
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. మూడు రోజుల క్రితం సాధారణ ప్రజలపై కాల్పులు జరిపిన టెర్రరిస్టులు.. గురువారం (అక్టోబర్ 24) ఆర్మీ వాహనంపై దాడి చేశారు. ఉత్తర కాశ్మీర్ గుల్‌మార్గ్‌లోని బోటాపతేర్ ప్రాంతంలో గురువారం అర్థరాత్రి ఉగ్రవాదులు ఆర్మీ వాహనంపై ఎటాక్ చేయగా.. ఈ దాడిలో ఐదుగురు భారత జవాన్లు గాయపడ్డట్లు అధికారులు తెలిపారు. జవాన్లు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని.. వారి ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని పేర్కొన్నారు.
కాగా, మూడు రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్‌లోని గందర్‌బల్ జిల్లాలో టెన్నెల్ నిర్మాణ కార్మికుల హౌసింగ్ క్యాంపుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు నిర్మాణ కార్మికులు, ఒక వైద్యుడు మరణించాడు. టెర్రరిస్టుల దుశ్చర్యతో అప్రమత్తమైన భద్రతా దళాలు.. ఉగ్రమూకల కోసం సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టాయి. ఈ క్రమంలోనే గురువారం రాత్రి కూంబింగ్ కోసం వెళ్తున్న ఆర్మీ వాహనంపై టెర్రరిస్టులు ఎటాక్ చేశారు.
ALSO READ | కాశ్మీర్లో వలస కార్మికులపై మరోసారి ఉగ్రదాడి..ఒకరికి తీవ్రగాయాలు
ఈ దాడిని సీరియస్గా తీసుకున్న ఇండియన్ ఆర్మీ.. గందర్‌బల్ జిల్లాలో పెద్ద ఎత్తున బలగాలను మోహరించి ఉగ్రవాదుల కోసం వేట మొదలుపెట్టింది. కాగా, ఇటీవలే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరగగా.. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ విజయం సాధించింది. ఎన్పీ పార్టీ చీఫ్ ఒమర్ అబ్ధుల్లా జమ్మూ కాశ్మీర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టిన రోజుల వ్యవధిలోనే వరుసగా ఉగ్రదాడులు జరగటం గమనార్హం.