హైదరాబాద్, వెలుగు: గిరిజన ప్రాంతాల్లోని స్కూళ్లలో చదివే పిల్లలకు వారి భాషలోనే టెక్ట్స్ బుక్స్ అందించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ట్రైబల్ భాషలోనే బుక్స్ ఉండాలని నిర్ణయించింది. గిరిజనులు ఉన్న అన్ని రాష్ట్రాలు ట్రైబల్ భాషల్లో బుక్స్ ప్రిపేర్ చేయాలని ఆదేశించింది. ఇందుకు అయ్యే ఖర్చును కేంద్రం రాష్ట్రాలకు ఇవ్వనుంది. రాష్ట్రంలో ఇప్పటికే 1,2 తరగతుల వారికి గోండు, కోయ, బంజారా, కోలాముల భాషల్లో బుక్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు 3వ తరగతి బుక్స్ ను కూడా అధికారులు ప్రిపేర్ చేస్తున్నారు.
అందులో భాగంగా ఈ నెల18, 19, 20 తేదీల్లో ఈ తెగల భాషలను బోధించే టీచర్లతో ట్రైబల్ డిపార్ట్ మెంట్ హైదరాబాద్లో ఓరియంటేషన్ ప్రోగ్రాంను నిర్వహించనుంది. ఈ నాలుగు తెగల భాషలను బోధించే టీచర్ల నుంచి సమాచారాన్ని తీసుకుని 30, 40 పేజీలతో అధికారులు బుక్స్ ను రెడీ చేయనున్నారు. 5వ తరగతి వరకు వారి బాషల్లో బుక్స్ రెడీ చేయాలని, ఇందుకు అయ్యే మొత్తం ఖర్చును కేంద్ర గిరిజన శాఖ భరిస్తుందని అధికారులు చెబుతున్నారు. రాష్ర్టంలో ఈ నాలుగు తెగలకు చెందిన స్టూడెంట్స్ 25వేల మంది ఉండగా వీరికి ఈ బుక్స్ పంపిణీ చేయనున్నారు.