కేజ్రీవాల్ భవితవ్యానికి పరీక్ష!

కేజ్రీవాల్ భవితవ్యానికి పరీక్ష!

ఢిల్లీ కేవలం 7 మంది ఎంపీ నియోజకవర్గాలతో కూడిన చిన్న రాష్ట్రం.  ఢిల్లీలో బీజేపీ, కాంగ్రెస్​ పార్టీలకు ప్రజాకర్షణ కలిగిన గొప్ప నాయకుడు లేడు. అయినప్పటికీ, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జాతీయ ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. కేజ్రీవాల్  తన పార్టీ ఆమ్​ ఆద్మీ పార్టీ  తరఫున ఒక్క ఎమ్మెల్యే లేదా ఎంపీ కూడా లేకుండానే కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఢిల్లీ నుంచి తరిమికొట్టారు. 

2014 నుంచి  బీజేపీ ఢిల్లీలోని మొత్తం 7 ఎంపీ స్థానాలను గెలుచుకున్నప్పటికీ, కేజ్రీవాల్ ఢిల్లీలో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకున్నారు. కేజ్రీవాల్ నిస్సందేహంగా జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపగల  రాజకీయ నాయకుడు. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్​ అగ్రనేతరాహుల్ గాంధీను పక్కన పెడితే కేజ్రీవాల్ భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ నాయకుడు. 

కేజ్రీవాల్ పార్టీ ఆప్.. భారతీయ ఎన్నికల సంఘం నుంచి ‘జాతీయ పార్టీ’ హోదాను కూడా పొందింది.  దీంతో ఆమ్​ ఆద్మీ పార్టీ అభ్యర్థులు బీజేపీ,  కాంగ్రెస్ అభ్యర్థుల్లాగ భారతదేశంలో ఎక్కడైనా ఒకే గుర్తుపై  పోటీ చేయవచ్చు. పంజాబ్​, ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్​ భారత రాజకీయాల్లో ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. 

రెండు వేర్వేరు రాష్ట్రాలను పాలించిన ఏకైక ప్రాంతీయ పార్టీ ఆప్ మాత్రమే. కేజ్రీవాల్ భవిష్యత్తును ఇయ్యాల 5వ తేదీ ఫిబ్రవరి, 2025న ఢిల్లీ ఓటర్లు  నిర్ణయించనున్నారు. కేజ్రీవాల్ పార్టీ మరోసారి గెలిస్తే.. బీజేపీ, కాంగ్రెస్ రెండింటిలోభారీ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఒకవేళ  కేజ్రీవాల్ ఓడిపోతే ఆయన రాజకీయ మనుగడ కష్టం అవుతుంది.  అంతేకాకుండా, మరోవైపు ఆప్​ సారథ్యంలోని  పంజాబ్  ప్రభుత్వం ఫిరాయింపులను, పతనాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. 

మోదీ ఢిల్లీని ఎందుకు కోరుకుంటున్నారు?

జూన్ 2024న జరిగిన పార్లమెంటు ఎన్నికలు కేంద్రంలో అధికారం చేపట్టడానికి కావాల్సిన  పూర్తిస్థాయి  విజయాన్ని బీజేపీకి అందించలేదు. అప్పటి నుంచి బీజేపీ తన ప్రతిష్టను తిరిగి పొందడానికి, వివిధ రాష్ట్రాల ఎన్నికలలో గెలవడానికి ప్రయత్నిస్తోంది.  ఈక్రమంలో బీజేపీ మహారాష్ట్ర, హర్యానాలను గెలుచుకుంది. ఆ రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి తన ప్రతిష్టను పెంచుకుంది. 

ఇప్పుడు   ఢిల్లీని గెలిస్తే..  బిహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో  జరగబోయే ఎన్నికలను బీజేపీ సమర్థవంతంగా  ఎదుర్కోగలదు.  ప్రజలు తన ఆకర్షణ తగ్గిందని భావిస్తున్నారని ప్రధాని మోదీకి తెలుసు.  దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల  ఎన్నికలలో బీజేపీ గెలవడం ద్వారా నరేంద్ర మోదీ ఇమేజ్ మళ్లీ  పెరుగుతుంది.  మరో పెద్ద రహస్యం కూడా దీనిలో ఉంది.  

ప్రధాని నరేంద్ర మోదీ 2025 ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలుస్తున్నారు. ఒకవేళ బీజేపీ  ఢిల్లీలో   గెలిస్తే,  ఆయన   ప్రజాదరణ తిరిగి పొందడంతోపాటు ఢిల్లీ  విజయం మోదీ ఇమేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పెంచుతుంది. అలాకాకుండా బీజేపీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో  ఓడిపోతే, మోదీ  ప్రజాదరణ  పొందలేదని  ట్రంప్ భావించవచ్చు.  మోదీ కలలు సాకారం అవుతాయో లేదో  చూడాలి. 

ఇండియా కూటమిపై కేజ్రీవాల్ ప్రభావం

ఢిల్లీలో బీజేపీని తాను మాత్రమే ఓడించగలనని, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అవకాశం లేదని చెబుతున్నందున చాలామంది ఇండియా కూటమి భాగస్వాములు కేజ్రీవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మద్దతు ఇచ్చారు. అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, ఉద్ధవ్ థాకరే, శరద్ పవార్ తదితరులు అరవింద్ కేజ్రీవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇప్పటికే మద్దతు ప్రకటించారు. 

కేజ్రీవాల్ మరోసారి ఢిల్లీలో గెలిస్తే.. ఇండియా  కూటమి నాయకత్వం నుంచి కాంగ్రెస్​ వైదొలగాలని ఆయన డిమాండ్ చేస్తారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర,  హర్యానాలో ఓటమిపాలైన తర్వాత, కాంగ్రెస్ ఇండియా కూటమి నాయకత్వం నుంచి వైదొలగాలని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు.  కేజ్రీవాల్ గెలిస్తే  కాంగ్రెస్ తలవంచాల్సి ఉంటుంది. రాజకీయపరంగా  ఇది రాహుల్ గాంధీకి  పెద్ద ఓటమి అవుతుంది. కేజ్రీవాల్ ఓడిపోతే మాత్రం ఆయన ప్రభావం ఇండియా కూటమిలో తక్కువ అవుతుంది. 

కేజ్రీవాల్​, రాహుల్​కు ఇదో  పరీక్ష 

కేజ్రీవాల్ ఇప్పటికీ పంజాబ్ ప్రభుత్వాన్ని నియంత్రిస్తున్నారు. కానీ, ఆయన వ్యక్తిగత ప్రతిష్ట దిగజారిపోతుంది. కేజ్రీవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మద్దతు ఇచ్చిన పార్టీలు కూడా రాజకీయ పరిస్థితిని తిరిగి అంచనా వేస్తాయి. కేజ్రీవాల్ ఓడిపోతేనే  కాంగ్రెస్ సురక్షితంగా ఉంటుంది. అదేవిధంగా కాంగ్రెస్​ పార్టీకి మరో అవకాశం కూడా ఉంది. 

ఢిల్లీలో హంగ్- ఏర్పడి  కేజ్రీవాల్ కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగితే, కాంగ్రెస్ ఇండియా కూటమిలో  కోల్పోయిన ప్రాభవాన్ని తిరిగి  పొందుతుంది. రాజకీయాల్లో బద్ధ శత్రువులు కూడా కొన్ని నిమిషాల్లోనే మంచి స్నేహితులుగా మారిపోతారు. 100 సంవత్సరాల క్రితం గొప్ప రచయిత జార్జ్ బెర్నార్డ్ షా ఇలా అన్నాడు ‘రాజకీయాలు వింతైన 
స్నేహితులను తయారుచేస్తాయి’.  తెలుగు రాష్ట్రాల్లో కూడా బద్ద శత్రువులు అకస్మాత్తుగా ప్రాణస్నేహితులుగా ఎలా మారతారో మనం చూశాం.

ఎన్నికలు ఎల్లప్పుడూ  అనూహ్య పరిణామాలను కలిగిస్తూ ఉంటాయి. కేజ్రీవాల్ గెలిస్తే ఆయన మళ్ళీ జాతీయ స్థాయిలో ప్రముఖుడిగా మారతాడు.  ఇండియా అలయన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని చాలామంది సభ్యులు కేజ్రీవాల్ విజయాన్ని సంతోషంగా స్వాగతిస్తారు. తద్వారా కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెద్దరికాన్ని తగ్గించవచ్చు. 

రాహుల్ గాంధీ స్థానంలో మమతా బెనర్జీని  ఇండియా కూటమి నాయకురాలిగా  కేజ్రీవాల్ ప్రతిపాదించే అవకాశం లేకపోలేదు. కానీ,  కేజ్రీవాల్ ఓడిపోతే ఆయన భవిష్యత్తు చాలా అంధకారంగా మారుతుంది. కేజ్రీవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మరిన్ని సమస్యలు ఎదురవుతాయి. 12 సంవత్సరాలుగా కేజ్రీవాల్ దూకుడుగా ఉన్నారు. 

2020– 2025 మధ్య  కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ వంటి తీవ్రమైన అవినీతి ఆరోపణలను ఎదుర్కోవలసి వచ్చింది.  జైలుకు వెళ్లడం ద్వారా  ఆయన సందిగ్ధంలో పడ్డాడు. ఆయన ఎదుర్కొన్న పరిణామాలు  కేజ్రీవాల్​ ఇమేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దెబ్బతీశాయి.  కేజ్రీవాల్ ఓడిపోతే ఆయన తన అహంకారం,  వైఫల్యాలకు తనను తాను నిందించుకోవాల్సి ఉంటుంది.

ఢిల్లీలో ‘ఉచిత యుద్ధం’

ఢిల్లీ ఎన్నికలు  సందర్భంగా  ‘ఫ్రీబీస్​ వార్​’ జరుగుతోంది.  కేజ్రీవాల్ ఇచ్చిన ఉచితాల వల్లే ఆయన ఎన్నికల్లో గెలుస్తున్నారని  బీజేపీ నమ్ముతోంది. కాబట్టి,  భారీ ఉచితాల ఆఫర్లలో బీజేపీ కేజ్రీవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అధిగమించింది.  ఎన్నికల్లో గెలవడానికి ‘ఫ్రీబీస్​’ సరిపోతాయా లేదా అని ఢిల్లీ ఎన్నికలు నిర్ణయిస్తాయి. 

కేజ్రీవాల్ అందించే దానికంటే బీజేపీ ఎక్కువ ఇస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. అయినా బీజేపీ ఓటమిపాలైతే ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విశ్వసించాలని నిర్ణయించుకున్నారని అర్థం. కాగా, 2013 నుంచి ఢిల్లీ ఓటర్లు పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని,  రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి కేజ్రీవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సమర్థించారు. ఫిబ్రవరి 8, 2025న ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పుడు, ఢిల్లీ  ప్రజలు కేజ్రీవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  కొనసాగుతారా  లేదా వారు మార్పు కోరుకుంటున్నారా, కేజ్రీవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో విసుగు చెందారా అనేది మనకు తెలుస్తుంది.

ఆప్​ ఒక గొప్ప ప్రయోగం

 కేజ్రీవాల్, ఆమ్​ ఆద్మీ పార్టీ (ఆప్​) భారత ప్రజాస్వామ్యంలో ఒక గొప్ప ప్రయోగం.  కేజ్రీవాల్ భారతదేశ ఎన్నికలలో గొప్ప మార్పును తీసుకువచ్చారు. చాలామంది  సాధారణ ప్రజలు ఎమ్మెల్యేలు, మంత్రులు అయ్యారు. భారతదేశానికి కొత్త రాజకీయాలు అవసరం. కానీ, కేజ్రీవాల్ ఓడిపోతే, ఆయన పేలవమైన పాలన, అవినీతి ద్వారా తన సొంత కలను పాడు చేసుకున్నాడని అర్థం.  

భారతదేశ రాజకీయాలు వంశ పారంపర్య , డబ్బు, అవినీతితో కొనసాగుతున్నాయి. దేశ రాజకీయాల్లో ధనవంతులకు మాత్రమే కీలక స్థానం ఉంటుంది. గొప్ప గ్రీకు తత్వవేత్త హెరాక్లిటస్ 2500 సంవత్సరాల క్రితమే ‘మార్పు మాత్రమే ఖచ్చితం’ అని అన్నారు. కానీ, గొప్ప ఫ్రెంచ్ రచయిత జీన్ బాప్టిస్ట్ కర్ 200 సంవత్సరాల క్రితం ఇలా  రాశాడు.. ఎక్కువ విషయాలు మార్పు చెందితే, అవి అలాగే కొనసాగుతాయి. ఎవరు సరైనవారో చూద్దాం.

- పెంటపాటి పుల్లారావు,పొలిటికల్​ ఎనలిస్ట్-