ట్రబులిచ్చిందని కారును పేల్చేసిండు

ట్రబులిచ్చిందని కారును పేల్చేసిండు

హెల్సింకి(ఫిన్​లాండ్): టెస్లా కంపెనీ ఎలక్ట్రిక్​ కారును ఫిన్లాండ్​లో ఓ కస్టమర్​ డైనమేట్​ పెట్టి పేల్చేసిండు. కారు ఈమధ్య బాగా ట్రబులిస్తోందని, టెస్లా సర్వీస్​ సెంటర్​కు తీస్కెళితే రిపేర్​కు చాలా ఖర్చవుతుందని చెప్పడంతో ఇలా చేశానని అంటున్నడు. ఆటో పైలట్​ సహా ఎన్నో ఫీచర్లు, లేటెస్ట్​ టెక్నాలజీతో తయారైన కారులో ఇలాంటి సమస్యలు వస్తాయని ఊహించలేదంటున్నాడు. టెస్లా కంపెనీపై తన అసంతృప్తిని ప్రపంచానికి చూపించడానికే కారును పేల్చేశానని వివరించిండు.
అసలేమైందంటే..
ఫిన్లాండ్​కు చెందిన టుమోస్ కాటెనెన్  ఎనిమిదేండ్ల నుంచి టెస్లా కారు వాడుతున్నడు. మోడల్​ ఎస్​గా పిలిచే ఈ కారు ఖరీదు దాదాపు 50 లక్షలు. ఇందులో ఆటో పైలట్​వంటి అత్యాధునిక ఫీచర్లు కూడా ఉన్నయి. మొదట్లో అంతా మంచిగానే ఉండె కానీ కొంతకాలం నుంచి కారు బాగా ట్రబులిస్తోందని కాటెనెన్​ వాపోతున్నాడు. ఒకరోజు బయటకు వెళ్దామని కారు తీస్తే నడి రోడ్డుపైనే ఆగిపోయిందట. చేసేదేంలేక ఓ ట్రక్కు మాట్లాడి, కారును సర్వీస్​ సెంటర్​కు తీస్కెళ్లిండు. వాళ్లేమో రిపేర్​ చేసిస్తమని చెప్పి, నెల రోజులైనంక కారులో బ్యాటరీ సిస్టం మొత్తం మార్చాలని చెప్పిన్రు. అది మార్చకుంటే కారు ఇట్లనే ట్రబులిస్తుంటదని, కొత్త బ్యాటరీ సిస్టంకు దాదాపు 17 లక్షల దాకా అయితయని వివరించిన్రు. ఎనిమిదేండ్లు కావడంతో వారంటీ కూడా పనిచేయదు. ఇంకేం చేయాల్నో తెల్వక, విసిగిపోయి కారును పేల్చేయాలని డిసైడ్​ అయిండు. హెలికాప్టర్​తో కారును ఎవరూలేని చోటికి తీస్కెళ్లి, 30 కిలోల డైనమేట్​పెట్టి పేల్చేసిండు. టెస్లా ఓనర్​ ఎలన్​ మస్క్​ బొమ్మను కారులో పెట్టి మరీ తన కోపాన్ని ప్రపంచానికి చూపెట్టిండు.