
- నెలాఖరులోగా స్కూళ్లకు రీ ఓపెన్ రోజు పిల్లల చేతికి పుస్తకాలు...
ఆసిఫాబాద్, వెలుగు: రానున్న విద్యా సంవత్సరానికి పిల్లలకు కావాల్సిన పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరుకున్నాయి. ఈనెలాఖరు నాటికి పూర్తి స్థాయిలో పుస్తకాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఈ పుస్తకాలు స్కూల్ రీ ఓపెన్ రోజున పిల్లలకు అందించేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఉచిత పుస్తకాలు పక్కదారి పట్టకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. మండలాల వారీగా నంబర్లు వేసి జిల్లా కేంద్రంలోని గోదాం నుంచి మండలాల ఎంఆర్సీలకు పంపిణీ చేయనున్నారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు అన్ని సబ్జెక్టలకు కలిపి 3,71,967 పుస్తకాలు అవసరముండగా మే 24 నాటికి 2,79 ,373 పుస్తకాలు జిల్లాకు చేరుకున్నాయి. మరో 92,594 పుస్తకాలు రావాల్సి ఉంది. జిల్లాలో 1072 ప్రభుత్వ పాఠశాలలుండగా 64,141 విద్యార్థులు చదువుకుంటున్నారు. జిల్లాలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ మీడియం స్కూళ్లు ఉన్నాయి. ఒకటి నుంచి పది తరగతుల వరకు మండల , జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలలతో పాటు అన్ని యాజమాన్యాల పరిధిలోని గురుకుల పాఠశాలలు ,ఆదర్శ ,కస్తూర్బాలు, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలకు ఈ ఉచిత పుస్తకాలు అందజేయనున్నారు.
పుస్తకాల పంపిణీ ప్రారంభం..
జిల్లాకు వచ్చిన పుస్తకాలను శుక్రవారం నుంచి ఆయా మండలాలకు పంపిణీ చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో నుంచి మండలాల ఎంఈఓలకు పుస్తకాలు పంపిస్తారు. ఎంఈఓ లు స్కూల్ హెచ్ఎంలకు పంపిణీ చేస్తారు. గురుకుల పాఠశాల, ఆశ్రమ పాఠశాలలకు సంబంధిత డిపార్ట్మెంట్ హెడ్ కు అందజేస్తారు. ప్రైవేట్ స్కూల్ లలో చదువుకునే స్టూడెంట్స్ ప్రభుత్వ సిలబస్ ప్రకారం ముద్రించే పుస్తకాలను ప్రతి జిల్లాలో విద్యాశాఖ గుర్తించిన బుక్ స్టాల్స్ లో అందుబాటులో ఉంచుతారు. ఈ దుకాణాల్లో రూల్స్ ఉల్లంఘించకుండా విద్యాశాఖ నియంత్రణ చేస్తుంది. అధికారుల పర్యవేక్షణ
ఉంటుంది.
స్కూల్ రీ ఓపెన్ నాటికి స్టూడెంట్స్ కు బుక్స్
ప్రభుత్వ ఉచిత పాఠ్యపుస్తకాలు జిల్లాకు ఇప్పటి వరకు75 శాతం చేరుకున్నాయి.మిగతా బుక్స్ ఈ వారం రోజుల్లో వస్తాయి. స్కూల్ రీ ఓపెన్ నాటికి ఎంఈఓల ద్వారా స్కూల్ లకు చేర్చే చర్యలు తీసుకుంటున్నం.ఈరోజు నుండి జిల్లా కేంద్రంలోని గోదాం నుండి మండలాలకు బుక్స్ పంపిణీ ప్రారంభించం.
అశోక్, డీఈఓ, ఆసిఫాబాద్