
శ్రీనగర్/న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్నాగ్జిల్లా పహల్గాంలోని బైసరన్‌లో పర్యాటకులపై మంగళవారం ఆర్మీ యూనిఫామ్‌లో వచ్చిన టెర్రరిస్టులు కాల్పులు జరపడం, మతం అడిగి మరీ ఘాతుకానికి తెగబడటం యావత్‌దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 28కి చేరింది. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల మధ్య కాల్పులు జరగగా.. ఆర్మీ, సీఆర్పీఎఫ్, లోకల్ పోలీసులు అక్కడికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టాయి.
టూరిస్టులే లక్ష్యంగా మారణహోమం సృష్టించిన టెర్రరిస్టుల కోసం ముమ్మర వేట కొనసాగుతున్నది. జమ్మూకాశ్మీర్‌లోని అణువణువును భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. అనుమానితులను విచారిస్తున్నాయి. టెర్రరిస్టులకు పాకిస్తాన్‌తో ఉన్న లింకులను బయటకు తీస్తున్నాయి. దాడికి పాల్పడ్డది ఎంతమంది..? వారిలో లోకల్స్ ఎవరైనా ఉన్నారా..? పాకిస్తాన్‌నుంచి వచ్చినవాళ్లు ఎవరు..? అని ఆరా తీస్తున్నాయి. ఈ క్రమంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
సెక్యూరిటీ లేదని తెలిసి అటాక్
అమెరికా ఉపాధ్యక్షుడు ఇండియాలో పర్యటిస్తున్న వేళ జమ్మూకాశ్మీర్‌లో టెర్రర్ అటాక్జరగడం కలకలం రేపింది. పక్కా స్కెచ్‌తోనే ఉగ్రవాదులు ఈ దారుణానికి తెగబడ్డట్టు తెలుస్తున్నది. ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత జమ్మూకాశ్మీర్‌కు టూరిస్టుల తాకిడి పెరిగింది. అనంత్నాగ్జిల్లా పహల్గాంలోని బైసరన్లోయ పచ్చని అడవులతో, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది. దీన్ని ‘మినీ స్విట్జర్లాండ్’ అని పిలుస్తుంటారు.
పహల్గామ్ నుంచి ఇక్కడికి ఐదారు కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడికి రావాలంటే కాలినడకన లేదా గుర్రాలపై రావాల్సి ఉంటుంది. అలా రావడానికి చాలా టైమ్ పడుతుంది. సెక్యూరిటీ కూడా పెద్దగా ఉండని ఏరియా ఇది. అందుకే ఈ ఏరియాలోని టూరిస్టులను ఉగ్రవాదులు తమ లక్ష్యంగా ఎంచుకొని అటాక్ చేశారు. అక్కడ అటాక్ చేస్తే తమకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, సహాయ చర్యలు కూడా ఆలస్యమవుతాయని ప్లాన్ వేశారు.
మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల మధ్య కాల్పులు జరిగాయి. ఆర్మీ యూనిఫామ్‌లో వచ్చిన టెర్రరిస్టులు.. టూరిస్టులను మతం అడిగి, ప్రార్థనలు చేయించి, ఐడీ కార్డులు చెక్ చేసి ఆ తర్వాత కాల్చిచంపారు. టెర్రరిస్టులు తమ బాడీకి కెమెరాలు తగిలించుకొని కాల్పులు జరిపినట్లు తెలుస్తున్నది. కాల్పులను కెమెరాల్లో రికార్డు చేసినట్లు సమాచారం. అనంతరం పారిపోయారు. భద్రతా దళాలు వచ్చేసరికి ఎక్కడికక్కడ డెడ్‌బాడీలు పడి ఉన్నాయి. కొందరు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు.