పాకిస్తాన్ లోని ఉగ్రసంస్థలు మకాం మార్చాయి. ఆఫ్గనిస్తాన్ సరిహద్దుల్లో స్థావరాలను వేశాయి. అక్కడే శిక్షణ శిబిరాలను కూడా ఏర్పాటు చేసి.. ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నాయి. బాలాకోట్ ఉగ్ర శిక్షణ శిబిరంపై భారత వైమానిక దళాలు జరిపిన దాడులు కారణంగానే…ఉగ్రవాదులు తమ స్థావరాలను మార్చినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఉగ్రసంస్థలు ఆప్టాన్ సమీపంలోకి మారడంతో.. కాబూల్, కాందహార్ వంటి ప్రాంతాలకు ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నాయి.
జేషే మొహమ్మద్, లష్కరే తోయిబా సంస్థలు అఫ్గాన్ తాలిబన్, హక్కానీ నెట్ వర్క్ తో చేతులు కలిపాయి. ఇవన్న కలిసి.. కునార్, నంగర్ హార్, నూరిస్తాన్, కాందహార్ లలో శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశాయి. పాక్ –అఫ్గాన్ సరిహద్దు డ్యూరాండ్ రేఖ వెంబడి శిక్షణ శిబిరాలను నెలకొల్పి, ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం. లష్కరే తోయిబా తన అనుచరులను నంగర్ హార్, నూరిస్తాన్, కునార్, హెల్మండ్, కాందహార్ ప్రావిన్సుల్లోని శిక్షణ శిబిరాలకు తరలించింది. పెషావర్ లో ఉన్న సభ్యుల మకాంను కాబూల్ కు మార్చింది. తాలిబన్ సాయంతో విధ్వంసక, విద్రోహ చర్యలపై శిక్షణ ఇస్తోంది. అయితే.. పాక్ లోని బాలాకోట్ ఉగ్రశిక్షణ శిబిరంపై భారత్ వైమానిక దళం దాడులు జరపడం కారణంగానే ఉగ్రసంస్థలు.. పాక్ నుంచి ఆఫ్గనిస్తాన్ కు మకాం మార్చాయని నిఘా వర్గాలు చెబుతున్నాయి.
ఫిబ్రవరి 14న కశ్మీర్ లోని పుల్వామాలో జైషే మొహమ్మద్ ఉగ్రవాది ఆత్మాహుతి దాడి జరిపింది. దీనికి ప్రతీకారంగా అదే నెలలో భారత వైమానిక దళం బాలాకోట్ పై మెరుపు దాడులు జరిపింది. ఈ దాడి తర్వాత పాక్ పై అంతర్జాతీయ ఒత్తిడులు పెరిగాయి. ఈ ఒత్తిడుల వల్లే.. ఇటీవల లష్కరే తోయిబాకు చెందిన 15 మంది ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుంది…పాక్ ప్రభుత్వం. అయితే, ఇవి కంటితుడుపు చర్యలుగానే ఉన్నాయి.
మరో వైపు ఉగ్రసంస్థలకు పాక్ వెన్నుదన్నుగా ఉంటుందన్న కారణంతో.. కొన్ని సంస్థలు… ఆర్ధిక సహాయాన్ని నిలిపివేశాయి. దీంతో అస్సలే ఆర్ధికంగా కుంగిపోతున్న పాక్ కు .. గట్టి దెబ్బ తగిలింది. ఈ ఒత్తిడి కారణంగానే పాక్ ప్రభుత్వం నుంచి ఉగ్రసంస్థలకు వెళ్లే నిధులు.. ఆగిపోయాయి. దీంతో ఉగ్రసంస్థలు… పాక్ లో ఉండలేక ఆప్గాన్ సరిహద్దులకు చేరాయని నిఘా వర్గాలు చెబుతున్నాయి.
గతంలో మసూద్ అజార్ కు ఆశ్రయం కల్పించేందుకు తాలిబన్, హక్కానీ నెట్ వర్క్ లు సిద్దమయ్యాయి. అయితే.. పాక్ లో ఉండటమే శ్రేయస్కరం అనుకున్న మసూద్ ఆ సమయంలో అక్కడే ఉండిపోయాడు. అయితే..ఇప్పుడు పాక్ పై ఒత్తిడి పెరుగుతుండడంతో మకాం మార్చక తప్పలేదు.
ఆఫ్గనిస్తాన్ సరిహద్దులకు వెళ్లిన ఉగ్రసంస్థలు.. ఆ దేశ రాజధాని కాబూల్ పై కన్ను వేసినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. కాబూల్ లో ఉండే భారత్ దౌత్య కార్యాలయానికి కూడా ఉగ్ర ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నాయి. జైషే మొహమ్మద్ సంస్థ.. పేలుడు పదార్థాలు అమర్చిన వాహనాలతో కాబూల్ లోని ఎంబస్సీపై దాడి చేసే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నాయి. జనవరిలో సెదిక్ అక్బర్, అతావుల్లా అనే ఇద్దరు ఉగ్రవాదులను అఫ్గాన్ బలగాలు అదుపులోకి తీసుకుని విచారిస్తే.. ఈ విషయాలు బయటపడ్డాయి.
దీంతో భారత నిఘా వర్గాలు… కాబూల్, కాందహార్ లలో ఉన్న దౌత్య కార్యాలయాలను అప్రమత్తం చేశాయి. భారీ భద్రతను ఏర్పాటు చేశాయి. అనుమానాస్పద ప్రాంతాల్లో ప్రత్యేక నిఘాను ఉంచాయి. మరోవైపు.. అఫ్గానిస్తాన్ లో ఉన్న 300 మంది జైషే మొహమ్మద్ ఉగ్రవాదులతో అమెరికా బలగాలకు కూడా ముప్పు ఉన్నట్లు సమాచారం. తాలిబన్లతో చేతులుకలిపి జైషే మొహమ్మద్ దాడులు జరిపే ప్రమాదం ఉందని అమెరికా భావిస్తుంది. దీంతో అమెరికా బలగాలకు చెందిన బేస్ ల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది.