
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా ఇండియాలో అడుగుపెట్టడానికి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కీలక స్థానాలకు రిక్రూట్‌మెంట్‌ను మొదలుపెట్టింది. బిజినెస్ ఆపరేషన్స్ ఎనలిస్ట్, కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్ట్‌లను నియమించుకుంటోంది. అంతేగాక సర్వీస్ అడ్వైజర్, పార్ట్స్ అడ్వైజర్, సర్వీస్ టెక్నీషియన్, సర్వీస్ మేనేజర్, సేల్స్ అండ్ కస్టమర్ సపోర్ట్, స్టోర్ మేనేజర్, సేల్స్ కమ్ కస్టమర్ సపోర్ట్, బిజినెస్ ఆపరేషన్స్ అనలిస్ట్, కస్టమర్ సపోర్ట్ సూపర్‌వైజర్, కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్ట్, డెలివరీ ఆపరేషన్స్ స్పెషలిస్ట్, ఆర్డర్ ఆపరేషన్స్ స్పెషలిస్ట్, ఇన్‌సైడ్ సేల్స్ అడ్వైజర్, కన్జూమర్ ఎంగేజ్‌మెంట్ మేనేజర్లనూ తీసుకుంటోంది. ముంబై సబర్బన్ కోసం వీళ్లు అవసరమని టెస్లా కంపెనీ వెబ్సైట్ పేర్కొంది. ఈ విషయమై టెస్లా కంపెనీకి పంపిన ఈ–మెయిల్‌కు స్పందన రాలేదు. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల అమెరికాలో పర్యటించినప్పుడు టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్‌ను కలుసుకున్న తరువాత కొన్ని రోజులకే రిక్రూట్మెంట్ మొదలయింది.
చాలా కాలంగా ప్రచారం
టెస్లా ఇండియా ఎంట్రీపై చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి. మస్క్ గత ఏప్రిల్‌లోనే మనదేశంలో పర్యటించాల్సి ఉంది. టెస్లాలో చాలా పనులు ఉండటం వల్ల రాలేకపోతున్నానని చెప్పారు. అప్పుడు ఇండియాకు వచ్చి ఉంటే, టెస్లా ఇండియా ఎంట్రీపై అధికారికంగా ప్రకటన చేసి ఉండేవారని భావించారు. ఎలక్ట్రిక్ కార్ల కంపెనీలను ఆకర్షించడానికి కేంద్రం కొత్త ఈవీపాలసీని ప్రకటించింది. 500 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో ఇక్కడ ప్లాంటు పెట్టే ఈవీ కంపెనీలకు దిగుమతి సుంకాల్లో రాయితీలు ఇస్తామని ప్రకటించింది. అప్పుడు కూడా మస్క్ ఇండియా వస్తారని ప్రచారం జరిగింది. అయితే ఈ పాలసీ విషయమై ఏర్పాటు చేసిన సమావేశానికి టెస్లా అడ్వైజర్ కూడా హాజరయ్యారు.
వియత్నాం ఈవీ కంపెనీ విన్‌ఫాస్ట్, మారుతీ సుజుకీ, హుండై, టాటా, మహీంద్రా, కియా, స్కోడా, ఫోక్స్‌వేగన్ ఇండియా, రెనో, మెర్సిడెజ్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి కంపెనీల ప్రతినిధులు సైతం హాజరయ్యారు. ఇండియాలో తమ కార్లను అమ్మడానికి దిగుమతి సుంకాలను తగ్గించాలని మస్క్ తొలిసారిగా 2022లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మొదట ఇక్కడ కార్ల అమ్మకం, సర్వీసింగ్తరువాతే తయారీ చేపడతామని చెప్పారు. ఇదే విషయమై 2021 ఆగస్టులోనూ ఒక ప్రకటన చేశారు. దిగుమతి సుంకాలు ఎక్కువగా ఉన్నాయని, ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఇండియాలోనే ఇవి ఎక్కువని విమర్శించారు. ప్రస్తుతం విదేశాల నుంచి కంప్లీట్లీ బిల్ట్యూనిట్(సీబీయూ) రూపంలో వస్తున్న కార్లపై 70 శాతం నుంచి వంద శాతం వరకు సుంకం విధిస్తున్నారు. ఇంజన్ సైజు, ధర, బీమాను బట్టి ఇది మారుతుందని అధికారులు చెప్పారు.