భద్రతా బలగాలకు టెర్రరిస్టుల ట్రాప్!

భద్రతా బలగాలకు టెర్రరిస్టుల ట్రాప్!
  • తమ ఇండ్లల్లో  ఐఈడీలు అమ‌‌ర్చిన ఉగ్రవాదులు ఆదిల్‌‌ హుస్సేన్‌‌, ఆసిఫ్‌‌ షేక్
  • బలగాలు సోదాలకు వెళ్లగా..ఐఈడీలు పేలి ఇండ్లు ధ్వంసం
  • త్రుటిలో తప్పించుకున్న జవాన్లు
  • టెర్రరిస్టుల కోసం బిజ్​బెహరా, త్రాల్​లో భారీ కూంబింగ్​

శ్రీనగర్​:  పహల్గాం ఉగ్రదాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్న టెర్రరిస్టులు ఆదిల్​ హుస్సేన్​ థోకర్, ఆసిఫ్​ షేక్.. భారత బలగాలను ట్రాప్ చేశారు.  జమ్మూ కాశ్మీర్​లోని బిజ్​బెహరాలో గల తన ఇంట్లో ఆదిల్​ హుస్సేన్​థోకర్, త్రాల్​లోని తన నివాసంలో ఆసిఫ్​ షేక్ ఐఈడీ పేలుడు పదార్థాలను అమర్చారు.  ఈ ఇండ్లల్లో సోదాలకు భద్రతా బలగాలు వెళ్లగా.. ఐఈడీలు యాక్టివేట్​ అయ్యాయి. దీంతో వెంటనే ఇండ్లలోనుంచి ఆర్మీ జవాన్లు బయటకొచ్చారు.

 ఆ ఇండ్లు పేలిపోగా.. భదత్రా బలగాలు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాయి. గాలింపు చర్యలకు వచ్చే జవాన్లకు హాని కలిగించాలనే ఉద్దేశంతోనే ఉగ్రవాదులు ముందుగా తమ ఇండ్లల్లో పేలుడు పదార్థాలు అమర్చి.. ఈ నివాసాల సమాచారం భద్రతా దళాలకు అందేలా ప్లాన్‌‌ చేసి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.

ఉగ్రదాడిలో ఆదిల్​ థోకర్​ కీలక పాత్ర

పహల్గాం దాడిలో ఆదిల్​ థోకర్​ కీలక పాత్ర పోషించినట్టు పోలీసులు భావిస్తున్నారు. పాకిస్తాన్ ​టెర్రరిస్టులకు ఆదిల్ సహకరించినట్టు గుర్తించారు. అతడు 2018లో పాకిస్తాన్​కు వెళ్లి టెర్రరిస్ట్ ​కార్యకలాపాల్లో శిక్షణ పొందాడని, గతేడాది జమ్మూకాశ్మీర్​కు తిరిగి వచ్చినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. థోకర్ తోపాటు ఇద్దరు పాకిస్తానీ జాతీయులు - అలీ భాయ్, హషీమ్ మూసా- గురించి సమాచారం ఇచ్చిన వారికి రూ. 20 లక్షల రివార్డును పోలీసులు ప్రకటించారు. ఈ మేరకు ముగ్గురు ఉగ్రవాదుల స్కెచ్‌‌లతో కూడిన పోస్టర్లను విడుదల చేశారు. వీరిని ఆసిఫ్‌‌ ఫౌజి, సులేమాన్‌‌ షా, అబు తాలాగా గుర్తించారు. మూసా, యూనిస్‌‌, ఆసిఫ్‌‌ అనే కోడ్‌‌నేమ్‌‌లు కూడా ఉన్నట్లు కనుగొన్నారు. ఆదిల్ థోకర్‌‌ కు వీరితో సంబంధం ఉందని గుర్తించారు.  ఊహా చిత్రాల ఆధారంగా బిజ్​బెహరా, త్రాల్​లో భారత భద్రతా బలగాలు కూంబింగ్​ నిర్వహిస్తున్నాయి.