జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న మహిళపై ఓ వ్యక్తి వేధింపులకు పాల్పడ్డాడు. ఆమెను తాకడానికి ప్రయత్నించిన అతడికి చుక్కలు చూపించింది. భయంతో వెనక్కి తగ్గకుండా ధైర్యంగా పోరాడింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహిళ ధైర్యానికి నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఫోరిడాకు చెందిన 24 ఏళ్ల నషాలి అల్మా ఓ ఫిట్నెస్ మోడల్, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్. ఆమె ప్రతి రోజు జిమ్‌కి వెళ్లి వర్కౌట్ చేస్తూ ఉంటుంది. ఎప్పటిలాగే జనవరి 22న ఆమె జిమ్‌లో వర్కౌట్ చేస్తుండగా.. ఓ వ్యక్తి జిమ్ డోర్ దగ్గర ఉన్నట్లు గమనించింది. తనలాగే వర్కౌట్ చేయడానికి వచ్చాడేమో అనుకుని డోర్ ఓపెన్ చేసి.. తాను వర్కౌట్ చేయడానికి వెళ్లింది. అంతలో అతడు ఆమె పై దాడి చేయబోయాడు. తాను ఏమాత్రం భయపడకుండా అతడితో పోరాడింది. ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించగా.. అతడిని చావగొట్టింది. చివరికి నిందితుడిని పోలీసులకు పట్టించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.