పాక్​లో టెర్రర్ దాడులు..11 మంది మృతి

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌‌లోని బలూచిస్తాన్‌‌లో జరిగిన రెండు వేర్వేరు టెర్రరిస్టుల దాడుల్లో 11 మంది చనిపోయారు. నోప్కి జిల్లాలోని హైవేపై కాపు కాసిన టెర్రరిస్టులు.. క్వెట్టా నుంచి తఫాన్ వెళ్తున్న ఓ బస్సును ఆపారు. అందులోని 9 మంది ప్రయాణికులను కిడ్నాప్ చేసి పర్వత ప్రాంతాలకు తీసుకెళ్లారు. ఈ ఘటనతో భయపడిన బస్సులోని ఇతర ప్యాసింజర్లు పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టగా.. ఓ వంతెన సమీపంలో ఆ తొమ్మిది మంది మృతదేహాలు బుల్లెట్ గాయాలతో  దొరికాయి. 

మృతులు పంజాబ్ ప్రావిన్స్‌‌లోని వజీరాబాద్, మండి బహౌద్దీన్, గుజ్రాన్‌‌వాలాకు చెందినవారని పోలీసులు పేర్కొన్నారు. మరో ఘటనలో... ఇదే రహదారిపై వెళ్తున్న కారుపై టెర్రరిస్టులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కాగా.. ఈ ఘటనలకు ఇప్పటి వరకూ ఏ టెర్రర్ గ్రూప్ బాధ్యత వహించలేదు. రెండు వేర్వేరు టెర్రరిస్టుల దాడుల్లో 11 మంది చనిపోవడంపై బలూచిస్తాన్ సీఎం మీర్ సర్ఫరాజ్ బుస్తీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఈ దాడులకు పాల్పడిన టెర్రరిస్టులను వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. 

బాంబు పేలుడులో ముగ్గురు పిల్లలు మృతి

 పాకిస్తాన్‌‌లోని ఖైబర్ పఖ్తున్‌‌ఖ్వా ప్రావిన్స్‌‌లో శుక్రవారం జరిగిన ల్యాండ్‌‌మైన్ పేలుడులో  ముగ్గురు పిల్లలు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు గాయపడారు. వజీరిస్తాన్ జిల్లా వన్నా సిటీలో ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. చిన్నారులు మండోకై ప్రాంతంలో వాలీబాల్ మ్యాచ్‌‌ చూడటానికి వెళుతుండగా వారిలో ఒకరు మందుపాతరపై కాలుపెట్టడంతో భారీ పేలుడు సంభవించిందని వివరించారు. 

టెర్రరిస్టుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు..

ఖైబర్​పఖ్తున్‌‌ఖ్వా ప్రావిన్స్‌‌లో శనివారం జరిగిన ఎన్‌‌కౌంటర్‌‌లో ఇద్దరు పాక్ సైనికులు చనిపోయారు. వాంటెడ్ టెర్రరిస్ట్‌‌, రింగ్ లీడర్ సలీమ్ అలియాస్ రబ్బానీని జవాన్లు కాల్చి చంపినట్లు అధికారులు ప్రకటించారు.