క్విటో : సరదా కోసం బీచ్ కు వెళ్లిన ముగ్గురు యువతులు దారుణహత్య గురయ్యారు. ఏప్రిల్ 5వ తేదీన జరిగిన ఈ ఘటనపై ఇంకా మిస్టరీ వీడలేదు. నిందితులను పోలీసులు ఇంకా పట్టుకోలేదు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు సాగిస్తున్న పోలీసులకు అనేక అనుమానాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అసలు ఇంతకు ఈ ముగ్గురిని ఎవరు చంపారు..? ఎందుకు చంపారు..? వీళ్లను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది..? ఏదైనా మాఫియా వీళ్ల ముగ్గురిని చంపిందా..? లేక పోకిరీలే చంపారా..? అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
హత్యలకు ముందు ముగ్గురు యువతులు చాలా చిత్రహింసలకు గురయ్యారని తెలుస్తోంది. అంతేకాదు..హత్యలకు ముందు ప్రమాదం ఏదో జరగబోతోందని గ్రహించి.. తమ కుటుంబ సభ్యులకు, తమ ఫ్రెండ్స్ కు మెసేజ్ లు పంపించారు. ఇప్పుడు ఈ మెసేజ్ ల ద్వారా కూడా పోలీసుల ఇన్వెస్ట్ గేషన్ కొనసాగుతోంది. అయినా మిస్టరీ వీడడం లేదు. అంతేకాదు.. ముగ్గురు యువతులు హత్యకు గురైన ప్రదేశంలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అణువణువూ జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని.. అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. అయినప్పటికీ కేసు కొలిక్కి రావడం లేదు.
అసలేం జరిగింది..?
డెన్నిసి రేనా(19), యులియానా మాసియస్(21), నయేలి తాపియా(22) అనే ముగ్గురు యువతులు క్లోజ్ ఫ్రెండ్స్. ఈక్వెడార్‌లోని క్వినెడే సమీపంలో ఎస్మరాల్డస్ బీచ్‌కు వెళ్లి సరదాగా గడుపుదామని ప్లాన్ చేసుకున్నారు. ముందుగా అనుకున్న ప్రకారమే ఏప్రిల్ 4వ తేదీన ఎస్మరాల్డస్ బీచ్‌కు వెళ్లారు. అక్కడ చాలాసేపు సరదాగా గడిపారు. స్విమ్ సూట్ లాంటి దుస్తులు ధరించి హాయిగా సేదతీరారు.
అయితే... ఉన్నట్టుండి ఏం జరిగిందో ఏమో తెలియదు. కానీ.. ఈ ముగ్గురూ ఊహించని ప్రమాదంలో పడ్డారు. ఎవరో వారిని వెంబడించారు. దీంతో తమకు ఏదో జరగబోతోందని గ్రహించి.. తమ వాళ్లకు ఫోన్ల ద్వారా మెసేజ్ లు పంపించారు. ఆ మెసేజ్‌లు రాత్రి 11 గంటల 10 నిమిషాల సమయంలో కుటుంబ సభ్యులకు అందాయి. వాటిని చూసిన వెంటనే కుటుంబ సభ్యులకు టెన్షన్ కు గురయ్యారు. వారు అనుకున్నట్టే.. జరగకూడని ఘటన జరిగింది.
హత్యకు గురయ్యే ముందు నయేలి.. తన సోదరికి వాట్సాప్ సందేశం పంపింది. 'ఏదో జరగబోతుంది అని నాకు అనిపిస్తుంది. అందుకే మెసేజ్ చేస్తున్నా' అని నయేలి మెసేజ్ లో తెలిపింది. వెంటనే నయేలికి ఆమె సోదరి కాల్ చేయగా.. స్విచాఫ్ వచ్చింది. నయేలికి పెళ్లైంది. నాలుగేళ్ల కుమార్తె కూడా ఉంది. మరో యువతి డెన్నిస్ హత్యకు గురికావడానికి ముందు తన బాయ్‌ఫ్రెండ్‌కు ఒక మెసేజ్ పంపించింది. 'ఏదో జరగబోతుందని నాకు అనిపిస్తోంది. ఒకవేళ నాకేదైనా జరిగితే.. ఒక్క విషయం గుర్తుంచుకో.. ఐ లవ్ యూ వెరీ మచ్' అని మెసేజ్ చేసింది.
యువతులు తమ వాళ్లకు మెసేజ్ లు చేసిన కొన్ని గంటల్లోనే దారుణహత్యలకు గురయ్యారు. వారిని ఎవరు..? ఎందుకు చంపారో కూడా ఎవరికీ తెలియదు. ఎస్మరాల్డస్ బీచ్ లో అర్ధనగ్నంగా ఉన్న వీరిని చిత్ర హింసలు పెట్టి పదునైన ఆయుధాలతో దుండగులు గొంతులు కోశారని గుర్తించారు పోలీసులు. చంపిన తర్వాత నిందితులు ముగ్గురి డెడ్ బాడీలను పూడ్చిపెట్టారు. ఏప్రిల్ 5వ తేదీన చేపల వేటకు వెళ్లిన జాలర్లు.. ఓ కుక్క ముగ్గురు మృతదేహాల వద్ద తవ్వడం చూశారు. ఏంటని దగ్గరకు వెళ్లి చూడగా యువతుల శవాలు కన్పించాయి. వెంటనే కంగారు పడిన జాలర్లు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. కేసులు నమోదు చేసుకున్నారు. హత్యలు ఎలా జరిగాయి..? అనే విషయాలపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. దగ్గరలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఇప్పటి వరకూ ఎలాంటి క్లూ లభించలేదు. ముగ్గురిని ఎవరో చంపారో పోలీసులు తేల్చలేకపోతున్నారు. ఇది ఒక మిస్టరీగా మారింది. పోలీసులకు ఈ కేసు చాలెంజ్ గా మారింది. నిందితులను కనిపెట్టి.. వారిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.
ముగ్గురిలో ఓ యువతి బీచ్‌కు వెళ్లిన రోజు సమీపంలోని ఓ హోటల్‌లో గడిపింది. దీంతో అధికారులు క్లూ కోసం సీసీటీవీ రికార్డులను పరిశీలిస్తున్నారు. ముగ్గురిలో ఇద్దరు మరో దేశం వెళ్లి స్థిరపడాలనుకున్నారని, కానీ ఇంతలోనే ఇలా ప్రాణాలు కోల్పోతారని ఊహించలేదని బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.