ప్రధాని మోదీ విమానాన్ని పేల్చేస్తానని ఫోన్ చేసింది.. ఓ పిచ్చోడు

ప్రధాని మోదీ విమానాన్ని పేల్చేస్తానని ఫోన్ చేసింది.. ఓ పిచ్చోడు

ప్రధాని మోడీ ప్రయాణిస్తున్న విమానానికి బెదిరింపులు రావడం కలకలం రేపింది.. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న మోడీ ప్రయాణిస్తున్న విమానానికి ఉగ్రదాడి బెదిరింపులు వచ్చాయని వెల్లడించారు ముంబై పోలీసులు. మోడీ ప్రయాణిస్తున్న విమానంపై ఉగ్రదాడి చేస్తామంటూ మంగళవారం ( ఫిబ్రవరి 11, 2025 ) ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ కాల్ వచ్చిందని తెలిపారు ముంబై పోలీసులు. 

బెదిరింపు కాల్ వచ్చిన వెంటనే.. దర్యాప్తు సంస్థలను అప్రమత్తం చేశామని..  కాల్‌ చేసిన వ్యక్తి ఎవరనే దానిపై దర్యాప్తు చేపట్టామని అన్నారు ముంబై పోలీసులు.దర్యాప్తు అనంతరం ఫోన్‌ కాల్‌ చేసిన వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు పోలీసులు. అతడి మానసిక పరిస్థితి సరిగా లేదని తెలుస్తోందని.. ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశామని తెలిపారు పోలీసులు.  

కాగా.. ప్రధాని మోడీ సోమవారం ( ఫిబ్రవరి 10, 2025 ) నాలుగు రోజుల విదేశీ పర్యటనకు వెళ్లారు. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో ఉన్న మోడీ మంగళవారం ( ఫిబ్రవరి 11, 2025 ) AI యాక్షన్ సమ్మిట్ లో పాల్గొన్నారు. పారిస్‌ పర్యటన తర్వాత ఇవాళ ( ఫిబ్రవరి 12 ) అమెరికా బయల్దేరనున్నారు మోడీ. రెండు రోజులు అమెరికాలో పర్యటించనున్న మోడీ అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ తో భేటీ కానున్నారు.