శ్రీలంక టూరిజానికి ఉగ్ర దెబ్బ

ప్రపంచంలోనే అందమైన దేశాల్లో శ్రీలంక ఒకటి. దీంతో అనేక దేశాల నుంచి ప్రతి ఏడాది పెద్దసంఖ్యలో టూరిస్టులు వెళ్తుంటారు. ఈస్టర్ రోజు జరిగిన పేలుళ్ల తో టూరిజం దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విదేశీయులు ఎక్కువగా బస చేసే లగ్జరీ హోటల్స్ ను టెర్రరిస్టులు టార్గెట్ చేసుకోవడంతో ఫారినర్స్ కు భద్రత లేదన్న ప్రచారం జోరందుకుంది. శ్రీలంకలో సివిల్ వార్ఉన్న రోజుల్లో కూడా బాంబు పేలుళ్ల సంఘటనలు జరిగాయి. అయితే ఖరీదైన హోటల్స్‌‌పై దాడులు ఎప్పుడూ జరగలేదు. శ్రీలంక చరిత్రలోనే తొలిసారిగా విదేశీయులు దిగే హోటల్స్ ను ‘నేషనల్ తోహీద్ జమాత్’ (ఎన్టీజే) సంస్థకు చెందిన టెర్రరిస్టులు టార్గెట్ చేసుకున్నారు. క్రిస్మస్ పండగ రోజుల్లో శ్రీలంకకు వచ్చే టూరిస్టుల సంఖ్య సహజంగా ఎక్కువగా ఉంటుంది. దీనినే ‘ ఆఫ్సీజన్ టూరిజం ’ అంటారు. ఈ పేలుళ్ల నేపథ్యంలో ఆఫ్ సీజన్ టూరిజం దెబ్బతినే ప్రమాదం ఉందని టూరిజం బిజినెస్ వర్గాలు చెబుతున్నాయి.

టూరిజంపై ప్రత్యేక దృష్టి
శ్రీలంక ప్రభుత్వం చాలా ఏళ్ల నుంచి టూరిజం డెవలప్ మెంట్ పై దృష్టి పెట్టింది. ఏడాదికేడాది టూరిస్టుల సంఖ్య పెంచుకుంటోంది. టూరిజం పై 2018లో శ్రీలంకకు 3.5 బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది దీనిని ఏడు బిలియన్ డాలర్లు గా మార్చుకోవడానికి టూరిస్టులకు అనేక రకాల ప్రోత్సాహకాలు కల్పించింది. ఈ టార్గెట్ చేరుకోవడానికి 39 దేశాలకు ఫ్రీ వీసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయంతీసుకుంది. సహజంగా ఏదైనా బయటి దేశానికి వెళ్లాలంటే ముందుగా వీసా రావాల్సి ఉంటుంది. శ్రీలంక ఈ రూల్ ను సడలించింది. శ్రీలంకకు వెళ్లిన తర్వాత టూరిస్టులకు అక్కడ వీసా ఇస్తారు. దీనినే ‘ ఫ్రీవీసా ’ అంటారు. మొత్తం 39 దేశాలకు శ్రీలంక ‘ ఫ్రీవీసా ’ సదుపాయం కల్పించింది. ఈ దేశాల నుంచి టూరిస్టులు విమాన మెక్కి శ్రీలంక లో దిగి అక్కడేవీసా తీసుకోవచ్చు. ఈ ఫెసిలిటీ వల్ల ఆదాయం 20శాతం పెరుగుతుందని టూరిజం వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2018 లో దీనిని ఒక పైలెట్ ప్రాజెక్ట్ గా శ్రీలంక ప్రభుత్వం మొదలెట్టింది. శ్రీలంకలోని కాసినోలు ప్రపంచవ్యాప్తంగా పేరొందాయి. ఇందులో జూదం ఆడటానికి అనేక దేశాల నుంచి టూరిస్టులు వస్తుంటారు. శ్రీలంకలో పదేళ్ల నుంచి టూరిజం పుంజుకుంది. 2009 లో శ్రీలంకకు వెళ్లిన టూరిస్టుల సంఖ్య ఐదు లక్షల లోపే. కిందటేడాది ఈ సంఖ్య 20లక్షలకు చేరుకుంది.