- 35 మందికి గాయాలు.. దుండగుడిని కాల్చివేసిన పోలీసులు
న్యూ ఓర్లీన్స్: అమెరికాలో ఉగ్రదాడి జరిగింది. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న జనం పైకి ఓ దుండగుడు ట్రక్కుతో దూసుకెళ్లాడు. ఆపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 10 మంది చనిపోగా, 35 మంది గాయపడ్డారు. లూసియానా రాష్ట్రంలోని న్యూ ఓర్లీన్స్ సిటీలో బుధవారం జనమంతా ఒక్కచోట చేరి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు. ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ అయిన బార్బన్ స్ట్రీట్ లో అందరూ ఎంజాయ్ చేస్తుండగా, తెల్లవారుజామున 3:15 గంటల ప్రాంతంలో వాళ్ల పైకి ఓ ట్రక్కు దూసుకొచ్చింది. అది అతి వేగంతో అందరినీ ఢీకొట్టుకుంటూ ముందుకెళ్లింది.
ఆ ట్రక్కును పోలీసులు అడ్డుకోవడంతో, అందులో నుంచి బయటకు దిగిన దుండగుడు వాళ్లపై ఫైరింగ్ చేశాడు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో 10 మంది చనిపోయారని, 35 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఇద్దరు పోలీసాఫీసర్లకు గాయాలయ్యాయని, వాళ్లిద్దరూ క్షేమంగా ఉన్నారని చెప్పారు. ఎదురుకాల్పుల్లో దుండగుడు హతమయ్యాడని వెల్లడించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఉగ్ర కోణమనే అనుమానం
ఈ దాడి వెనుక ఉగ్ర కోణం ఉన్నదని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బీఐ) అనుమానిస్తున్నది. ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించింది. బార్బన్ స్ట్రీట్ లో కార్డన్ సెర్చ్ చేపట్టింది. దుండగుడు ఎక్కడైనా బాంబులు పెట్టాడా? అన్న అనుమానంతో తనిఖీలు చేస్తున్నది. ఇది ఉగ్రదాడే అని న్యూ ఓర్లీన్ సిటీ మేయర్ లాటోయా కాంట్రెల్ పేర్కొన్నారు. దుండగుడు ఉద్దేశపూర్వకంగానే ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడని న్యూ ఓర్లీన్స్ పోలీస్ కమిషనర్ అన్నె కిర్క్ ప్యాట్రిక్ తెలిపారు.
వీలైనంత మందిని ట్రక్కుతో తొక్కించేందుకు ప్రయత్నించాడని చెప్పారు. కాగా, న్యూఇయర్ వేడుకలకు బార్బన్ స్ట్రీట్ ఫేమస్ ఏరియా. అంతేకాకుండా బుధవారం రాత్రి అక్కడికి దగ్గర్లోని స్టేడియంలో ఫుట్ బాల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆ ఏరియాలో పెద్ద ఎత్తున జనం ఉన్నారు.