టెర్రరిస్టును పట్టుకున్నందుకు 60 మంది రైతుల ఊచకోత
నైజీరియాలో బోకో హరామ్ టెర్రరిస్టుల ఘాతుకం
మైడుగూరి (నైజీరియా): నైజీరియాలో పచ్చని పంటపొలాల్లో రైతుల రక్తం పారింది. తమను వేధించిన ఓ టెర్రరిస్టును కట్టేసి, ఆర్మీకి అప్పగించిన పాపానికి.. 60 మంది రైతులను బోకో హరామ్ మిలిటెంట్లు వెంటాడి గొంతు కోసి చంపేశారు. నైజీరియాలోని బోర్నో స్టేట్ మైడుగూరి సిటీ సమీపంలోని గరిన్ క్వషేబే గ్రామం వద్ద శనివారం ఈ దారుణం జరిగింది. కోతకొచ్చిన వరిచేన్లను తగులబెట్టిన మిలిటెంట్లు.. రైతులను వెంటాడి హత్య చేశారని లోకల్ రైస్ ఫార్మర్స్ అసోసియేషన్ లీడర్ మాలం జబర్మరీ వెల్లడించారు. ఈ ఘటనలో 60 మంది రైతులను హత్య చేసినట్లు తెలుస్తోందని, ఇప్పటివరకూ 44 మృతదేహాలు దొరికాయని అధికారులు వెల్లడించారు. శనివారం బోర్నో స్టేట్ లో లోకల్ గవర్నమెంట్ కౌన్సిళ్లకు13 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఎన్నికలు కూడా జరుగుతున్నాయి.
మిలిటెంట్ ను పట్టుకున్నందుకే..
జబర్మరీ కమ్యూనిటీ రైతులు వరి కోతల పనుల్లో ఉండగా శుక్రవారం బోకో హరామ్ గ్రూప్ కు చెందిన ఓ మిలిటెంట్ వారి వద్దకు వచ్చి తుపాకీతో బెదిరించాడు. తనకు డబ్బులు ఇవ్వాలని, తినడానికి ఏదైనా వండి పెట్టాలని వేధించాడు. తిండి కోసం వెయిట్ చేస్తున్న మిలిటెంట్ వద్ద నుంచి టైంచూసి.. తుపాకీని లాక్కున్న రైతులు అతడిని కట్టేశారు. తర్వాత ఆర్మీకి అప్పగించారు. మిలిటెంట్‌ను అదుపులోకి తీసుకున్న తర్వాత అధికారులు రైతుల భద్రత విషయం పట్టించుకోలేదు. దీంతో ప్రతీకారంతో రగిలిపోయిన మిలిటెంట్లు గన్స్‌తో తరలి వచ్చి రైతులపై దాడి చేశారు. ఆర్మీకి సమాచారం ఇస్తున్నారంటూ నైజీరియాలో రైతులు, జాలర్లను బోకో హరామ్ మిలిటెంట్లు తరచూ చంపుతున్నారు.
దేశమంతా దు:ఖిస్తోంది: ప్రెసిడెంట్ బుహారీ
పొలాల్లో కష్టపడి పని చేసుకుని బతికే రైతులపై ఇంత దారుణానికి ఒడిగట్టడంపై నైజీరియా ప్రెసిడెంట్ ముహమ్మదు బుహారీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దారుణాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు.
For More News..