హైసెక్యూరిటీ సెల్‎లో తహవూర్ రాణా.. ప్రతి కదలిక రికార్డయ్యేలా డిజిటల్ సెక్యూరిటీ సిస్టమ్స్

హైసెక్యూరిటీ సెల్‎లో తహవూర్ రాణా.. ప్రతి కదలిక రికార్డయ్యేలా డిజిటల్ సెక్యూరిటీ సిస్టమ్స్

న్యూఢిల్లీ: 26/11 ముంబై ఉగ్రదాడుల కేసులో కీలక నిందితుడైన తహవుర్ హుస్సేన్ రాణాకు ఢిల్లీ పాటియాలా హౌస్‌‌‌‌‌‌‌‌లోని ఎన్ఐఏ(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) స్పెషల్ కోర్టు 18 రోజుల రిమాండ్ విధించింది. దాంతో తహవుర్‎ను ఎన్ఐఏ అధికారులు సీజీవో కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌లోని ఎన్ఐఏ ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఎన్ఐఏ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్‌‌‌‌‌‌‌‌లో హైసెక్యూరిటీ, 24 గంటల సర్వైలెన్స్ కలిగిన 14x14 అడుగుల వైశాల్యమున్న చిన్న సెల్‌‌‌‌‌‌‌‌లో తహవుర్‎ను ఉంచారు. ఈ సెల్‌‌‌‌‌‌‌‌లో అతడు పడుకోవడానికి నేలపై ఫిక్స్ చేసిన బెడ్, అటాచ్‌‌‌‌‌‌‌‌డ్ బాత్‌‌‌‌‌‌‌‌రూమ్ ఉన్నాయి. ఆహారం, తాగునీరు, వైద్య సౌకర్యాల వంటివన్నీ నేరుగా గదికి వచ్చేలా ఏర్పాటు చేశారు.  

అంతేగాక, సెల్ లోపల మల్టీ లెవల్ డిజిటల్ సెక్యూరిటీ సిస్టమ్స్ కూడా అమర్చారు. తద్వారా తహవుర్ ప్రతీ కదలికను పూర్తిగా పరిమితం చేశారు. గది బయట రౌండ్- ది -క్లాక్ గార్డులను సెక్యూరిటీగా ఉంచారు. వారికి అదనంగా ఢిల్లీ పోలీసులు, పారామిలటరీ బలగాలు  కూడా మోహరించాయి. అక్కడి ప్రతి అంగుళాన్ని పర్యవేక్షించేలా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేశారు. సీజీవో కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌ ప్రాంతమంతా కట్టుదిట్టమైన భద్రతలోకి వెళ్లిపోయింది. ముందస్తు అనుమతి లేకుండా ఎవరూ తహవుర్ సెల్‌‌‌‌‌‌‌‌లోకి  ప్రవేశించడానికి వీల్లేదు. ఎంపిక చేసిన కేవలం 12 మంది ఎన్ఐఏ అధికారులకు మాత్రమే తహవుర్ సెల్‌‌‌‌‌‌‌‌లోకి  నేరుగా ప్రవేశ అనుమతిచ్చారు. 

అర్ధరాత్రి కోర్టులో హాజరు

తహవుర్‎ను భారత్ గురువారం అమెరికా నుంచి తీసుకువచ్చింది. అర్ధరాత్రి అతన్ని ఎన్ఐఏ అధికారులు పాటియాలా హౌస్ కోర్టు ప్రత్యేక జడ్జి ఎదుట హాజరుపర్చారు. తహవుర్ ను 20 రోజుల పాటు తమ కస్టడీకి అనుమతించాలని ఎన్ఐఏ కోరగా.. 18 రోజుల కస్టడీకి ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు జడ్జి చందర్ జిత్ సింగ్ అనుమతించారు.