగిపడే (అవలాంచే) ప్రమాదం కూడా ఉందని చండగీఢ్ లోని డిఫెన్స్ జియోఇన్ఫర్మాటిక్స్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్ మెంట్ (డీజీఆర్ఈ) గురువారం సాయంత్రమే హెచ్చరికలు జారీ చేసింది. చమోలి, ఉత్తరకాశీ, రుద్రప్రయాగ్, పితోరాగఢ్, బాగశ్వర్ జిల్లాల్లో సముద్ర మట్టానికి 2,400 మీటర్లకుపైగా ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో అవలాంచే సంభవించవచ్చని తెలిపింది.
రాష్ట్రంలోని ఎత్తయిన ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కూడా హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఆయా జిల్లాల అధికారులను రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ అప్రమత్తం చేసింది. అయితే, వాతావరణం తీవ్ర ప్రతికూలంగా ఉంటుందని హెచ్చరికలు జారీ అయినప్పటికీ, రోడ్లపై మంచు తొలగించేందుకు కార్మికులను ప్రైవేట్ కాంట్రాక్టర్ పంపించాడని అధికారులు చెప్తున్నారు.
టిబెట్ బార్డర్ కు ఆర్మీ రాకపోకలు సాగించే ఈ రహదారిపై భారీగా మంచు కురుస్తూ, ఏకంగా నడుము వరకూ పేరుకుపోయినప్పటికీ.. కార్మికులతో పని చేయించాడని, మంచును తొలగిస్తుండగా కార్మికులపై ఒక్కసారిగా మంచు చరియలు విరిగిపడ్డాయని అంటున్నారు.
అందరినీ కాపాడేందుకు ప్రయత్నిస్తున్నం: సీఎం ధామి
బద్రీనాథ్ వద్ద మంచు చరియలు విరిగి పడిన ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మంచు కింద చిక్కుకుపోయిన కార్మికులు అందరినీ కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.
ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీంలు సహాయక చర్యలు చేపట్టాయని తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు. కార్మికులం తా క్షేమంగా రావాలని బద్రీనాథుడి ని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. సీఎం ధామితో ఫోన్లో వివరాలు తెలుసుకున్నారు.