బలూచిస్తాన్​లో టెర్రర్ దాడులు.. 8 మంది మృతి

బలూచిస్తాన్​లో టెర్రర్ దాడులు..  8 మంది మృతి

కరాచీ: బలూచిస్తాన్ లో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో నలుగురు పోలీసులు, నలుగురు కార్మికులు మరణించారు. మోటర్ సైకిల్ పై వచ్చిన నలుగురు సాయుధులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై కాల్పులు జరపడంతో నలుగురు చనిపోయారు. శనివారం నోష్కి సిటీలోని ఘరిబాబాద్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పోలీసుల మృతదేహాలను ఆస్పత్రికి తరలించామని హషీమ్ ఖాన్ అనే పోలీసాఫీసర్ మీడియాకు తెలిపారు. 

తాము ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి, దుండగుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించామని చెప్పారు. కలత్ లోని మంగోచార్ సిటీలోని మలంగ్ జాయ్ ప్రాంతంలో మరోక ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో పంజాబ్ ప్రావిన్స్ కు చెందిన నలుగురు కార్మికులు చనిపోయారు. ఈ ఘటనపై కలత్ డిప్యూటీ కమిషనర్ (డీసీ) రిటైర్డ్ కెప్టెన్ జమిల్ బలోచ్ మాట్లాడారు. 

కార్మికులంతా పంజాబ్ ప్రావిన్స్ లోని సాదికాబాద్ కు చెందినవారని పేర్కొన్నారు. వారు బోర్ వెల్ డ్రిల్లర్లుగా పని చేస్తున్నారని వెల్లడించారు. ఈ దాడులకు ఏ టెర్రరిస్టు సంస్థ కూడా బాధ్యత వహించలేదు. బలూచిస్తాన్ సీఎం సర్ఫ రాజ్ బుగ్టి ఈ దాడులను ఖండించారు.