టూరిస్టులే లక్ష్యంగా టెర్రర్​ అటాక్.. 26/11 ముంబై ఉగ్రదాడి తరహాలో ఘాతుకం

టూరిస్టులే లక్ష్యంగా టెర్రర్​ అటాక్.. 26/11 ముంబై ఉగ్రదాడి తరహాలో ఘాతుకం

కాశ్మీర్​లో మారణహోమం

  • ఆర్మీ యూనిఫామ్​లో వచ్చి, మతం అడిగి కాల్పులు
  • 26/11 ముంబై ఉగ్రదాడి తరహాలో ఘాతుకం
  • మృతుల్లో ఎక్కువ మంది హనీమూన్​కు వచ్చిన దంపతులే
  • హైదరాబాద్​కు చెందిన ఐబీ ఆఫీసర్, ఇద్దరు విదేశీయులూ మృతి
  • చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు.. మిన్నంటిన బాధితుల హాహాకారాలు
  • ‘మినీ స్విట్జర్లాండ్’గా పిలిచే బైసరన్​లో ఘటన
  • లష్కరే తోయిబాకు చెందిన ‘ది రెసిస్టెంట్​ ఫ్రంట్’ పనే
  • ఘటనపై ప్రధాని మోదీ ఆరా.. సౌదీ పర్యటనను రద్దు చేసుకొని వెనక్కి
  • బాధ్యులను వదలబోమని హెచ్చరిక.. హుటాహుటిన కాశ్మీర్​కు అమిత్​షా
  • దాడిని ఖండించిన ట్రంప్​, పుతిన్​.. భారత్​కు అండగా ఉంటామని ప్రకటన 

శ్రీనగర్: పర్యాటకులే లక్ష్యంగా జమ్మూకాశ్మీర్​లో టెర్రరిస్టులు తెగబడ్డారు. ఆర్మీ యూనిఫాంలో వచ్చి, మతం అడిగి మరీ కాల్పులు జరిపారు. దొరికినవాళ్లను దొరికినట్లు పిట్టలను కాల్చినట్లు కాల్చి చంపేశారు. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న ఆ ‘మినీ స్విట్జర్లాండ్​’.. కాల్పులతో దద్దరిల్లింది. ఎక్కడికక్కడ మృతదేహాలతో రక్తసిక్తమైంది. ఈ మారణహోమంలో 26 మంది ప్రాణాలు వదిలారు. మృతుల్లో పలువురు హనీమూన్​కు వచ్చిన దంపతులు ఉన్నారు. ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణానికి తామే పాల్పడ్డట్లు లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు చెందిన 
‘ది రెసిస్టెంట్​ ఫ్రంట్’ (టీఆర్​ఎఫ్​) ప్రకటించింది. ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. ఉగ్రవాదులను వదిలిపెట్టేది లేదని, టెర్రరిజంపై తమ పోరాటాన్ని మరింత పెంచుతామని స్పష్టం చేశారు. ఉగ్రవాదులను వదిలిపెట్టేది లేదని, టెర్రరిజంపై తమ పోరాటాన్ని మరింత పెంచుతామని హెచ్చరించారు. సంఘటన స్థలానికి కేంద్ర హోంమంత్రి అమిత్​ షా చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఉగ్రవాదుల కోసం భద్రతాదళాలు గాలింపును ముమ్మరం చేశాయి. 

కుటుంబాలతో ఆనందంగా గడుపుతుండగా..!

ఇటీవల జమ్మూకాశ్మీర్​లో టూరిస్టుల తాకిడి పెరిగింది. అనంతనాగ్ జిల్లా పహల్గాంలోని  బైసరన్..  టూరిస్టులకు స్పెషల్​స్పాట్​ కావడంతో అక్కడికి దేశవిదేశాల నుంచి పర్యాటకులు భారీగా వస్తుంటారు. బెసరన్​ను మినీ స్విట్జర్లాండ్​గా పిలుస్తుంటారు. ఇక్కడికి కాలినడకన, లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉంది. అలా చేరుకున్న దాదాపు 60 మందిలో మంగళవారం మధ్యాహ్నం కొందరు ఫ్యామిలీస్​తో విడిది ఆరుబయట ముచ్చటిస్తూ లంచ్​ చేస్తుండగా.. మరికొందరు గుర్రాలపై ఆ అటవీ ప్రాంతాన్ని పరిశీలిస్తుండగా.. ఆర్మీ యూనిఫామ్​లో వచ్చిన వ్యక్తులు తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. పిట్టలను కాల్చినట్లు కాల్చి చంపారు. కాల్పులతో ఆ ప్రాంతంలో హాహాకారాలు మిన్నంటాయి. ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని పర్యాటకులు పరుగులు తీశారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2.30 గంటల మధ్య ఈ ఘటన జరిగింది. పర్యాటకుల్లో పలువురు హనీమూన్​కు వచ్చిన కొత్త దంపతులు ఉన్నారు. కాల్పుల  అనంతరం ఉగ్రవాదులు అక్కడి నుంచి పారిపోయారు. 

లష్కరే తోయిబా స్థానిక శాఖ పనే

పహల్గాం దాడికి తామే పాల్పడ్డట్టు పాకిస్తాన్‌‌కు చెందిన టెర్రర్​గ్రూపు లష్కరే -తోయిబా స్థానిక శాఖ ది రెసిస్టెన్స్ ఫ్రంట్  (టీఆర్​ఎఫ్​) ప్రకటించింది. 2017 తర్వాత టూరిస్టులపై జమ్మూకాశ్మీర్​లో దాడి జరిగడం ఇదే మొదటిసారి. 2019లో ఆర్టికల్​ 370 రద్దు తర్వాత జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి కూడా ఇదే. ఉగ్రవాదులు అచ్చం 26/11 ముంబై దాడుల తరహాలో పహల్గాం అటాక్​కు తెగబడ్డారు. నలుగురైదుగురు టెర్రరిస్టులు ఆర్మీ, పోలీస్​ యూనిఫామ్​ ధరించి.. ముఖాలకు మాస్కులు పెట్టుకొని, తుపాకులతో టూరిస్టులున్న ఏరియాకు వచ్చారు. ‘మీది ఏ మతం’ అంటూ అడిగిన ప్రాణాలు తీశారు. కొందరు టూరిస్టులతో ప్రార్థనలు చేయించి.. కాల్చి చంపారు. 

ఈ విషయాన్ని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఒకవైపు ప్రధాని మోదీ సౌదీ పర్యటనలో ఉండగా.. అమెరికా ఉపాధ్యక్షుడు జేసీ వాన్స్​ ఇండియాలో పర్యటిస్తుండగా.. పాకిస్తాన్​ టెర్రర్​ సంస్థ జమ్మూకాశ్మీర్​లో టూరిస్టులే లక్ష్యంగా కాల్పులు జరపడం కలకలం రేపింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత నుంచి జమ్మూకాశ్మీర్​లో టూరిస్టులు తాకిడి పెరిగింది. త్వరలోనే అమర్​నాథ్​ యాత్ర ప్రారంభమవుతుండటంతో ఉగ్రదాడి అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. అనంతనాగ్ జిల్లాలోని పహల్గాం మార్గంలో 48 కి.మీ, గండేర్బల్ జిల్లాలో 14 కి.మీ.లు సాగుతుంది. పహల్గాం మార్గంలోని బైసరన్​లోనే ప్రస్తుతం ఉగ్రదాడి జరిగింది.  భద్రతా బలగాలు గాలింపును ముమ్మరం చేశాయి. టూరిస్టులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. జమ్మూకాశ్మీర్​ ప్రభుత్వం ఎమర్జెన్సీ హెల్ప్​ లైన్​ను ఏర్పాటు చేసింది.  

స్పాట్​కు చేరుకున్న అమిత్​ షా

ప్రధాని మోదీ ఆదేశాలతో కేంద్ర హోంమంత్రి అమిత్​షా వెంటనే తన ఇంట్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, సీఎం ఒమర్ అబ్దుల్లా, సీఆర్​పీఎఫ్​డీజీ, జమ్మూ కాశ్మీర్ డీజీ, ఆర్మీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్​లో మాట్లాడారు. పర్యాటకులపై దాడి తీవ్రంగా బాధించిందని, దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని అమిత్​షా హెచ్చరించారు. అనంతరం అమిత్​ షా.. జమ్మూకాశ్మీర్​ బయలుదేరారు. రాత్రి 9 గంటలకు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కాగా, జమ్మూకాశ్మీర్​ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు.  

భార్యాపిల్లల కండ్లెదుటే..

జమ్మూకాశ్మీర్‌‌లో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో తెలంగాణలోని సెంట్రల్ ఇంటెలిజెన్స్‌‌ బ్యూరోలో పనిచేస్తున్న ఓ అధికారి ప్రాణాలు కోల్పోయారు. భార్య, ఇద్దరు పిల్లల కండ్ల ఎదుటే ఆయనను టెర్రరిస్టులు కాల్చి చంపారు. బిహార్‌‌‌‌కు చెందిన మనీశ్‌‌ రంజన్‌‌ హైదరాబాద్​ కోఠిలోని సీబీఐ కాంప్లెక్స్‌‌లో గల ఇంటెలిజెన్స్ కార్యాలయంలో కంప్యూటర్ సెక్షన్ ఆఫీసర్‌‌‌‌గా పని చేస్తున్నారు. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఆయన ఇటీవల జమ్మూకాశ్మీర్‌‌ టూర్​కు వెళ్లారు. అక్కడ ఫ్యామిలీతో ఆనందంగా గడుపుతుండగా టెర్రరిస్టులు అటాక్​ చేశారు. ఆధార్‌‌‌‌ కార్డు, జేబులోని ఐడీ కార్డును పరిశీలించి.. ‘‘నువ్వు ఐబీ ఆఫీసర్‌‌‌‌వు కదా!’’ అని మనీశ్​ను ప్రశ్నించారు. భార్యాపిల్లలు చూస్తుండగానే.. మనీశ్‌‌రంజన్‌‌ను పాయింట్‌‌ బ్లాంక్‌‌లో కాల్చారు.

బాధ్యులను వదలబోం: ప్రధాని

టెర్రర్ ​అటాక్​పై ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించారు. సౌదీ అరేబియాలో ఉన్న ఆయన.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఫోన్‌‌లో మాట్లాడారు. స్వయంగా సంఘటనా స్థలాన్ని సందర్శించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాల్పులు జరిపిన వారికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ‘‘ఈ హేయమైన చర్య వెనుక ఉన్నవారిని వదిలిపెట్టబోం. వారి దుష్ట ఎజెండా ఎప్పటికీ విజయం సాధించదు. టెర్రరిజంపై పోరాడాలనే మా సంకల్పం మరింత బలపడుతుంది” అని అన్నారు  దాడిలో మరణించిన వారి కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియజేశారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. కాగా,  సౌదీ పర్యటనను అర్ధంతరంగా రద్దు చేసుకొని ప్రధాని మోదీ తిరిగి ఢిల్లీకి బయలుదేరారు. 

చెల్లాచెదురుగా డెడ్​బాడీలు

కాల్పుల విషయం తెలుసుకున్న స్థానికులు, భద్రతాదళాలు అక్కడికి చేరుకొని.. సహాయ చర్యలు చేపట్టారు. ఘటన స్థలంలో డెడ్​బాడీలు చెల్లాచెదరుగా పడిపోయాయి. రక్తపు మడుగులో కొందరు ప్రాణాలతో కొట్టుమిట్టాడారు. వారిని ఆర్మీ హెలికాప్టర్​లో దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. కొందరి పరిస్థితి క్రిటికల్​గా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు. మొదట ముగ్గురే చనిపోయినట్లు వార్తలు వచ్చినప్పటికీ.. 26 మంది మృతి చెందారు. మృతుల్లో ఎక్కువ మంది తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్రకు  చెందినవాళ్లు ఉన్నారు. హైదరాబాద్​లోని సెంట్రల్​ ఇంటెలిజెన్స్​ బ్యూరోలో పనిచేస్తున్న మనీశ్​ రంజన్​ కూడా ఫ్యామిలీతో అక్కడికి వెళ్లగా.. భార్యాపిల్లల కండ్లెదుటే ఆయనను టెర్రరిస్టులు కాల్చిచంపారు.  కర్నాటకలోని శివమొగ్గ జిల్లాకు చెందిన రియల్టర్​ మంజునాథ్​రావును సైతం ఇలా చంపేశారు. మృతుల్లో ఇద్దరు ఫారెనర్స్, ఇద్దరు స్థానికులు కూడా ఉన్నారు. 

ఈ దాడి క్షమించరానిది: రాష్ట్రపతి 

 " పహల్గామ్‌ ఉగ్రదాడి దిగ్భ్రాంతికరం. ఇదొక క్రూరమైన, అమానవీయ చర్య. అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకోవడం దారుణం. ఇది క్షమించరానిది. దీనిని నిస్సందేహంగా ఖండించాలి. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా” అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ట్వీట్ చేశారు. 

పహల్గామ్ దాడి ఘటన తీవ్రంగా కలచివేసింది: ట్రంప్

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన టెర్రరిస్టుల దాడిలో 27 మంది టూరిస్టులు చనిపోయిన ఘటనపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ స్పందించారు. పహల్గామ్ దాడి తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ట్రూత్ లో పోస్టు చేశారు. "కాశ్మీర్ ఘటన తీవ్రంగా కలచివేసింది. తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ కు అమెరికా మద్దతుగా నిలుస్తుంది. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా” అని ఆయన పేర్కొన్నారు.

ఈ దారుణ నేరానికి ఎలాంటి క్షమాపణ లేదు: పుతిన్ 

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఖండించారు. ఈ దారుణ నేరానికి కారణమైన సూత్రధారులు, నిందితులు తగిన శిక్షను అనుభవిస్తారని తెలిపారు. "పహల్గామ్‌లో జరిగిన టెర్రర్ అటాక్ లో  సామాన్య పౌరులు చనిపోవడం దురదృష్టకరం. ఈ దారుణ నేరానికి ఎలాంటి క్షమాపణ ఉండదు. దీని సూత్రధారులు, నిందితులకు తగిన శిక్ష పడాలని ఆశిస్తున్నాం" అని పుతిన్ పేర్కొన్నారు. 

కేంద్రం మాటలు చెప్పొద్దు: రాహుల్​

ఉగ్రదాడిని సహించేది లేదని, టెర్రరిజంపై యావత్​ దేశం ఐక్యంగా పోరాడుతుందని కాంగ్రెస్​ అగ్రనేత, లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​గాంధీ తెలిపారు. జమ్మూకాశ్మీర్​లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయనే మాటలు చెప్పడం కేంద్రం మానేసి..అక్కడి పరిస్థితులను చక్కదిద్దాలని, పౌరుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని డిమాండ్​చేశారు. 

మతం అడిగి.. మారణహోమం!

‘‘ప్లీజ్​ భయ్యా.. నా భర్తను కాపాడండి.. ప్లీజ్​!” అంటూ వేడుకుంటున్న ఓ మహిళ.. ‘‘నేను, మా ఆయన కలిసి బేల్​పూరి తింటుండగా.. ‘మీదే మతం’ అని అడిగి మా ఆయనపై కాల్పులు జరిపారు. ప్లీజ్​ మా ఆయనను రక్షించండి”అంటూ మరో మహిళ వేడుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్​ అవుతున్నాయి. భర్త మృతదేహం వద్ద విలపిస్తున్న మరో మహిళ.. ‘ముఝే బచావో’ అంటూ రక్తపు మడుగుల నుంచి ప్రాథేయపడుతున్న ఓ యువకుడు.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పరుగులు తీస్తున్న ఓ బాలుడు.. ఇట్ల బెసరన్​లో ఉగ్రదాడి దృశ్యాలు కలచివేస్తున్నాయి.