
రెడీ ఫర్ టెట్
తెలంగాణ సర్కార్ టీచర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో డీఎస్‌సీకి ముందు రాయాల్సిన టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. టెట్ కేవలం అర్హత పరీక్ష మాత్రమే కాదు. పోటీ పరీక్ష కూడా. టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (డీఎస్‌సీ)లో 20 శాతం మార్కులు వెయిటేజి ఇస్తారు. కాబట్టి గతంలో టెట్ రాసిన అభ్యర్థులు కూడా మార్కులు పెంచుకోవడం కోసం మళ్లీ రాస్తున్నారు. టెట్‌లో క్వాలిఫై అవడంతో పాటు మంచి స్కోర్ ఎలా సాధించాలి, ప్రిపరేషన్ ప్లాన్, ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి తెలుసుకుందాం..
విద్యాహక్కు చట్టం ప్రకారం సెక్షన్ 23(1) నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేయాలంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)లో అర్హత పొందడం తప్పనిసరి.
టెట్ రాయడానికి ఎవరు అర్హులు?
ఇంటర్ తర్వాత డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పూర్తిచేసినవారు టెట్ పేపర్-–1 పాసవ్వాలి. డిగ్రీ తర్వాత బీఈడీ చేసినవారు టెట్ పేపర్–-2లో ఉత్తీర్ణత సాధించాలి. ఎన్‌సీటీఈ దేశవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల కొరత దృష్ట్యా బీఈడీ అభ్యర్థులకు పేపర్–-1 రాసే అవకాశం ఇచ్చింది. బీఈడీ, డీఈడీ సెకండ్ ఇయర్ చదివే విద్యార్థులు కూడా రాయొచ్చు. పీజీటీ/ జేఎల్ అభ్యర్థులు టెట్ రాయాల్సిన అవసరం లేదు.
ప్రస్తుతానికి 1 నుంచి 5వ తరగతి వరకు బోధించే ఎస్‌జీటీ టీచర్లు (ప్రైమరీ, స్కూల్ టీచర్లు) టెట్ పేపర్-–-1 రాయాలి. 6,7,8 తరగతులు బోధించే స్కూల్ అసిస్టెంట్లు, టీజీటీ (ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు), టెట్ పేపర్-–2లో అర్హత సాధించాలి.
టెట్ వ్యాలిడిటీ: ఎన్‌సీటీఈ మార్గదర్శకాల ప్రకారం టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్‌కు లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఉంటుంది. 2011 నుంచి టెట్ రాస్తున్న అభ్యర్థులకూ, కొత్తగా టెట్ రాయబోయే అభ్యర్థులకూ ఈ నియమం వర్తిస్తుంది.
వెయిటేజి: ఎందుకంటే టెట్లో తెచ్చుకున్న ప్రతి 15 మార్కులకూ 2 మార్కుల వెయిటేజి ఇస్తారు. టెట్ క్వశ్చన్ పేపర్ తెలుగు, ఇంగ్లిష్- మీడియాల్లో ఉంటుంది.
ఎగ్జామ్ ప్యాటర్న్
టీఎస్ టెట్ – 2022 పరీక్షలో రెండు పేపర్లు (పేపర్–-1, పేపర్–- 2) ఉంటాయి. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు భోధించాలనుకునేవారు పేపర్ 1 పరీక్షకు హాజరవ్వాలి. ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు చెప్పేవారు పేపర్ 2 పరీక్ష రాయాలి. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగరతి వరకు భోధించాలనుకునేవారు పేపర్–- 1, పేపర్–-2 (రెండింటికి) హాజరు కావాలి. నెగెటివ్ మార్కులులేవు. ఓసీ జనరల్ అభ్యర్థులకు 90 మార్కులు, బీసీ కేటగిరీకి 75 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ అభ్యర్థులకు 60 పాస్ మార్కులుగా నిర్ధారించారు.
సబ్జెక్ట్ - సిలబస్
చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజి: ఈ సబ్జెక్ట్ చదివేటప్పుడు కీలకమైన మూడు విభాగాలపై అవగాహన ఏర్పరుచుకోవాలి. మొదటి యూనిట్ శిశువికాసం. ఇందులో వికాస దశలు, వికాస సిద్ధాంతాలు, వైయక్తిక భేదాలు కన్పించే అంశాలైన ప్రజ్ఞ, సహజ సామర్థ్యాలు, వైఖరులు, అభిరుచులు, సృజనాత్మకత, ఆలోచన, మూర్తిమత్వం, మానసిక ఆరోగ్యం- శిశు అధ్యయన పద్ధతుల మీద ఎక్కువ ఫోకస్ చేయాలి.
చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజిలో అభ్యసనం (లర్నింగ్) యూనిట్‌లో ప్రధాన అంశాలైన అభ్యసనా సిద్ధాంతాలు, అభ్యసన బదలాయింపు, ప్రేరణ, అభ్యసన అంగాలు, స్మృతి-విస్మృతిపై ఎక్కువగా దృష్టి పెట్టాలి.
అధ్యాపన శాస్త్రం (పెడగాజి)లో కీలకమైన సహిత విద్య, బోధన దశలు, బోధన ఉపగమాలు, నిరంతర సమగ్ర మూల్యాంకనం, ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం (2009), జాతీయ పాఠ్యప్రణాళిక చట్రం (2005) ప్రాక్టీస్ చేయాలి.
లాంగ్వేజెస్: లాంగ్వేజ్-–-1, లాంగ్వేజ్-–-2లకు సంబంధించి ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిన పాఠ్య పుస్తకాల్లోని వ్యాకరణ అంశాలు, వాటి ఉదాహరణలు బాగా చదవాలి. సిలబస్‌లో ఇచ్చిన సాహిత్యం అవగాహన చేసుకోవాలి.
కంటెంట్ పై పట్టు పెంచుకోవడమెలా?
పేపర్-1 అభ్యర్థులు మ్యాథ్స్, సైన్స్, సోషల్ కంటెంట్‌ను 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదవాలి. పేపర్-2 అభ్యర్థులు 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కంటెంట్ చదవాలి. తెలుగు అకాడమీ లాంటి ప్రామాణిక పుస్తకాలు చదవాలి.
మ్యాథ్స్ కంటెంట్‌లో అర్థమెటిక్, సంఖ్యావ్యవస్థ, రేఖాగణితం, క్షేత్రమితి, బీజగణితం, దత్తాంశ నిర్వహణ యూనిట్లపై ఫోకస్ చేయాలి.
సైన్స్ కంటెంట్‌లో సజీవ ప్రపంచం, జీవప్రక్రియలు, సహజ దృగ్విషయాలు, మన పర్యావరణం యూనిట్లు బాగా చదవాలి.
సోషల్‌లో 6 థీమ్‌లు ఉన్నాయి. 1. భూమి వైవిధ్యం- మాన చిత్రాలు 2. ఉత్పత్తి- వినిమయం, జీవనాధారాలు 3.రాజకీయ వ్యవస్థలు- పరిపాలన 4.సామాజిక వ్యవస్థీకరణ - అసమానతలు 5.మతం-సమాజం 6. సంస్కృతి విభాగాలు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి.
కంటెంట్ చదివేటప్పుడు 3, 4, 5 తరగతులకు రాసిన పాఠ్యాంశం, ఎక్కువ తరగతులు 6, 7, 8, 9, 10లో పునరావృతం అయినప్పుడు ఒకేసారి చదివి భావనలు అర్థం చేసుకోవాలి. చదివింది గుర్తు పెట్టుకోవడానికి రివిజన్ చాలా ముఖ్యం. కఠినంగా ఉన్న అంశాలను ఫ్రెండ్స్, టీచర్స్‌తో చర్చించాలి. ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్‌తో మంచి మార్కులు పొందొచ్చు.
ప్రిపరేషన్ స్ట్రాటజీ
జూన్ 12న టెట్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. కావున అభ్యర్థులు ఇప్పటినుంచే ప్రణాళిక ప్రకారం టైమ్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వాలి. టెట్- పేపర్–-1 రాసే అభ్యర్థులు కంటెంట్ 3 నుంచి 8 తరగతుల వరకు చదవాలి. పేపర్-–-2 రాసే అభ్యర్థులు కంటెంట్ 3 నుంచి 10వ తరగతి స్థాయి వరకు చదవాలి. తెలుగు అకాడమీ పుస్తకాలు చదివి నోట్సు రాసుకోవాలి. సాధన చేయాలి. ప్రైవేట్ పబ్లికేషన్స్ కాకుండా తెలుగు అకాడమీ బుక్స్ చదివి, నోట్స్ రాసుకొని రివిజన్ చేయడం వలన ఎక్కువ స్కోర్ చేయవచ్చు.
పేపర్-1: ఇది మొత్తం 150 మార్కులకు ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటుంది. పరీక్షా సమయం రెండున్నర గంటలు.
సబ్జెక్ట్ ప్రశ్నలు మార్కులు
1. చైల్డ్ డెవలప్‌మెంట్
అండ్ పెడగాగి 30 30
2. లాంగ్వేజ్ –-1 30 30
3. లాంగ్వేజ్ –-2 (ఇంగ్లిష్) 30 30
4. మ్యాథ్స్ 30 30
5. ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ 30 30
మొత్తం 150 150
పేపర్-2 : ఇందులో మొత్తం 150 మార్కులకు ఆబ్జెక్టివ్ రూపంలో ప్రశ్నలు ఉంటాయి. పరీక్షా సమయం రెండున్నర గంటలు ఉంటుంది.
సబ్జెక్ట్ ప్రశ్నలు మార్కులు
1) చైల్డ్ డెవలప్‌మెంట్
అండ్ పెడగాగి 30 30
2) లాంగ్వేజ్–- 1 30 30
3) లాంగ్వేజ్–- 2 (ఇంగ్లిష్) 30 30
4) మ్యాథమెటిక్స్, సైన్స్ టీచర్లు (మ్యాథమెటిక్స్, సైన్స్), సోషల్ టీచర్లు (సోషల్ స్టడీస్) 60 60
నోటిఫికేషన్
అర్హత: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్‌ఈడీ)/ డీఈడీ/ బీఈడీ/ లాంగ్వేజ్ పండిట్/ తత్సమాన అర్హతలు ఉన్న అభ్యర్థులతో పాటు చివరి ఏడాది చదువుతున్న వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు, అర్హులైన అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు రూ.300 చెల్లించాలి.
దరఖాస్తులు ప్రారంభం: 26 మార్చి, చివరి తేది: 12 ఏప్రిల్ వరకు అప్లై చేసుకోవాలి. హాల్‌టికెట్లు జూన్ 6న డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఎగ్జామ్: 12 జూన్ (పేపర్ 1: ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు, పేపర్ 2: మధ్యాహ్నం 2.30 నుంచి 5.00 గంటల వరకు) పరీక్ష నిర్వహిస్తారు. రిజల్ట్స్ జూన్ 27న రిలీజ్ చేస్తారు.
వెబ్సైట్: www.tstet.cgg.gov.in
డా. మోజెస్ ఎమిలి అకాడమీ, హైదరాబాద్