Terrorist Attack: ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రదాడి.. నలుగురు జవాన్లు మృతి

Terrorist Attack: ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రదాడి.. నలుగురు జవాన్లు మృతి

జమ్మూ కశ్మీర్‌లోని కతువా జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. భారత ఆర్మీ కాన్వాయ్ లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో నలుగురు భారత జవాన్లు వీరమరణం పొందగా.. మరో ఆరుగురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన జవాన్లను చికిత్స కోసం ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందగానే పెద్ద ఎత్తున బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు.

మాటేసి కాల్పులు..

మొదట ఆర్మీ కాన్వాయ్ వెళ్తుంటే గ్రెనేడ్ విసిరిన ఉగ్రవాదులు.. వాహనం నిలిచిపోగానే జవాన్లపై కాల్పులు జరిపారు. అప్రమత్తమైన జవాన్లు ఎదురు కాల్పులు జరిపేసరికే తీవ్ర నష్టం జరిగి పోయింది. కథువా సిటీకి 150 కిలోమీటర్ల దూరంలోని మచెడి-కిండ్లీ- మల్హర్ రహదారిపై ఈ ఉగ్రదాడి జరిగినట్లు అధికారులు వెల్లడించారు. దాడి అనంతరం ఉగ్రవాదులు సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పరారైనట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అక్కడికి చేరుకున్న అదనపు బలగాలు ఉగ్రవాదుల ఏరివేత కోసం కూంబింగ్‌  మొదలుపెట్టాయి.

గత 48 గంటల్లో భారత సైన్యంపై దాడి జరగడం ఇది రెండోది. ఆదివారం(జులై 07) రాజౌరీ జిల్లా ఆర్మీ క్యాంప్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ సైనికుడు ప్రాణాలు కోల్పోగా.. మరొకరు గాయపడ్డారు. మరోవైపు, కుల్గామ్ జిల్లాలో గత రెండు రోజులుగా కొనసాగుతున్న ఎన్‌కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్ లో ఇద్దరు జవాన్లు అమరులవ్వడం బాధాకర విషయం.