కదిలిస్తే కన్నీళ్లే!..కాశ్మీరంలో ఉగ్ర తూటాలకు బలైన అమాయకులు

కదిలిస్తే కన్నీళ్లే!..కాశ్మీరంలో ఉగ్ర తూటాలకు బలైన అమాయకులు
  • ఆత్మీయులను కోల్పోయి పుట్టెడు శోకంలో కుటుంబాలు
  • వారం కిందటే పెండ్లి.. హనీమూన్​కు వెళ్లి విషాదం
  • యువతి కండ్ల ముందే నేవీ ఆఫీసర్​ను కాల్చి చంపిన టెర్రరిస్టులు
  • భర్త చావును తట్టుకోలేక తననూ చంపేయాలన్న ఓ మహిళ

న్యూఢిల్లీ:భూతల స్వర్గం, మినీ స్విట్జర్లాండ్ గా పిలిచే బైసరన్ ఏరియా ఉగ్రమూకల నరమేధానికి మౌన సాక్షిగా మిగిలింది. పచ్చటి కొండల నడుమ ప్రశాంతంగా గడిపేందుకు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన అమాయక టూరిస్టులు ముష్కరుల క్రూరత్వానికి తమ ఆప్తులు బలైపోతుంటే ప్రత్యక్ష నరకం చవిచూశారు. అమాయకులను చుట్టుముట్టిన ఉగ్రమూకలు ఒక్కొక్కరినీ మతం, పేరు అడుగుతూ.. ఐడీ కార్డులు చెక్ చేస్తూ.. మగవాళ్లనే టార్గెట్ చేస్తూ.. భూతల స్వర్గాన్ని నరకంలా మార్చేశారు. 

కండ్లెదుంటే తమ ఆప్తులు టెర్రరిస్టుల తూటాలకు నేలకొరుగుతుంటే మహిళలు గుండెలు బాదుకుంటూ రోదించారు. అప్పటివరకూ కేరింతలు కొట్టిన పిల్లలు ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కాక భయంతో వణికిపోయారు. ఒకరా, ఇద్దరా.. ఏకంగా 28 మందిని ముష్కరులు పొట్టనపెట్టుకున్నారు. దేశ నలుమూలల నుంచి వచ్చిన టూరిస్టులు.. విదేశీయులు.. వీరితోపాటే స్థానికులూ.. టెర్రరిస్టుల విద్వేష తూటాలకు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు బైసరన్ లో ఆ నరకాన్ని ప్రత్యక్షంగా చవిచూసినవాళ్లతోపాటు.. వారి కుటుంబసభ్యులు, బంధువులను ఎవరిని కదిలించినా కన్నీళ్లే రాలుతున్నాయి!  

పోయి మోదీకి చెప్పుకోమన్నరు.. 

బెంగళూరుకు చెందిన 48 ఏండ్ల మంజునాథ రావు రియల్టర్. కొడుకు 12వ క్లాస్ లో 96% మార్కులతో మంచి రిజల్ట్ తెచ్చుకోవడంతో భార్య పల్లవిని, కొడుకుని తీసుకుని వెకేషన్ కోసం బైసరన్ కు వచ్చాడు. 24వ తేదీన తిరిగి వెళ్లాలనుకున్నారు. కానీ రెండు రోజుల ముందే ఘోరం జరిగింది. పల్లవి కండ్ల ముందే మంజునాథ రావును టెర్రరిస్టులు కాల్చి చంపేశారు. 

భర్త చావును చూసి తట్టుకోలేకపోయిన పల్లవి.. తనను కూడా చంపేయాలంటూ అరిచింది. కానీ.. ‘‘నిన్ను చంపం. పోయి మోదీకి చెప్పుకో..” అని చెప్పి ఆ ముష్కరులు నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఆ సమయంలో స్థానికులు ముగ్గురు ‘‘బిస్మిల్లా.. బిస్మిల్లా..” అనుకుంటూ వచ్చి తమను కాపాడారని, వారు తన సోదరుల వంటి వారు అని పల్లవి కన్నీటిపర్యంతం అవుతూ చెప్పుకుంటున్నారు. 

భర్త అని కన్ఫమ్ చేసుకుని.. 

కాన్పూర్ కు చెందిన 31 ఏండ్ల బిజినెస్ మాన్ శుభమ్ ద్వివేదీకి రెండు నెలల కిందటే మ్యారేజ్ అయింది. భార్య ఐశాన్యతోసహా 11 మంది కుటుంబసభ్యులతో పహల్గాం టూర్ కు వచ్చాడు. వారి వద్దకు గన్స్ తో వచ్చిన టెర్రరిస్టులు.. అతడు ఎవరని ఐశాన్యను అడిగారు. అతడు తన భర్త అని చెప్పడంతో ఆమె కండ్ల ముందే పాయింట్ బ్లాంక్ లో కాల్చి చంపేశారు. వాళ్లు బుధవారమే తిరిగి వెళ్లిపోవాల్సి ఉండగా.. ఒకరోజు ముందే అతడికి చివరిరోజు అయింది. టెర్రర్ మూకల విద్వేష కాల్పులతో ఆ కుటుంబంలో విషాదం నిండింది.

కల్మా చదవాలని అడిగి.. 

మధ్యప్రదేశ్ లోని అలీరాజ్ పూర్ కు చెందిన 50 ఏండ్ల సుశీల్ నథానియెల్ ఎల్ఐసీలో బ్రాంచ్ మేనేజర్ గా పని చేస్తున్నారు. భూతల స్వర్గంగా పేరు పొందిన కాశ్మీర్ లో పర్యటించాలని ఎన్నో ఏండ్లుగా కలగన్న ఆయన చివరకు ఆ కలను నిజం చేసుకోబోయి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. టెర్రరిస్టులు విచక్షణారహితంగా కాల్పులు మొదలుపెట్టగానే.. భార్య, బిడ్డ, కొడుకుకు రక్షణగా నిలిచి, వారిని ఓ చెట్టు వెనకకు తోసేశాడు. చివరకు వాళ్లను రక్షించుకున్నాడు కానీ.. ఉగ్రమూకల తూటాల నుంచి మాత్రం తప్పించుకోలేకపోయాడు. 

అతడి కుటుంబానికి ఈ పర్యటన జీవితాంతం వెంటాడే పీడకలగా మిగిలిపోయింది. ‘‘చివరకు మా అన్న అక్కడికి వెళ్లగలిగారు. కానీ ఇక ఎప్పుడూ తిరిగి రాలేరు..” అని సుశీల్ సోదరుడు సంజయ్ కుమ్రావత్ గద్గద స్వరంతో చెప్పుకుంటున్నాడు. ‘‘టెర్రరిస్టులు ముందుగా కల్మా చదవాలని అడిగారట. చదవలేకపోవడంతో ఆరా తీసి, అతడు క్రిస్టియన్ అని తెలుసుకున్నాక కాల్పులు జరిపారట. వేరే మతం అయినంత మాత్రం చంపేస్తారా? ఇది కేవలం టెర్రర్ అటాక్ కాదు.. హేట్ క్రైమ్” అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ దాడిలో బ్యాంకు ఉద్యోగి అయిన సుశీల్ కూతురు ఆకాంక్షకు కాలిలో బుల్లెట్ గాయం కాగా, టీనేజ్ లో ఉన్న కొడుకు ఆస్టిన్ షాక్ లోకి వెళ్లిపోయాడు.  

నేలకొరిగే దాకా తూటాలు కురిపించారు..  

ఏపీలోని నెల్లూరుకు చెందిన 41 ఏండ్ల భరత్ భూషణ్ బెంగళూరులో టెకీగా పని చేస్తున్నారు. ఆయన భార్య డాక్టర్ సుజాత, కొడుకుతో కలిసి వెకేషన్ కు వచ్చారు. సంఘటన జరిగిన తర్వాత తన కూతురుతో ఫోన్ లో మాట్లాడానని.. సుజాత తల్లి మీడియాకు వెల్లడించారు. ‘‘టూరిస్టులను చుట్టుముట్టిన టెర్రరిస్టులు.. మీరు హిందువులా? అని అడిగి మరీ కాల్చిచంపారని నా కూతురు చెప్పింది. 

కేవలం హిందూ అయినందుకే నా అల్లుడిని చంపేశారు. మహిళలను, పిల్లలను వదిలేసి.. మగవాళ్లపై మాత్రమే నేలకు ఒరిగేదాకా తూటాల వర్షం కురిపించారని తెలిపింది” అని ఆమె కన్నీటిపర్యంతం అవుతూ చెప్తున్నారు. భరత్ భూషణ్ ను కూడా ముందుగా తలపై కాల్చారని, ఆ తర్వాత కింద పడిపోయే దాకా వరుసగా బుల్లెట్లు పేల్చారని తెలిపారు. 

వారం కిందటే పెండ్లి.. 

ఇండియన్ నేవీలో రెండేండ్ల కిందట లెఫ్టినెంట్ గా విధుల్లో చేరిన హర్యానాకు చెందిన 26 ఏండ్ల వినయ్ నర్వాల్ కు వారం రోజుల క్రితమే.. ఈ నెల 16న పెండ్లి జరిగింది. భార్య హిమాన్షిని తీసుకుని హనీమూన్ కోసమని బైసరన్ కు వచ్చాడు. కానీ నూరేండ్ల జీవితాన్ని పంచుకోవాలని చేయి పట్టుకుని నడిపించుకు వచ్చిన భర్తను కండ్ల ముందే టెర్రరిస్టులు బలి తీసుకోవడంతో ఆమెకు తీరని వ్యధ మిగిలింది. కొత్త దంపతులు ఇద్దరూ సంతోషంగా భోజనం చేస్తున్న సమయంలో వచ్చిన ఉగ్రమూకలు.. వినయ్ తలపై గురిపెట్టి కాల్చేశారు.